రాజకీయ కక్షసాధింపుతో తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గం

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండ

ప్రజాస్వామ్యాన్ని అణచివేసే చర్యలను ప్రజలు సహించరు: ధర్మాన ప్రసాదరావు

పలాస : మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో అప్పలరాజు కుమారుడిపై రాజకీయ కక్షసాధింపుతో హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ క్లిష్ట సమయంలో పార్టీ పూర్తిస్థాయిలో కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకులను అణచివేయడానికి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చి ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును రాజకీయంగా లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు.

రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి, ఇప్పటికే 41ఏ నోటీసు జారీ చేసిన అధికారులను బదిలీ చేసి, కొత్త అధికారులతో ఒకేరోజు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ధర్మాన పేర్కొన్నారు. ఒక ప్రమాద ఘటనను హత్య కేసుగా చిత్రీకరించడం చట్టబద్ధ ప్రక్రియకు విరుద్ధమని అన్నారు. విద్యార్థి దశలో ఉన్న యువకుడిని రాజకీయ కక్షతో జైలుకు పంపడం అత్యంత బాధాకరమని, ఒక కుటుంబాన్ని మానసికంగా వేధించడం ద్వారా ప్రభుత్వం ఏం సాధించాలని చూస్తోందని ప్రశ్నించారు. తప్పుడు కేసులకు సీదిరి అప్పలరాజు భయపడే వ్యక్తి కాదని, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం ప్రమాదకర పరిణామమని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని అణచివేసే ప్రయత్నాలను ప్రజలు సహించరని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే రాజకీయ కక్షసాధింపు చర్యలను విరమించి, తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, సమన్వయకర్తలు పేరాడ తిలక్, శ్యాంప్రసాద్ రెడ్డి, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Back to Top