రాయలసీమ నీటి సమస్యలపై వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం

తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రైతాంగానికి అండగా నిలిచే కార్యాచరణపై చర్చ

అల్మట్టి ఎత్తు పెంపుతో రాయలసీమ ప్రయోజనాలకు తీవ్ర నష్టం: నేతల ఆందోళన

తాడేప‌ల్లి: రాయలసీమలో నెలకొన్న నీటి సమస్యలు, తీవ్ర వర్షాభావ పరిస్థితులు, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ బుధవారం సమావేశమైంది. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కన్వీనర్‌ సాకే శైలజానాథ్‌, కమిటీ సభ్యులు అనంత వెంకట్రామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.

రాయలసీమ జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతాంగానికి అండగా నిలిచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. సకాలంలో వర్షాలు కురవకపోవడం, జలాశయాల్లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది.

సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, వ్యవసాయ బోర్లు పనిచేయక రైతులు పెట్టుబడులు కోల్పోతున్నారని నేతలు పేర్కొన్నారు. కరవు పరిస్థితుల కారణంగా పశుగ్రాసం, తాగునీటి సమస్యలు కూడా తీవ్రమవుతున్నాయని, ప్రభుత్వం తక్షణమే క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

అల్మట్టి ఎత్తు పెంపుతో రాయలసీమకు తీవ్ర నష్టం

అల్మట్టి జలాశయం ఎత్తు పెంపు ప్రతిపాదన వల్ల దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాలపై ఆధారపడిన రాయలసీమ ప్రాజెక్టులకు సకాలంలో నీరు చేరకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.

అల్మట్టి ఎత్తు పెంపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా న్యాయపరంగా, సాంకేతికంగా బలమైన వాదనలు వినిపించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం, సంబంధిత జలవనరుల సంస్థల వద్ద గట్టిగా పోరాడాలని స్పష్టం చేశారు. రాయలసీమకు నష్టం కలిగించే ఏ నిర్ణయాన్నీ సహించబోమని నేతలు తేల్చిచెప్పారు.

రాయలసీమ లిఫ్ట్‌పై జిల్లా స్థాయి కార్యక్రమాల సమీక్ష

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు సాధన కోసం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని సమావేశంలో సమీక్షించారు. ఇప్పటికే నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, రైతులు–నీటిపారుదల రంగ నిపుణులతో చర్చలు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమాలపై నేతలు చర్చించారు.

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ఆ ప్రాంతానికి అత్యంత కీలకమని, దానిని రాజకీయ కారణాలతో పక్కనపెట్టడం సరికాదని సమావేశం అభిప్రాయపడింది. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, అవసరమైన అనుమతులు సాధించి, రాయలసీమకు న్యాయంగా దక్కాల్సిన నీటిని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

పెండింగ్‌ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలి

రాయలసీమలోని పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులు, కాలువల ఆధునికీకరణ, జలాశయాల సామర్థ్యం పెంపు, చెరువుల పునరుద్ధరణ వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని నేతలు కోరారు. హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండతో పాటు రాయలసీమకు ప్రయోజనం చేకూర్చే అన్ని సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధులను విడుదల చేసి, పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతోపాటు హంద్రీ నీవాలో నాసిరకంగా చేసిన పనులపై ప్రభుత్వం విచారణ జరపాలని మరోసారి డిమాండ్‌ చేశారు. 

నీటి కేటాయింపులు ఉన్నా వాటిని వినియోగించుకునేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించకపోతే రాయలసీమకు న్యాయం జరగదని పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టుల పేరుతో కాలయాపన చేయకుండా ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.

రైతాంగాన్ని ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి

వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే సమగ్ర కరవు అంచనాలు చేపట్టాలని సమావేశం డిమాండ్‌ చేసింది. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడం, పంట రుణాలను రీషెడ్యూల్‌ చేయడం, కొత్త రుణాలు మంజూరు చేయడం, వడ్డీ భారాన్ని తగ్గించడం, పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరింది.

రాయలసీమ రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రజలను భాగస్వాములను చేస్తూ ఉద్యమ కార్యాచరణను మరింత ఉధృతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. జిల్లాల వారీగా రైతులు, రైతు సంఘాలు, నీటిపారుదల రంగ నిపుణులు, ప్రజాసంఘాలతో సమావేశాలు నిర్వహించి రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై విస్తృత చర్చ చేపట్టాలని నేతలు నిర్ణయించారు.

రాయలసీమ నీటి హక్కులు, రైతాంగ ప్రయోజనాల పరిరక్షణ కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం పోరాడుతుందని, ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు భవిష్యత్‌ కార్యాచరణను రూపొందిస్తామని సమావేశం స్పష్టం చేసింది.

Back to Top