గుంటూరులో మహిళపై జరిగిన దాడి, వివస్త్రను చేసిన ఘటనకు నిరసనగా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నిరసనల్లో పాల్గొన్న మహిళా నేతలు, కార్యకర్తలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నిరసన కార్యక్రమాల అనంతరం ఆయా జిల్లా కేంద్రాల్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాల వద్దకు వెళ్లి, మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి జరిగిన ఈ నిరసన కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. - విజయవాడలో.. గుంటూరులో మహిళను వివస్త్రను చేసి వేధించిన ఘటనను ఖండిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, మొండితోక జగన్మోహన్ రావు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో పాటు పెద్ద ఎత్తున మహిళా నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిరసన సందర్భంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళల భద్రతను కాపాడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్, మండల స్థాయి మహిళా నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని నిరసనకు సంఘీభావం తెలిపారు. - గుంటూరులో.. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు, అరాచకాలకు నిరసనగా గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో గుంటూరు లాడ్జి సెంటర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పార్లమెంట్ పరిశీలకుడు పోతిన మహేష్, నియోజకవర్గ సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, అన్నాబత్తుని శివకుమార్, బలసాని కిరణ్ కుమార్, డైమండ్ బాబు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిరసన సందర్భంగా మహిళల భద్రతపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళల భద్రతకు హామీ కల్పించాలని కోరుతూ నిరసన కొనసాగించారు. - తిరుపతిలో.. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులు, భద్రతా సమస్యలకు నిరసనగా తిరుపతి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాళ్లు సాయిలక్ష్మి, విజయలక్ష్మి, కుమారి తదితరులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి, రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నేత సాయిలక్ష్మి మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పరిస్థితులు దిగజారాయని, మహిళల భద్రతను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని కోరారు. - అనంతపురంలో.. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దాడులకు నిరసనగా అనంతపురం నగరంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు భారీ ధర్నా నిర్వహించారు. నిరసనలో పాల్గొన్న మహిళలు మహిళల భద్రతకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి పాలనలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని పేర్కొంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.