వైఫల్యాలను ఒప్పుకున్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి రాజీనామా చేయాలి 

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి డిమాండ్‌

వైయ‌స్ఆర్ జిల్లా: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ పాలనలో వైఫల్యాలను బహిర్గతం చేశాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై వైయ‌స్ఆర్‌సీపీ గతంలో చేసిన విమర్శలను ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేనే పరోక్షంగా ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించినందుకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని అభినందిస్తున్నానని, అయితే నైతిక బాధ్యతగా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు తప్పులు చేయడం లేదని, ప్రభుత్వం తప్పులు చేసి వాటి బాధ్యతను ఉద్యోగులపై నెట్టేస్తోందని ఆయన ఆరోపించారు. ఉద్యోగులతో అక్రమ పనులు చేయించేది ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డేనని విమర్శించారు. మార్కెట్‌ యార్డులో అధికారిక కార్యక్రమాలు ఛైర్మన్‌ పేరుతో నిర్వహించినా, తీర్థ ప్రసాదాలు మాత్రం కొండారెడ్డికి అందజేస్తున్నారని ఎద్దేవా చేశారు.

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పేకాట క్లబ్బులను మూసివేసినట్లు గుర్తుచేసిన ఆయన, ప్రస్తుతం జార్జి క్లబ్‌లో పేకాట నిర్వహిస్తూ సభ్యత్వం పేరుతో రూ.1.20 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. చౌడూరు గ్రామంలో ఇసుక అక్రమంగా తవ్వించి విక్రయిస్తూ రోజుకు రూ.25 లక్షలు సంపాదిస్తున్నారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అధికారులపై ప్రజలు తిరుగుబాటు చేయాలని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి చెప్పడం బాధ్యతారాహిత్యమని రాచమల్లు అన్నారు. ప్రజలు తిరుగుబాటు చేయాల్సింది అధికారులపై కాదని, కూటమి ప్రభుత్వంపై, చంద్రబాబు, కూటమి ఎమ్మెల్యేలపై అని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను బహిరంగంగా ఒప్పుకున్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన రాజీనామా చేసినా, చేయకపోయినా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారని విమర్శించారు. "గుంటూరు పొగాకు నోట్లో ఉన్నా, గూట్లో ఉన్నా ఒక్కటే" అన్న సామెతను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే పరిస్థితి కూడా అలాంటిదేనని ఎద్దేవా చేశారు. ఇటీవల ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మానసిక స్థితి సరిగా లేనట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించిన రాచమల్లు, ఇటీవల ప్రొద్దుటూరు పర్యటన సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ ఎమ్మెల్యేను మందలించినట్లు సమాచారం ఉందని అన్నారు. ఆ కారణంగానే ఆయన ప్రభుత్వం వైఫల్యాలపై ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని పేర్కొన్నారు.

Back to Top