కూటమి పాలనలో రాష్ట్రంలో తగ్గని నిరుద్యోగం

కేంద్ర గణాంకాలు బట్టబయలు చేసిన వైనం

పట్టణ నిరుద్యోగం 5.9 నుంచి 6.2 శాతానికి పెరుగుదల

యువతలో నిరుద్యోగం ఏకంగా 16.2 శాతం

‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే’ (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) వెల్లడి

న్యూఢిల్లీ: రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, తద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించామని టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆర్భాట ప్రచారం ఒట్టిదేనని తేలింది. ఆ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి. ఆ మేరకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు ఇచ్చిన తాజా సమాధానంలో వెల్లడించిన ‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే’ (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) వివరాలు, రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గకపోగా, కొన్ని విభాగాల్లో మరింత పెరిగినట్లు తేల్చి చెప్పాయి.

- రాష్ట్రంలో పెరిగిన నిరుద్యోగం:
    
రాష్ట్రంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది, అంటే 2023–24లో నిరుద్యోగిత రేటు 4.1 శాతంగా ఉండగా, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదలైన తొలి వార్షిక ‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే’ (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) నివేదికలో చూస్తే, అది 4.2 శాతానికి పెరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం మరింత ఆందోళనకరంగా మారింది. 2023–24లో పట్టణ నిరుద్యోగిత రేటు 5.9 శాతంగా ఉండగా, టీడీపీ కూటమి పాలనలో అది 6.2 శాతానికి పెరిగింది. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటులో మాత్రం మార్పు రాలేదు. 3.4 శాతం వద్ద యథాతథంగా కొనసాగింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి కల్పనలో మెరుగైన పరిస్థితులు రాకపోగా, పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దిగజారింది.

    ఇంకా రాష్ట్రంలో 15–29 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువతలో నిరుద్యోగిత రేటు ఏకంగా 16.2 శాతంగా నమోదైంది. ఉద్యోగ, ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువతకు ప్రభుత్వం సరైన అవకాశాలు కల్పించలేకపోతోంది అనడానికి ఈ గణాంకాలు ఒక నిదర్శనం.

- పథకాల సమర్థ వినియోగం లేదు:
    
ఉపాధి కల్పన.. నైపుణ్యాభివృద్ది.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహం.. స్వయం ఉపాధి.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పెరుగుదల.. అప్రెంటిస్‌షిప్‌ల కోసం దేశవ్యాప్తంగా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా, ఆయా పథకాలను సమర్థంగా వినియోగించుకోవడంలో, రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలమైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రచార ఆర్భాటాలు కాకుండా వాస్తవాలు చెప్పాలి. ఈ రెండేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ఎన్ని పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. వాటి వల్ల ఎన్ని శాశ్వత ఉద్యోగాలు వచ్చాయి. ఎంతమంది స్థానిక యువతకు ఉపాధి లభించిందనే వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉంది.

Back to Top