'నమస్తే ఎమ్మిగనూరు'లో రైతు సమస్యలపై ఎర్రకోట రాజీవ్ రెడ్డి స్పందన 

అకాల వర్షాలతో నష్టపోయిన రైతుకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలి 

మార్కెట్ యార్డులో మౌలిక వసతులు మెరుగుపర్చాలని అధికారులకు సూచన 

ఎమ్మిగనూరు : వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన "నమస్తే ఎమ్మిగనూరు – ప్రజా సమస్యలపై పోరుబాట`` కార్యక్రమంలో భాగంగా మూడో రోజు ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్  ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఎమ్మిగనూరు మార్కెట్ యార్డును సందర్శించి అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించారు. రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.

దేవనకొండ మండలం బి సెంటర్ గ్రామానికి చెందిన రైతు  కరుణ  మార్కెట్ యార్డుకు అమ్మకానికి తీసుకొచ్చిన సుమారు 12 క్వింటాళ్ల వేరుశనగ అకాల వర్షానికి పూర్తిగా తడిసి, డ్రైనేజీ నీరు చేరడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రాజీవ్ రెడ్డికి వివరించారు. కష్టపడి పండించిన పంట కళ్లముందే పాడైపోవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని కోరారు.

బాధిత రైతుకు ధైర్యం చెప్పిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి, తడిసిన వేరుశనగను స్వయంగా పరిశీలించారు. అనంతరం మార్కెట్ యార్డ్ అధికారులతో మాట్లాడి రైతుకు జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేసి, ప్రభుత్వ పరిహారం అందించడంతో పాటు గిట్టుబాటు ధరకు వేరుశనగ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మార్కెట్ యార్డులో రైతులకు కనీస మౌలిక వసతులు కూడా సరిగా లేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీటి కోసం ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ పనిచేయడం లేదని గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని సూచించారు. అలాగే వర్షపు నీరు నిల్వ ఉండకుండా అవసరమైన ప్రాంతాల్లో సీసీ బెడ్లు ఏర్పాటు చేయడం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి మురుగునీరు వెంటనే బయటకు వెళ్లేలా శాశ్వత చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ పట్టణ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top