తాడేపల్లి: వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు. నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో పొగాకు సాగు చేస్తున్న ముఖ్య రైతులు ఈ సమావేశానికి హాజరు కాగా, వారు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రీ వైయస్ జగన్ నేరుగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై పోరాడతామని, అండగా, తోడుగా ఉంటామని ఆయన పొగాకు రైతులకు భరోసా ఇచ్చారు. సమావేశంలో ఎవరెవరు, ఏం మాట్లాడారంటే..: ఎంవీఎస్ నాగిరెడ్డి. వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం, రైతు విభాగం): – రాష్ట్రంలో 1.17 లక్షల హెక్టార్లలో పొగాకు సాగవుతుండగా, అందులో 70 వేల ఎకరాలు ప్రకాశం జిల్లాలో ఉంది. మిగిలింది ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉంది. పొగాకు ధర గత ఏడాది నుంచి దారుణంగా పడిపోయింది. ప్రతి రోజూ 50 పైసల నుంచి 60 పైసల ధర పడిపోతోంది. అలాగే చాలా ప్లాట్‌ఫామ్స్ మీద 27 శాతం రిజెక్షన్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని చోట్ల అది దాదాపు 40 శాతం వరకు ఉంది. ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేస్తే, సమస్య ఉండదు. మార్క్‌ఫెడ్ ఎంటర్ కావాలి. అప్పుడే మంచి ధర వస్తుంది. కానీ, ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం తప్ప, ఏమీ చేయడం లేదు. టుబాకో బోర్డు జోక్యం చేసుకోవాలని కోరుతూ ఊర్కొంటోంది. మారెడ్డి సుబ్బారెడ్డి. ప్రకాశం జిల్లా. టుబాకో బోర్డు మెంబర్: – ఈరోజుకు వేలం ప్రారంభమై 94 రోజులైంది. మీరు సీఎంగా ఉన్నప్పుడు పొగాకు సాగులో సంక్షోభం ఉంటే, మీరు చాలా చొరవ చూపారు. అప్పుడు కోవిడ్ ఉన్నా, మీరు స్వయంగా పొగాకు కొంటామని చెప్పారు. అది చేసి చూపారు. మీరు మార్కెట్‌లో జోక్యం చేసుకోవడం వల్ల మార్కెట్‌లో మంచి ధర లభించింది. ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్లాట్‌ఫామ్స్ నుంచి రైతులు పొగాకు వెనక్కు తీసుకువెళ్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే సంక్రాంతి వరకు పొగాకు కొనుగోళ్లు ముగిసే పరిస్థితి కనిపిస్తోంది. ఫిబ్రవరి వరకు వేలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబరులో కర్ణాటకలో వేలం మొదలవుతుంది. ఆలోగా ఇక్కడ కొనుగోళ్లు పూర్తి కాకపోతే, మాకు చాలా సమస్య వస్తుంది. సిగరెట్ ప్యాకెట్ల రేటు రూ.170 నుంచి రూ.240 వరకు పెరిగింది. మధ్యలో రైతులు మాత్రం నష్టపోతున్నారు. రైతుల నుంచి పొగాకు కొనుగోళ్లు జరగడం లేదు. పొగాకు సాగు ఎకరానికి రూ.2.30 లక్షలు అవుతుంది. కానీ, ఏ మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదు. యుద్ధం బూచి చూపి, ధర ఇవ్వడం లేదు. పి.శ్రీనివాస్. ప్రకాశం జిల్లా: – టుబాకో బోర్డు రాకముందు, 1983లో ఉద్యమం జరిగింది. అందులో ముగ్గురు చనిపోయారు. ఆ తర్వాత బోర్డు వచ్చింది. రైతులు, వ్యాపారులకు అనుసంధానంగా ఉండాల్సిన బోర్డు, ఈరోజు పూర్తిగా వ్యాపారుల కొమ్ము కాస్తోంది. చంద్రబాబు అధికారంలో ఎప్పుడున్నా, ఇదే పరిస్థితి. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా పొగాకు సాగు చేస్తుండగా, అందులో 30 శాతం కొండెపి నియోజకవర్గంలోనే ఉంటుంది. తీవ్ర సంక్షోభంలో ఉన్న పొగాకు రైతాంగానికి ఆదుకోవడంలో మీరు తప్ప, మరో మార్గం లేదు. ఈ ఏడాది కొనుగోళ్లు పూర్తి చేయకుండానే, వచ్చే ఏడాదికి సంబంధించి కూడా ఇండెంట్ ఇచ్చారు. ఇంత కంటే దారుణం మరొకటి ఉంటుందా? మారెళ్ల బంగారుబాబు. ఒంగోలు: – పొగాకు రైతుల బాధలు అన్నీ ఇన్నీ కావు. వ్యాపారుల మాయాజాలం చూస్తే.. ఎగుమతిదారులు వాళ్ల తమ ఆర్డర్‌ను డాలర్లలోనే ఇస్తారు. తీసుకుంటారు. ఈరోజు డాలర్ ధర చాలా ఎక్కువ ఉంది. గత ఏడాది ధర కూడా లేదు. పార్టీలకు అతీతంగా రైతులంతా మిమ్మల్ని కోరుకుంటున్నారు. కాబట్టి, మీరు తప్పకుండా మా ప్రాంతాన్ని సందర్శించాలి. సిగరెట్ ఉత్పత్తిదారులు జీఎస్‌టీ సాకు చూపి, ధర తక్కువ చెల్లిస్తున్నారు. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మధు. ఏలూరు జిల్లా. పోలవరం నియోజకవర్గం: – ఆరుగాలం కష్టపడి పొగాకు పండించి, గిట్టుబాటు ధర లేక దిక్కుతోచని పరిస్థితుల్లో మీరు గుర్తొచ్చారు. అందుకే మా సమస్యలు చెప్పుకోవడం కోసం వచ్చాం. మాది మెట్ట ప్రాంతం. ప్రభుత్వం ఇచ్చిన ఇండెంట్ ప్రకారం గత ఏడాది 80 మిలియన్ టన్నులు పండించాం. కానీ, ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 7 మిలియన్ కేజీల పొగాకు మాత్రమే కొన్నారు. ఆ లెక్కన మొత్తం పొగాకు ఎప్పటికి కొంటారో తెలియడం లేదు. గత ఏడాది కంటే ఈసారి పెట్టుబడి కేజీకి రూ.30 పెరగ్గా, ధర కేజీకి రూ.70 తగ్గింది. కేజీ పొగాకుతో 1000 సిగరెట్లు తయారవుతున్నాయి. వాటి ద్వారా రూ.24 వేలు సంపాదిస్తున్నారు. అదే కేజీ పొగాకుకు మాత్రం మాకు కేవలం రూ.265 మాత్రమే ఇస్తున్నారు. ఇదేం న్యాయం? మరోవైపు మాకు ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. కొన్నైతే సగానికి సగం పెరిగాయి. దాంతో సాగు వ్యయం పెరగ్గా, మరోవైపు ధర మాత్రం దారుణంగా పడిపోయింది. మీ కాలు పొగాకు బోర్డులో పెడితేనే, మాకు న్యాయం జరుగుతుంది. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఒక రైతు పాల వెంకటేశం, పొగాకుకు గిట్టుబాటు ధర రాక, బాధతో చనిపోయాడు. జి.రవీంద్రబాబు. నెల్లూరు జిల్లా: – మాకు పొగాకు కేజీకి కేవలం రూ.160 మాత్రమే ఇస్తున్నారు. పొగాకు తీసుకొచ్చి షెడ్‌లో పెడితే, కలర్ మారుతోంది. కేవలం 10 శాతం వరకు మాత్రమే ఎక్కడో ఒకచోట కేజీకి రూ.250 ఇస్తున్నారు. రాజేంద్రబాబు. తూ.గో జిల్లా. గోపాలపురం నియోజకవర్గం: – మాది నీరు పెట్టి సాగు చేసే పొగాకు. ఈ ఏడాది 88 మిలియన్ కేజీల పంట కొంటారని అంచనా వేయగా, ఈరోజు వరకు 7.62 మిలియన్ కేజీలు మాత్రమే కొన్నారు. ఈ ఏడాది కొనుగోలు ధర కేజీకి కేవలం రూ.265 మాత్రమే. అది కూడా మొత్తం చెల్లించడం లేదు. ఇండెంట్ ఇచ్చినప్పుడు ఒక రేటు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నం. రెండేళ్ల క్రితం 2023–24లో కేజీ పొగాకు ధర రూ.320కి పైగా పలికింది. ఈసారి 80 మిలియన్ కిలోల పొగాకు ఉంది. కానీ ఎంత వరకు కొంటారో తెలియడం లేదు. దాదాపు 40 శాతం పొగాకును వేలం కేంద్రాల్లో తిరస్కరిస్తున్నారు. దీంతో రైతులకు మరిన్ని కష్టాలు. పొగాకును బయటకు తీసుకొచ్చి, మళ్లీ తీసుకుపోతే, రంగు మారుతుంది. క్వాలిటీ పడిపోతుంది. పొగాకు కొనుగోళ్లలో ఐటీసీది కీలక పాత్ర. కానీ, ఈసారి ఆ సంస్థ కూడా చొరవ చూపడం లేదు. ఎన్.వెంకటేశ్వరరెడ్డి. నెల్లూరు జిల్లా: – మాది కందుకూరు నియోజకవర్గం. మా దగ్గర 4 రౌండ్ల వేలం జరిగింది. ఒక్కో రైతుకు సంబంధించి చూస్తే, 8 క్వింటాళ్ల నుంచి 9 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు జరిగింది. అమ్మకాలు లేకపోవడం వల్ల, పొగాకు క్వాలిటీ తగ్గుతోంది. దాంతో రైతులు చాలా నష్టపోతున్నారు. పొగాకు ఆకు మగ్గిపోవడంతో, ఎగుమతి కాదంటూ, తిరస్కరిస్తున్నారు. కొంటున్న పొగాకుకు కూడా కేజీకి రూ.160 మాత్రమే దక్కుతోంది. మా దగ్గర రెండు వేలం కేంద్రాలు ఉన్నాయి. మీరు వస్తే తప్ప, మాకు న్యాయం జరగదు. ఎస్.వెంకట్రావు. ఏలూరు జిల్లా. జంగారెడ్డిగూడెం: – పొగాకు సాగులో ఏటా 20 శాతం వంతున వ్యయం పెరుగుతుంది. ఈసారి ధర రూ.265 నుంచే మొదలు పెట్టారు. చివరకు దాన్ని రూ.175కి తగ్గించారు. దీంతో మాకు కష్టాలు, నష్టాలు దారుణంగా పెరిగాయి. మార్కెట్‌లో డిమాండ్ లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు చెబుతున్న రూ.265 కూడా గిట్టుబాటు కాదు. కానీ, ఆ ధరకు కూడా కొనేది చాలా తక్కువ. పొగాకు వల్ల ఏటా కేంద్ర ప్రభుత్వానికి రూ.50 వేల కోట్ల నుంచి రూ.55 వేల కోట్ల ఆదాయం వస్తుంది. మాకు మీ వల్లనే న్యాయం జరుగుతుంది. మీరు అడుగు పెడితే, మా కష్టాలు తీరుతాయి. ఈ ఏడాది 26 వేల బేళ్ల పొగాకు తెస్తే, కేవలం 6 వేల బేళ్ల పొగాకు మాత్రమే కొన్నారు. జి.వెంకటేశ్వర్‌రెడ్డి. పొదిలి: – ఎక్కడా పొగాకు అమ్ముడు పోవడం లేదు. బోర్డుకు తీసుకుపోతే నో బిడ్. పొగాకును ప్లాట్‌ఫామ్స్‌కు తీసుకుపోతే, కొనకపోవడంతో, వెనక్కి తీసుకురావడం కూడా చాలా కష్టంగా ఉంటోంది. ఒక చెట్టుకు 25 వరకు ఆకులు వస్తాయి. అన్నీ ఒకే నాణ్యతతో ఉండవు. కిందవి వేరుగా ఉంటాయి. చెట్టు మద్య ఆకులు మాత్రమే బాగుంటాయి. అయితే మమ్మల్ని కేవలం నాణ్యమైన ఎఫ్–1, ఎఫ్–2 పొగాకు మాత్రమే తెమ్మంటున్నారు. అది ఎలా సాధ్యం. క్వాలిటీ అనేది మా చేతుల్లో లేదు కదా? ఆగస్టు వస్తోంది. అంటే వచ్చే పంటకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. క్వాలిటీ లేదని రోజూ దాదాపు 45 శాతం వెనక్కు పంపిస్తున్నారు. టుబాకో బోర్డు మొత్తం సరుకు కొనేలా చొరవ చూపండి. ఎం.వెంకటనారాయణ. సంతనూతలపాడు. ఒంగోలు: – కరోనా టైమ్‌లో కూడా కేజీ పొగాకు రూ.180 నుంచి రూ.260 వరకు కొన్నారు. మాకు మంచి లాభాలు వచ్చాయి. ఇప్పుడు అస్సలు ధర లేదు. అయితే సీఎం ఆదేశాలు జారీ చేశారని, గిట్టుబాటు ధర వస్తుందని ప్రచారం చేశారు. కానీ, వ్యాపారులు అస్సలు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే, ప్రభుత్వం నిధులు ఇస్తేనే కదా.. వారు ఆ ధర పెట్టి కొనేది. ఎన్.నాగినేనిచౌదరి. కొండెపి నియోజకవర్గం. ప్రకాశం: – మీరు ఉన్నప్పుడు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపడంతో, మాకు మంచి ధర దక్కింది. కేజీకి సగటున రూ.280 కచ్చితంగా దక్కింది. ఎం.వెంకటేశ్వర్లు. కోయలగూడెం: – మా దగ్గర 13 వేల కుటుంబాలు పొగాకు సాగు చేస్తున్నాయి. ఇంకా సమీప ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి, పొలాల్లో పని చేస్తున్నారు. దాదాపు లక్ష మంది వలస కూలీలు వచ్చి, జీవనోపాథి వెతుక్కున్నారు. కానీ, పొగాకు ధరకు అస్సలు ధర రావడం లేదు. గత ఏడాది రూ.290 నుంచి ధర మొదలు కాగా, ఈ ఏడాది రూ.265 నుంచి మొదలుపెట్టి, కనీసంగా కేవలం రూ.170 మాత్రమే చెల్లిస్తున్నారు. హరిబాబు. జంగారెడ్డిగూడెం: – మీ ప్రభుత్వ హయాంలో మార్కెట్‌లో జోక్యం చేసుకోవడం వల్ల, మాకు మంచి ధర దక్కింది. కేజీ పొగాకు రూ.280 నుంచి రూ.430 వరకు ధర దక్కింది. కానీ, ఇప్పుడు సీఎం చంద్రబాబు అస్సలు పట్టించుకోవడం లేదు. శివకుమార్‌రెడ్డి. కందుకూరు నియోజకవర్గం: – మా దగ్గర సాగు నీరు తక్కువ కాబట్టి పెట్టుబడి ఎక్కువ అవుతోంది. కానీ, ఏ మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదు. వెంకటేశ్వర్‌రెడ్డి. ఎర్రగొండపాలెం: – మా దగ్గర పొగాకు కొనుగోళ్లు అస్సలు జరగడం లేదు. వ్యాపారులను అడిగితే, మేమంతా సిండికేట్ అయ్యాం. చంద్రబాబును కలిశాం. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు అంటున్నారు. మాది ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటున్నారు. మరోవైపు సీఎం మాత్రం, మంచి ధర ఇవ్వాలని చెబుతున్నాడు. కానీ, వ్యాపారులు మాత్రం బేలుకు రూ.30 వేలు కాదు కదా, రూ.16 వేలకు కూడా కొనడం లేదు. అంటే సీఎం మాటకు విలువ లేదా? లేక ఆయన డ్రామాలు చేస్తున్నాడా? మిమ్మల్ని ఓడించినందుకు అందరికీ బుద్ధి వచ్చింది. జగన్ ఉంటేనే, అందరికీ న్యాయం జరుగుతుందని, మేలు జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నాం.