శ్రీకాకుళం: ఎరువుల కోసం క్యూ లైన్‌లో నిలబడి ప్రాణాలు కోల్పోయిన శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దలవునిపల్లి గ్రామానికి చెందిన రైతు పినకాన కాంతమ్మ కుటుంబాన్ని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పరామర్శించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ నాయకులతో కలిసి బాధిత కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతాంగ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. వ్యవసాయం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులు ఎరువుల కోసం క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చేదే కాదన్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రైతులకు అవసరమైన ఎరువులను గ్రామ స్థాయిలోనే, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అందుబాటులో ఉంచి ఐదేళ్లపాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం రైతులు ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, బ్లాక్ మార్కెట్‌లో మాత్రం ఎరువులు లభిస్తున్నాయని, అవి అక్కడికి ఎలా చేరుతున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు ఒడిశాకు వెళ్లి ఎరువులు కొనుక్కొచ్చే పరిస్థితి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలతో కాలం గడుపుతోందని, వ్యవసాయ శాఖ, వ్యవసాయ మంత్రి, ముఖ్యమంత్రి ఈ సంక్షోభంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం సహజమని, కానీ ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, వేధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రతిపక్ష నాయకులపైనే కేసులు నమోదు చేయడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్న ధర్మాన ప్రసాదరావు, అధికార దుర్వినియోగంతో రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎరువుల కోసం క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోయిన రైతు కాంతమ్మ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే తగిన నష్టపరిహారం ప్రకటించి అన్ని విధాలా ఆదుకోవాలని, రైతుల సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, సమన్వయకర్తలు పేరాడ తిలక్, శ్యాంప్రసాద్ రెడ్డి, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.