వైయస్‌ జగన్‌ను కలిసిన నాగార్జున యాదవ్‌

అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొందాం.. ఆందోళన అవసరం లేదు:  వైయస్‌ జగన్‌ భరోసా

తాడేప‌ల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ను తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ బుధవారం కలిశారు.  తెలంగాణలో నమోదైన కేసులో అరెస్టయి ఇటీవల విడుదలైన నాగార్జున యాదవ్‌ తనపై పెట్టిన కేసు వివరాలను శ్రీ వైయస్‌ జగన్‌కు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టిన కేసుతో పాటు టీడీపీ ప్రభుత్వం తనపై నమోదు చేసిన అక్రమ కేసులు, విచారణ పేరుతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, తాను ఎదుర్కొన్న వేధింపులను వివరించారు.

నాగార్జున యాదవ్‌ చెప్పిన వివరాలను విన్న శ్రీ వైయస్‌ జగన్‌ ఆయనకు ధైర్యం చెప్పారు. రాజకీయ కక్షతో పెట్టే తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, వాటన్నింటినీ చట్టపరంగా సమర్థంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన, ప్రజల తరఫున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, బెదిరింపులు, వేధింపులను ధైర్యంగా ఎదుర్కొందామని శ్రీ వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత దృఢంగా కొనసాగిస్తూ బాధితులకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు.

అక్రమ కేసులు, రాజకీయ వేధింపులపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ప్రతి నాయకుడికి, కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, చట్టబద్ధంగా పోరాడి న్యాయం సాధిద్దామని భరోసా ఇచ్చారు.

Back to Top