కర్నూలు జిల్లా: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి డిమాండ్ చేశారు. ఆలూరు నియోజకవర్గం, హోళగుంద మండలంలోని సులువాయి గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాయలసీమలో ముఖ్యంగా జిల్లా పశ్చిమ ప్రాంతాల్లో వాల్మీకి సమాజం ఇంకా అభివృద్ధిలో వెనుకబడి ఉందని పేర్కొన్నారు. విద్య, సంస్కృతి, సామాజిక రంగాల్లో వాల్మీకులు మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధత కల్పించాలని కోరారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడంతో వారు విద్య, రాజకీయ రంగాల్లో మంచి అభివృద్ధి సాధించారని ఉదాహరణగా తెలిపారు. మన రాష్ట్రంలో కూడా అదే విధంగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చి వారి అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. ఈ దిశగా తాను కూడా కృషి చేస్తున్నానని వెల్లడించారు. కర్నూలు పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ వాల్మీకుల సమస్యపై స్పందించిన విషయాన్ని గుర్తుచేశారు. వాల్మీకి మహర్షి ఆశీస్సులతో వాల్మీకి సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి సుఖసంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వాల్మీకి నాయకులు, ఎస్టీ సాధన కమిటీ సభ్యులు, వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు వాల్మీకి సోదరులు పాల్గొన్నారు.