ఆంజనేయస్వామి విగ్రహ ఘటనపై వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం 

 టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి 

తిరుప‌తి: తిరుమల క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి విగ్రహానికి సంబంధించిన ఘటనలో వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం జరుగుతోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. టీడీపీకి చెందిన ఐటీడీపీ నాయకుడు ఆంజనేయస్వామి విగ్రహాన్ని తీసుకెళ్లిన ఘటనపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. పోలీసులు ఈ విగ్రహాన్ని ఓ భక్తుడు ఇటీవల ప్రతిష్ఠించినదిగా చెబుతున్నారని, వందల ఏళ్ల చరిత్ర ఉన్న విగ్రహంగా ప్రచారం చేయడం లేదని, అయితే కనీసం ఆ విగ్రహానికి దశాబ్దాలుగా పూజలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందేనని భూమన అన్నారు. 2000వ‌ సంవత్సరం తర్వాత ప్రతిష్ఠించిన విగ్రహమని పోలీసులు చెబుతుండటం వాస్తవాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

టీడీపీ నాయకులు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. సాక్షాత్తు క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి విగ్రహాన్నే తీసుకెళ్లే స్థాయికి పరిస్థితులు చేరుకున్నాయని, దీనివల్ల దేవస్థానం ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగిందని అన్నారు. మాజీ ఈవో పి.వి.ఆర్‌.కే. ప్రసాద్‌ హయాంలో పెద్ద ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని, 1979 నుంచే టీటీడీ అధికారికంగా ఆంజనేయస్వామి జన్మనక్షత్రం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తోందని గుర్తు చేశారు. ఈ విగ్రహానికి ఉన్న ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. తిరుమలలో పోలీసులు, విజిలెన్స్‌ శాఖలు పూర్తిగా విఫలమయ్యాయని భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. ఈ ఘటనను నీరుగార్చే విధంగా కేసును దర్యాప్తు చేస్తున్నారని ఆరోపించారు. నిందితుడు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇలా చేశాడని చెప్పడం దారుణమని అన్నారు. తిరుమలలో భద్రతా వ్యవస్థలో ఇలాంటి లోపాలు కొనసాగితే భవిష్యత్తులో మరింత తీవ్రమైన ఘటనలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గర్భగుడిలోకి చొరబడి స్వామివారి కిరీటాన్నే ఎత్తుకెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదని వ్యాఖ్యానిస్తూ, పోలీసులు, విజిలెన్స్‌ శాఖ తమ వైఫల్యాలపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

 

Back to Top