పూడి శ్రీహరి అరెస్ట్‌ అప్రజాస్వామికం

గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం

అన్నమయ్య జిల్లా రాయచోటిలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి.

రాష్టంలో ఆటవిక, అరాచక పాలన

యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన

గతి తప్పి వ్యవహరిస్తున్న పోలీసులు

ప్రెస్‌మీట్‌లో శ్రీకాంత్‌రెడ్డి ఆక్షేపణ

రాయచోటి:   వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం), మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీపీఆర్‌ఓ పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్‌ అప్రజాస్వామికమని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన సాగుతోందన్న ఆయన, గతి తప్పి వ్యవహరిస్తున్న పోలీసుల తీరు దారుణమని అన్నమయ్య జిల్లా రాయచోటిలో మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్‌రెడ్డి తేల్చి చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:
    టీడీపీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించకుండా సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఆటవిక పాలన సాగిస్తోంది. అరాచక పాలనను ప్రశ్నిస్తే ఇష్టానుసారంగా అక్రమ కేసులు పెడుతున్నారు. వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరిని ఏ కారణంతో అరెస్టు చేస్తున్నారో చెప్పకుండా, బలవంతంగా తీసుకెళ్లడం, ఆయన సెల్‌ ఫోన్, ల్యాప్‌టాప్‌ దౌర్జన్యంగా లాక్కోవడం దారుణం. అన్నింటా విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం, ప్రశించిన వారిపైన, మీడియా వారిపైన అక్రమ కేసులు బనాయిస్తోంది. పూడి శ్రీహరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.
    అలాగే ఇక్కడ రాయచోటిలో ప్రెస్‌మీట్‌ను యథాతథంగా ప్రచురించిన పత్రికా ప్రతులను కొందరు దహనం చేయడం, అసభ్య పదజాలంతో దూషించడం సరైన పద్ధతి కాదు. ఈ దుశ్చర్యపై పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలి. తమకు పోలీసులు అండగా ఉన్నారన్న ధైర్యంతో కూటమి నాయకులు చేస్తున్న గుండాగిరిని ప్రజలు గమనిస్తున్నారు, తప్పకుండా గుణపాఠం చెప్తారు.

Back to Top