చిత్తూరు : జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఇసుక, మట్టి, కంకర, ఎర్రమట్టి అక్రమ దోపిడీ యథేచ్ఛగా సాగుతోందని, సహజ వనరులను కూటమి నాయకులు అడ్డగోలుగా దోచుకుంటున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి ఆరోపించారు. చిత్తూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ దోపిడీపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, తహసీల్దార్, జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్వేటినగరం మండలం కృష్ణాపురం రిజర్వాయర్‌లో భారీ ఎత్తున మట్టి, ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. అక్కడి నుంచి తవ్విన మట్టిని స్థానిక ఇటుక బట్టీలకు తరలిస్తూ లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే అమ్మపల్లి పంచాయతీ పరిధిలో కూడా ఇసుక, మట్టి దోపిడీ విచ్చలవిడిగా కొనసాగుతోందని అన్నారు. ఈ అక్రమాలపై జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి కృష్ణాపురం రిజర్వాయర్‌లో జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలని నారాయణస్వామి డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలను ప్రజలకు చూపించాలని, క్షేత్రస్థాయికి వెళ్లి అక్కడ జరుగుతున్న అక్రమాలను పరిశీలించాలని ఆయన సూచించారు. కూటమి నాయకుల అవినీతి, సహజ వనరుల దోపిడీపై వైయస్ఆర్‌సీపీ మౌనంగా ఉండదని, అధికారులు చర్యలు తీసుకోకపోతే జీడీ నెల్లూరు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి హెచ్చరించారు.