కాకినాడ జిల్లా : దివంగత ముద్రగడ పద్మనాభం జీవితాంతం పేదల కోసం, తాను విశ్వసించిన సిద్ధాంతాల కోసం అంకితభావంతో పనిచేశారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, అనంతరం ముద్రగడ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో ఉన్నత పదవుల కోసం ఎప్పుడూ ఆశపడలేదని, ప్రజల కోసం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా నిలిచిపోయారని కొనియాడారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలు, సంక్షేమ పాలనపై విశ్వాసంతోనే 2024లో వైయస్ఆర్‌సీపీలో చేరారని తెలిపారు. వైయస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు వస్తుందని ముద్రగడ బలంగా నమ్మారని పేర్కొన్నారు. మరోసారి వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనే సంకల్పంతో చివరి వరకు పార్టీ బలోపేతానికి కృషి చేశారని అన్నారు. కాపునాడు, కాపు ఉద్యమాల్లో ముద్రగడ పద్మనాభం పోషించిన పాత్ర చిరస్మరణీయమని సజ్జల పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతే తన లక్ష్యమని భావించి జీవితాంతం ఉద్యమించిన ఆయన, సామాజిక న్యాయం కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, శైలజానాథ్, కురసాల కన్నబాబు, వేణుగోపాలకృష్ణ, తోట నరసింహం , మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వంగా గీత, జక్కంపూడి రాజా, రౌతు సూర్యప్రకాశరావు తదితర వైయస్ఆర్‌సీపీ నాయకులు పాల్గొని ముద్రగడ పద్మనాభానికి ఘన నివాళులర్పించారు.