కూటమి పాలనలో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం..

తునాతునకలైన శాంతిభద్రతలు: ధ్వజమెత్తిన మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)

తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని). 

ఏపీలో పచ్చబిళ్లే నేరాలకు లైసెన్స్.. 

గుంటూరు అమానుష ఘటన ముమ్మూటికీ శాంతి భద్రతల వైఫల్యమే

ఐజీ సహా బాధ్యులైన అధికారులందరిపై చర్యలు తీసుకోవాలి

డిమాండ్ చేసిన మాజీ మంత్రి పేర్ని నాని

కూటమి మార్కు ‘తావీదు’ పాలన: 

ఏపీలో కానరాని శాంతి భద్రతలు

గుంటూరు నడిబజార్లో మహిళా లోకానికి ఘోర అవమానం

కనీసం స్పందించని ఖాకీ వ్యవస్థ 

మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆక్షేపణ

తాడేప‌ల్లి:  చంద్రబాబు నాయుడు  నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గడిచిన రెండేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు అత్యంత దారుణంగా దిగజారిపోయాయని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో  రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థను పూర్తిగా నీరుగార్చి ‘రెడ్ బుక్ రాజ్యాంగాన్ని’ అమలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2024 జూన్ 4వ తేదీ ఎన్నికల లెక్కింపు సాయంత్రం నుంచే తెలుగుదేశం పార్టీ శ్రేణుల కనుసన్నల్లో మెసిలేలా పోలీసు వ్యవస్థను మార్చేశారని, చట్టబద్ధమైన పరిపాలనకు బదులు టీడీపీ నేతలు పంచిపెట్టిన ‘పచ్చబిళ్ళ’ ఇవాళ నేరాలకు, ఘోరాలకు అధికారిక లైసెన్స్‌గా, పోలీసులను నిశ్చేష్టులను చేసే తావీదుగా మారిందని ఆక్షేపించారు. గుంటూరు నగర నడిబొడ్డున 21వ డివిజన్ నగరంపాలెంలో ఒక సామాన్య మహిళను నడిరోడ్డుపై పశుప్రవృత్తితో వివస్త్రను చేసిన అమానుష ఘటన రాష్ట్రంలో మహిళా రక్షణ కరువైందనే దానికి పరాకాష్ట అని స్పష్టం చేశారు. బాధితురాలు జూలై 15వ తేదీ మధ్యాహ్నమే స్టేషన్‌కు వెళ్లినా కదలని యంత్రాంగం, సాక్షి టీవీలో విజువల్స్ ప్రసారమై సమాజం ఛీత్కరించుకున్నాక, స్థానిక ఎమ్మెల్యే అనుమతితో ముద్దాయిలను సరెండర్ చేయించుకోవడం ఈ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల వైఫల్యానికి కారణమైన ఐజీ, ఎస్పీ, సీఐలను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని చంపి చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పోలీసు అధికారులందరికీ ‘కాదంబరి జత్వాని’ కేసే భవిష్యత్తులో ఒక కనువిప్పు కాబోతోందని హెచ్చరించారు. 
ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... 

టిడిపి ‘పచ్చబిళ్ల’.. నేరాలకు అధికారిక లైసెన్స్!..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పోలీసు వ్యవస్థ అనేది ప్రజలకు రక్షణగా ఉండే వ్యవస్థలా కాకుండా, కొంతమంది అధికారుల స్వార్థ ప్రయోజనాల వల్ల జుగుప్స కలిగించేలా తయారైంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందు, అంటే జూన్ 4 సాయంత్రం నుంచే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను తునాతునకలు చేశారు. 'జేబులో పచ్చబిళ్ళ ఉంటే చాలు అధికారులు మీరు చెప్పినట్లు వింటారు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గెలిచిన కొత్తలో చెప్పిన మాటలను అండగా పెట్టుకుని, నేడు టీడీపీ మూకలు యధేచ్ఛగా విధ్వంసాలకు పాల్పడుతున్నాయి. ఈ పచ్చబిళ్లను నేరాలకు, ఘోరాలకు ఒక లైసెన్స్‌లా మార్చారు. రాష్ట్రంలో ఇచ్ఛాపురం నుంచి తడ దాకా, కుప్పం నుంచి మచిలీపట్నం దాకా ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా సరే, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే లేదా వారి అనుచరుల అనుమతి లేనిదే ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాని దుస్థితి నెలకొంది. సామాన్యుడు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పట్టించుకోరు కానీ, ఎమ్మెల్యే ఫోన్ చేస్తేనే పోలీసులు కదులుతున్నారు. భారత పార్లమెంట్ రూపొందించిన బీఎన్ఎస్ (BNS), బీఎన్ఎస్ఎస్ (BNSS) చట్టాల కంటే బాబు, లోకేష్ ల సెక్షన్లే ఇక్కడ అమలవుతున్నాయి.

గుంటూరు నగరంలో కీచక పర్వం.. అసలు కారణం ఇదే!..
                                                                                                                                                                                   గుంటూరు నగరంలోని 21వ డివిజన్ నగరంపాలెం ప్రాంతంలో జరిగిన అమానుష సంఘటన వెనుక ఉన్నది ముమ్మాటికీ టీడీపీ నేతల లంచగొండితనమే. బాధితులు 2009-10 కాలంలో తమ సొంత ఖర్చులతో వేసుకున్న బోరుబావి ఇటీవల రిపేరుకు వస్తే, దాన్ని బాగు చేయించుకోవడానికి వెళ్లినందుకు టీడీపీ వార్డు డివిజన్ ప్రెసిడెంట్, సెక్రెటరీలు రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితులు తిరస్కరించేసరికి, మున్సిపల్ ఏఈ ని వెంటబెట్టుకుని వచ్చి దబాయించారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునే మున్సిపల్ అధికారులు టీడీపీ నేతలకు ఊడిగం చేస్తూ ఆ బోరును కాంక్రీట్ వేసి పూడ్చేయాలని చూడటం సిగ్గుచేటు. దీనిపై జూలై 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకే బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తే నగరంపాలెం పోలీసులు కనీసం స్పందించలేదు. ఆ తర్వాత సాయంత్రం బాధితురాలు, ఆమె కొడుకు ఇంటికి వెళ్తుండగా 9 మంది టీడీపీ కీచకులు మూకుమ్మడిగా దాడి చేసి, ఆ మహిళను నడిబజార్లో వివస్త్రను చేశారు. స్థానిక మహిళలు ప్రాణాలకు తెగించి ఆమెపై బట్టలు కప్పి కాపాడాల్సి వచ్చింది. ఇంత దారుణం జరిగినా 16వ తేదీ సాయంత్రం వరకు ఎఫ్ఐఆర్ కట్టలేదు. స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఆదేశించాకే, ఆమె సరెండర్ చేయించాకే పోలీసులు కేసు నమోదు చేశారని సిఐ  స్వయంగా ఒప్పుకుంటున్నారు. అంటే ఈ రాష్ట్రంలో చట్టం కంటే ఎమ్మెల్యేల దయాదాక్షిణ్యాలే ఎక్కువయ్యాయా?.

ట్విట్టర్ లో లోకేష్, బాబుల ‘షాక్’ డ్రామాలు..

జూలై 17వ తేదీ రాత్రి 7:30 గంటలకు 'సాక్షి టీవీ' బ్రేకింగ్ న్యూస్ వేసి, 8 గంటలకు ఆ భయానక వీడియో విజువల్స్ వదిలి సమాజాన్ని కదిలిస్తే గాని పాలకుల్లో చలనం రాలేదు. ఆ తర్వాత జూలై 18 ఉదయం 10:44 గంటలకు నారా లోకేష్ ట్విట్టర్ లోకి వచ్చి 'అబ్సల్యూట్లీ షాక్డ్' అంటూ డ్రామాలు ఆడుతున్నారు. ఆ తర్వాత పావుగంటకు చంద్రబాబు నాయుడు గారు 'ఐ యామ్ డీప్లీ డిస్టర్బ్డ్' అంటూ చిలక పలుకులు పలుకుతున్నారు. 80 ఏళ్ల వయస్సులో చంద్రబాబు గారూ.. మీకు సిగ్గుగా అనిపించడం లేదా? మీ డివిజన్ ప్రెసిడెంట్, సెక్రెటరీలు ఈ ఘోరానికి ఒడిగడితే, మీ ఎమ్మెల్యే కేసు కట్టకుండా ఆపితే.. ఇవాళ ట్విట్టర్ లో నీతులు చెబుతారా? ఆ ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ లేకపోయి ఉంటే, సాక్షి టీవీలో ఆ విజువల్స్ రాకపోయి ఉంటే.. మీరు స్పందించేవారా? కృష్ణలంక లాకప్ డెత్ లో బూడిద కూడా మిగలకుండా చేసిన చరిత్ర మీది. హోం మంత్రి నియోజకవర్గంలో మహిళల బట్టలు చింపుతుంటే ఆమె ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. డిప్యూటీ సీఎం ఏమో నాకు హోం శాఖ కావాలని అర్రులు చాచడం తప్ప మహిళల రక్షణ గురించి మాట్లాడటం లేదు.

పోలీస్, ఐఏఎస్ అధికారులకు కాదంబరి జత్వాని కేసే ఒక కనువిప్పు!..                                                              ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్ అధికారులందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడిని, కూటమి మంత్రులను, ఎమ్మెల్యేలను నమ్ముకుని వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్న అధికారులందరూ విజయవాడలో జరిగిన సినీ నటి కాదంబరి జత్వాని కేసును ఒక్కసారి గుర్తుచేసుకోండి. నాడు చంద్రబాబు నాయుడు చెప్పిన పనులు చేసి, ఈనాడు సీఐడీ చార్జ్ షీట్లలో ముద్దాయిలుగా మారి, తోటి ఐజీలను, ఎస్పీలను అరెస్టులు చేసుకునే దుస్థితి తెచ్చుకున్నారు. చంద్రబాబు మిమ్మల్ని వాడుకుని, ఆ తర్వాత ప్రత్యర్థులకు ఆహారంగా వదిలేస్తారనే దానికి జత్వాని కేసే ఒక పెద్ద ఉదాహరణ. ఖాకీ చొక్కా విప్పి గుండెల్లో చంద్రబాబు, లోకేష్ ల బొమ్మలు చూపిస్తున్న అధికారులందరికీ ముందు ముందు ముసళ్ళ పండగ తప్పదు, జాగ్రత్త!

వైఎస్సార్‌సీపీ డిమాండ్లు:

ఈ నేపధ్యంలో వైయస్సార్సీపీ తరపున గుంటూరులో జరిగిన అమానవీయ ఘటనకు బాధ్యతగా .. గుంటూరు రేంజ్ లో శాంతిభద్రతల వైఫల్యానికి కారణమైన గుంటూరు ఐజీ, ఎస్పీతో పాటు, బాధితురాలు ఫిర్యాదు చేసినా 24 గంటల పాటు నిర్లక్ష్యం వహించిన నగరంపాలెం  సీఐ ని తక్షణమే సస్పెండ్ చేయాలి. లంచాలు అడిగిన  టీడీపీ డివిజన్ ప్రెసిడెంట్, సెక్రెటరీలను ఈ కేసులో ప్రధాన ముద్దాయిలుగా చేర్చి కఠినంగా శిక్షించాలి. బాధితురాలు ఏయే సమయాల్లో స్టేషన్‌కు వచ్చిందో, పోలీసులు ఎవరితో ఫోన్ మాట్లాడారో నిజాలు తేలడానికి నగరంపాలెం పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్‌ను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసిన పేర్ని నాని.. మహిళలకు రక్షణ కల్పించడంలో, చట్టాన్ని సక్రమంగా అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే తక్షణమే  చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు.

Back to Top