తాడేపల్లి: మంచి చేస్తారని మోసపు హామీలు నమ్మి ప్రజలు కూటమికి అధికారమిస్తే విచ్చలవిడిడా దోచేస్తూ రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచేశారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లు ఎక్కీ దిగే విమానాలు హెలిక్యాప్టర్‌ల ఖర్చుల తోనే రాష్ట్రం సగం అప్పులపాలైందని, 23 నెలల్లోనే రూ. 3.61 లక్షల కోట్లు అప్పులు చేసి కూడా కనీసం ఒక్క కొత్త పింఛన్ ఇచ్చిన పాపానపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్సాలు చాలవన్నట్టు విచ్చలవిడి అవినీతితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారి పోయిందని చెప్పారు. ఇప్పటికే హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీలు ఉండగా కొత్తవి నిర్మాణం పేరుతో అంచనాలు పెంచేసి దోచుకుంటున్నది సరిపోనట్టు అద్దాలు బిగించే పేరుతో మరో రూ. 2500 కోట్లు ఖర్చు చేస్తామనడం కూటమి అవినీతికి పరాకాష్ట అని మండిపడ్డారు. కూటమి అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఆ కేసులను హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వాదించే పేరుతో కూడా భారీగా బిల్లులు చెల్లిస్తున్నారని చెప్పారు. చంద్రబాబే సంక్షోభాలను సృష్టించి ఆదాయంగా మలచుకోవడం, ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఈ రెండేళ్లుగా జరుగుతున్న ఒకే ఒక్క కార్యక్రమం అని విమర్శించారు. రాష్ట్రంలో ఇంధన కొరతను సృష్టించి రూ 150 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... - అక్రమాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు చంద్రబాబు మాయమాటలు నమ్మి ఎంతో నమ్మకంతో అధికారం చేతికిస్తే ప్రజల సొమ్ముతో చంద్రబాబు, పవన్ కళ్యాన్, లోకేష్‌లు ప్రత్యేక విమానాలు, హెలిక్యాప్టర్ లలో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు. 23 నెలల్లోనే రూ. 3.61 లక్షల కోట్ల అప్పులు చేసి కనీసం ఒక్క కొత్త పింఛన్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. కానీ వాళ్లు మాత్రం ఎక్కిదిగుతున్న స్పెషల్ ఫ్లయిట్ ఖర్చులు మాత్రం తడిసి మోపెడవుతున్నాయి. కనీసం ప్రభుత్వం ఆస్పత్రుల్లో సూదికి దూదికి దిక్కులేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం లేదు. ఇవన్నీ ప్రశ్నిస్తుంటే సోషల్ మీడియా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. కేసులు వాదించే పేరుతో హైకోర్టు, సుప్రీంకోర్టులకు తిరుగుతూ కోట్లాది రూపాయలు లాయర్లకు దోచిపెడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి సచివాలయం, అసెంబ్లీ ఉంటే మళ్లీ కొత్తది నిర్మిస్తూ అడ్డగోలు రేట్లకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. అక్కడితో ఆగకుండా వాటికి అద్దాలు బిగించడానికి రూ. 2500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇదేం చోద్యమని ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకం అని దుష్ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు తన బినామీల కోసమే పనిచేస్తున్నాడని స్పష్టంగా తెలిసిపోతోంది. - సంక్షోభాలను సృష్టించి దోచేస్తున్నారు సంక్షోభాలను సృష్టించి దోచుకోవడం అలవాటైంది. ఇంధనం కొరతతో కిలోమీటర్ల పొడవునా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులుదీరినట్టు కళ్లముందు కనిపిస్తుంటే సిగ్గులేకుండా వైయస్ఆర్‌సీపీ కుట్ర అని చెబుతున్నారు. ఇంధన కొరత సృష్టించి రూ. 150 కోట్లు దోచుకున్నారు. టీడీపీ నాయకులు బ్లాక్ మార్కెటింగ్ చేసి యూరియా కొరత సృష్టించినా, మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఫైల్స్ తగలబడినా, వరదలప్పుడు ప్రకాశం బ్యారేజీలో బోటు కొట్టుకొచ్చి గేటుకు అడ్డం పడితే.. ఇలా రాష్ట్రంలో ఏం జరిగినా దానికి జగనే కారణమంటున్నారు. జగన్ గారి మీద నిందలేసి డైవర్షన్ చేయడమే చంద్రబాబుకి అలవాటైన విద్య. ఎవరెన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడి వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. అధికారం ఉందనే ధీమాతో కూటమి నాయకులు చేస్తున్న మోసాలు, దోపిడీలు, దారుణాలకు ఖచ్చితంగా బదులు తీర్చుకుంటాం. - రాష్ట్రంలో హత్యారాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబే రాష్ట్రంలో హత్యారాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబు. గొడ్డు కన్నా హీనం గాడ్సే కన్నా నీచం అని చంద్రబాబుని ఉద్దేశించి ఆయనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆరే అన్నాడు. ఆయన ఆదేశాలతోనే వంగవీటి మోహనరంగా, మల్లెల బాబ్జీ, పింగళి దశరథ్ రామ్ హత్యలు జరిగాయని ఎన్నో ఆరోపణలున్నాయి. వైయస్ రాజారెడ్డిని చంపిన నిందితులకు చంద్రబాబు 30 రోజులు ఆశ్రయం కల్పించాడు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వినుకొండలో జరిగిన రషీద్ హత్య మొదలు 21 మందిని అతి కిరాతకంగా చంపేశారు. రెండేళ్లలో 721 మందిని దారుణంగా చంపేశారు. పల్నాడు జిల్లాలో టీడీపీ పార్టీలోని రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటనలో ఇద్దరు చనిపోతే ఆ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను అక్రమంగా ఇరికించి జైలు పాలుచేశారు. కళ్ల ముందు దారుణాలన్నీ టీడీపీ నాయకులు చేస్తుంటే వైయస్ఆర్‌సీపీని గొడ్డలి పార్టీ అనడానికి సిగ్గుండాలి. ఈ ఘోరాలన్నీ చూస్తే తెలుగుదేశం పార్టీని దండుపాళ్యం ముఠా పార్టీ అనాలని కారుమూరు వెంకటరెడ్డి ధ్వజమెత్తారు.