జత్వాని కేసులో సీఐడీ ఛార్జ్‌షీట్‌తో బట్టబయలైన చంద్రబాబు కుట్రలు.

రెడ్ బుక్ రాజ్యాంగంతో పోలీసు వ్యవస్థ నాశనం

ఐపీఎస్ ల అక్రమ వేధింపులపై బాబు సమాధానం చెప్పాలి

కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు.

తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.

రెడ్ బుక్' పగ ప్రదర్శన బట్టబయలు .

సీఐడీ ఛార్జ్‌షీట్‌తో బయటపడ్డ బాబు దొంగ నాటకాలు.

జత్వానీ అమాయకురాలని బాకా ఊదిన ఎల్లో మీడియా.

రూ.4.98 లక్షల వసూళ్లతో దోషి అని తేల్చిన  సీఐడీ. 

నిబద్ధత గల అధికారులతో బాబు ప్రభుత్వం చెలగాటం

తక్షణమే అధికారులకు, ప్రజలకు క్షమాపణ చెప్పాలి

పచ్చ మీడియా ప్రచారాలన్నీ అభూతకల్పనలే

ప్రజా క్షేత్రంలో కూటమికి భంగపాటు తప్పదు

మాజీ మంత్రి అంబటి హెచ్చరిక

తాడేపల్లి: నటి జత్వానీ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం చేసిన రాజకీయ కక్ష సాధింపులకు, పచ్చ మీడియా దుష్ప్రచారాలకు సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ చెంపపెట్టులా మారిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నటి కాదంబరి జత్వాని అమాయకురాలు, బాధితురాలు అంటూ చంద్రబాబు ఆడిన దొంగ నాటకాలను ఆయన సొంత ప్రభుత్వంలోని సీఐడీ విభాగమే పటాపంచలు చేసిన విషయాన్ని ఆధారాలతో సహా స్పష్టం చేశారు. జత్వాని ఎక్స్టార్షన్‌కు పాల్పడిన దోషి అని సీఐడీయే స్వయంగా కోర్టుకు నివేదించిన తర్వాత, చట్టబద్ధంగా విధి నిర్వహణ చేసిన నిబద్ధత కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారులపై 'రెడ్ బుక్' రాజ్యాంగంతో కక్షసాధింపులకు పాల్పడిన చంద్రబాబు, లోకేష్ మరియు హోంమంత్రులు ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నారని నిలదీశారు. చట్టప్రకారం విధి నిర్వహణకు పాల్పడ్డ  ఐపీఎస్ అధికారులపై పగబట్టి సస్పెన్షన్లు, అరెస్టులకు పాల్పడిన చంద్రబాబు, లోకేష్, హోంమంత్రి దీనిపై రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...

చట్ట ప్రకారం డ్యూటీ చేసిన పోలీసులపై కక్ష కడతారా?..

దేశంలో ఎక్కడైనా , రాజ్యాంగం ప్రకారం పోలీసులకు ఏ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు వస్తే దాన్ని స్వీకరించి, ప్రాథమిక విచారణ చేసి, కాగ్నిజబుల్ ఆఫెన్స్ ఉంటే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కోర్టుకు పంపాలి. జత్వాని వ్యవహారంలో నాటి పోలీసులు అదే చేశారు. పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్ రావు తనను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే, చట్టప్రకారమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కోర్టు అనుమతితో, ముంబై పోలీసుల సహకారంతో ముంబై వెళ్లి ఆమెను అరెస్ట్ చేసి, విజయవాడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ ఇచ్చింది, ఐదు రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది. ఇదంతా పకడ్బందీగా, చట్టబద్ధంగా జరిగిన ప్రక్రియ. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే తన 'రెడ్ బుక్' రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, చట్టప్రకారం డ్యూటీ చేసిన పోలీసు అధికారుల మీద కక్షపట్టి వేధించడం మొదలుపెట్టారు.

"స్వయంగా మీ సీఐడీయే ఛార్జ్‌షీట్ వేసింది... ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?..

జత్వాని అమాయకురాలని, ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు సర్టిఫికెట్ ఇచ్చి, పెద్ద నాటకం ఆడారు. కానీ ఇవాళ అదే కూటమి ప్రభుత్వంలోని సీఐడీ (క్రైమ్ నంబర్ 90/24 లో) గౌరవ కోర్టు ముందు ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అందులో ఏమని ఉందో తెలుసా? 'జత్వాని అమాయకురాలు కాదు, ఆమె విద్యాసాగర్ రావును బెదిరించి డబ్బులు వసూలు (ఎక్స్టార్షన్) చేసిన మాట వాస్తవమే, ఆమె బ్యాంక్ ఖాతాలో రూ. 4,98,000 జమ అయ్యాయి' అని సీఐడీ  రాసి ఇచ్చింది. చంద్రబాబు గారూ... మీ ప్రభుత్వంలోని సీఐడీయే ఆమెను దోషి అని కోర్టులో పెట్టిన తర్వాత, మరి అప్పుడు ఆ రోజు మీరు ఆడిన నాటకాలకు, చేసిన ప్రచారాలకు ఏం సమాధానం చెప్తారు?

ఐపీఎస్ అధికారులతో బాబు చెలగాటం.. 

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎంతో కష్టపడి చదువుకుని, టాప్ ర్యాంకులు సాధించి వ్యవస్థకు సేవ చేయడానికి వస్తారు. పీఎస్ఆర్ ఆంజనేయులు  గుంటూరు ఎస్పీగా, విజయవాడ కమిషనర్‌గా పనిచేసినప్పుడు నేరస్థులు గడగడలాడేవారు. అలాంటి సిన్సియర్ ఆఫీసర్‌తో పాటు ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లను, ఏసీపీ హనుమంతరావును, ఇబ్రహీంపట్నం సీఐని అక్రమంగా సస్పెండ్ చేసి, జైల్లో పెట్టారు. నా 70 ఏళ్ల జీవితంలో పోలీసులను ఉపయోగించుకుని, పోలీసులనే అరెస్ట్ చేయించిన ఇలాంటి దుర్మార్గమైన రాక్షస రాజకీయాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. చట్టబద్ధంగా పనిచేసినందుకు అధికారుల జీవితాలను నాశనం చేస్తారా?

పచ్చ మీడియా అభూతకల్పనలు ....

ముందుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబీఎన్ లలో తప్పుడు కథనాలు రాయించడం చంద్రబాబు మోడస్ ఆపరెండి. జత్వానిని కిడ్నాప్ చేశారని, ఎన్టీపీసీ గెస్ట్ హౌస్‌లో బంధించి చిత్రహింసలకు గురిచేశారని రాశారు. కానీ, కోర్టు విచారణలోగానీ, రికార్డుల్లోగానీ జత్వాని స్వయంగా 'నన్ను ఏ గెస్ట్ హౌస్‌కూ తీసుకెళ్లలేదు, హెరాస్ చేయలేదు' అని స్పష్టంగా చెప్పింది. అయినా సరే, ఆమెకు కనకదుర్గ గుడిలో ముందు ఒక వ్యాన్, వెనక ఒక వ్యాన్ పెట్టి అద్భుతమైన ప్రోటోకాల్ ఇచ్చి, ఏ తప్పూ చేయని వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరికి హైకోర్టు జోక్యం చేసుకుని ఈ అక్రమ చర్యలపై స్టే ఇచ్చింది.

చంద్రబాబు, లోకేష్, హోంమంత్రి క్షమాపణలు చెప్పాలి!..

రాజకీయ స్వార్థం కోసం, గత ప్రభుత్వంపై బురద జల్లడం కోసం వ్యవస్థలను ఈ స్థాయిలో దిగజార్చడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డ అంబటి రాంబాబు... తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో అబద్ధాలు ప్రచారం చేసి దొరికిపోయినట్టే, ఇవాళ జత్వాని విషయంలోనూ కూటమి ప్రభుత్వం దొరికిపోయిందని తేల్చి చెప్పారు. స్వయంగా తమ సొంత సీఐడీ విభాగమే జత్వాని ఎక్స్టార్షన్‌కు పాల్పడిందని కోర్టులో ఛార్జ్‌షీట్ వేసిన తర్వాత, ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఈ ప్రభుత్వం ఊరేగుతుందని నిలదీశారు. చట్టబద్ధంగా విధి నిర్వహణ చేసిన ఐపీఎస్ అధికారుల జీవితాలను నాశనం చేసినందుకు, పవిత్రమైన పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వేదికగా మార్చినందుకు సీఎం చంద్రబాబునాయుడు, డీఫాక్టో సీఎంగా వ్యవహరిస్తున్న లోకేష్, హోంమంత్రితో పాటు పచ్చ మీడియా సంస్థలు రాష్ట్ర ప్రజలకు, ఆ అధికారులకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.  రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఈ రాక్షస కక్షసాధింపు రాజకీయాలకు, అక్రమాలకు ప్రజా క్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Back to Top