శ్రీకాకుళం జిల్లా: జొన్న రైతుల సమస్యలను తెలుసుకునేందుకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వాడాడ, కొత్తూరు, అచ్చెనపాలెం, బలివాడ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..“మన దేశంలో ఏదైనా పంటకు మద్దతు ధరను ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. ఆ మద్దతు ధరకు కొనుగోలు చేస్తారని నమ్మకంతోనే రైతు పంట వేస్తాడు. ఈ రాష్ట్రంలో జొన్నకు క్వింటాల్‌కు రూ.2400 మద్దతు ధర ప్రకటించారు. అందరూ ఆ నమ్మకంతోనే మొక్కజొన్న పంట వేశారు. కానీ పంట వేసే సమయంలో ఎరువులు అందించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దొరికిన కాడకు ఎరువులను దోచుకుని బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకున్నారు. రైతులకు ఎరువులు అందకుండా చేశారు. రైతులు చెబుతున్నారు.. రూ.280కి దొరకాల్సిన ఎరువు మా ఊర్లో దొరకలేదు, కానీ రూ.600కి పక్క ఊర్లో బ్లాక్‌లో కొనాల్సి వచ్చిందని. రాష్ట్రంలో ఎరువులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ధరకు రైతులకు అందించలేకపోవడం కంటే పెద్ద వైఫల్యం ఏముంటుంది? ప్రభుత్వం పెట్టిన మద్దతు ధరకు కొనకపోతే రైతులకు కలిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? వ్యక్తులు మాట తప్పొచ్చు… కానీ ప్రభుత్వం మాట తప్పవచ్చా? ఏసీ గదుల్లో కూర్చోకుండా పొలాల్లోకి వచ్చి రైతుల కన్నీరు చూడండి. కష్టపడి చెమటోడ్చి పండించిన పంట చేతికి వచ్చినా అప్పులు తీరుతాయనే నమ్మకం రైతులకు లేకుండా ఈ ప్రభుత్వం చేసింది. వారి గోష మీకు వినిపించడం లేదా?. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యం. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఉరితాడు వేసుకునే పరిస్థితులు మళ్లీ రావొచ్చు. అందుకే ముఖ్యమంత్రి అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలి. శ్రీకాకుళం జిల్లాలోనే 80,000 ఎకరాల్లో జొన్న సాగు చేశారు. ఒక్క ఎకరానికి సగటున రూ.2,800 నష్టం వస్తోంది. అంటే మొత్తం జిల్లాలో రూ.240 కోట్లు రైతులు నష్టపోతున్నారు. ఇది చిన్న విషయం కాదు. ఇంకా దురదృష్టకర విషయం ఏమిటంటే, ప్రభుత్వం తరఫున ఒక బ్రోకర్ క్వింటాల్‌కు రూ.1800 కంటే ఎక్కువ ఇవ్వొద్దని చెబుతున్నాడని సమాచారం. విజిలెన్స్, ఇంటెలిజెన్స్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు ఏమయ్యాయి? అలాంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇంత జరుగుతున్నా మంత్రి గానీ, అధికారులు గానీ గ్రామాలకు వచ్చి రైతులను అడిగారా? వారి బాధలు తెలుసుకున్నారా? బ్లాక్‌లో ఎరువులు కొనాల్సిన పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వానికి సిగ్గు అనిపించదా?. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు అందించింది. రైతు ఏ పార్టీకి చెందినవాడో చూడకుండా అందరికీ సమానంగా సహాయం చేసింది. జొన్న ధరలు పడిపోయినప్పుడు రైతుల వద్దకే వెళ్లి కొనుగోలు చేసి వారికి నష్టం రాకుండా చూసింది. రైతుల సహనాన్ని పరీక్షించకండి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి రైతులకు న్యాయం చేయాలి” అని ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు.