నంద్యాల: ఏపీలో ప్రతిపక్ష వైయస్ఆర్‌సీపీ నాయకులను ఎదుర్కోలేక కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు నమోదు చేస్తూ వేధింపులకు గురి చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. డి ఫాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. జనవరిలో చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశానని తనపై 32 కేసులు నమోదు చేశారని, తాజాగా పులివెందుల, వేంపల్లిలో మరిన్ని కేసులు పెట్టారని తెలిపారు. వైయస్ఆర్‌సీపీ మీడియా ఇన్‌చార్జ్ శ్రీహరిని సోషల్ మీడియా పోస్టుల పేరుతో అరెస్టు చేయడం, కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా తిరిగి అరెస్టు చేసి గుంటూరుకు తరలించడం ధికార దుర్వినియోగానికి ఉదాహరణ అని అన్నారు. అదే కేసులో చిత్తూరు కోర్టు బెయిల్ ఇచ్చినా మళ్లీ అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. తనను, పూడి శ్రీహరిని మానసికంగా హింసించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన అంబటి, “ప్రభుత్వాలు శాశ్వతం కావు… మళ్లీ వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది” అని హెచ్చరించారు. చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పోలీసులను ఉపయోగిస్తున్నారని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడడంలో విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో హత్యలు పెరుగుతున్నాయని, ఇటీవల ఓ జర్నలిస్టు హత్య ఉదంతం ఇందుకు ఉదాహరణ అని అన్నారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా ప్రతిపక్షాలపై పోలీసులను ప్రయోగించడం తగదని చెప్పారు. పోలీసులు తమ లాఠీలను సంఘవిద్రోహులు, రౌడీలపై ఉపయోగించాలి గానీ రాజకీయ నాయకులపై కాదు అని సూచించారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు రాజకీయ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ కొరతకు కూడా కూటమి ప్రభుత్వ విధానాలే కారణమని, హోల్‌సేల్ కొనుగోళ్లపై తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ సమస్య ఏర్పడిందని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రజలను దేవుళ్లుగా భావించిన ప్రభుత్వం, ఇప్పుడు కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని అన్నారు. అమరావతి పేరుతో జరుగుతున్న చర్యలపై కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని అంబటి రాంబాబు హితవు పలికారు.