రెండేళ్ల‌లో రూ.20 వేల కోట్ల విద్యుత్ భారం

చంద్ర‌బాబు నేతృత్వం లోని కూటమి స‌ర్కారు ఘ‌న‌కార్యం

మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్ బాబు ధ్వ‌జం 

తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు, 
మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్ బాబు

విద్యుత్ ఛార్జీలు పెంచ‌బోయేది లేద‌ని ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన చంద్ర‌బాబు

అధికారంలోకి వ‌చ్చి నాలుగు నెల‌లు తిర‌గ‌కుండానే రూ. 6 వేల కోట్ల భారం 

దోచుకున్న‌ది కాకుండా విద్యుత్ చార్జీలు త‌గ్గించినట్టు చంద్ర‌బాబు క‌ల‌రింగ్‌

యూనిట్ విద్యుత్‌పై ఏకంగా 40 పైస‌లు పెంచేసి రూ. 2,787 కోట్లు దండుకున్న ప్ర‌భుత్వం

ఆ దోచేసిన సొమ్మునే ఏపీఈఆర్సీ హెచ్చ‌రిక‌ల‌తో ట్రూడౌన్ చేసింది 

మ‌ళ్లీ చార్జీలు పెంచ‌బోతూ దానికి జ‌గ‌న్‌ని కార‌ణం చేయాల‌నే కుట్రలు 

చంద్ర‌బాబు కుట్ర‌ల‌ను మీడియాకు వివ‌రించిన టీజేఆర్ సుధాక‌ర్ బాబు  

రెండేళ్ల‌లో కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌పై మోపిన విద్యుత్ భారం రూ. 20 వేల కోట్లు 

ఏపీఈఆర్సీ హెచ్చ‌రిక‌ల‌తో రూ. 2,787 కోట్లు ట్రూ డౌన్ చేసిన కూట‌మి ప్ర‌భుత్వం

దండుకున్న డ‌బ్బులు తిరిగిస్తూ ధ‌ర‌లు త‌గ్గిస్తున్న‌ట్టు చంద్ర‌బాబు క‌ల‌రింగ్ 

చంద్ర‌బాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభమే. 

బషీర్‌బాగ్‌లో రైతుల‌పై కాల్పులు జ‌రిపిన ఘ‌ట‌న‌ను ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ మ‌ర్చిపోరు

వైయ‌స్ జ‌గన్ పాల‌న‌లో రాష్ట్రంలో విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు అమ‌లు 

స్పష్టంచేసిన టీజేఆర్ సుధాక‌ర్ బాబు.

తాడేప‌ల్లి:  కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన రెండేళ్ల‌లోనే ప్ర‌జ‌ల‌పై రూ. 20 వేల కోట్ల విద్యుత్ భారం మోపిందే కాకుండా ఈ ఏప్రిల్‌ లోనే మ‌రో రూ. 15,651 కోట్ల భారం మోప‌డానికి చంద్ర‌బాబు రంగం సిద్ధం చేస్తున్నాడ‌ని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్ బాబు ధ్వ‌జమెత్తారు. తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వైయ‌స్ జ‌గ‌న్ హయాంలో ప్ర‌జ‌ల‌పై రూ. 1.12 ల‌క్ష‌ల కోట్ల విద్యుత్ భారం మోపార‌ని చంద్రబాబు చేసిన ఆరోప‌ణ‌ల‌కు ఆధారాలు చూపించాల‌ని డిమాండ్ చేశారు. నోటికొచ్చిన‌ట్టు అబ‌ద్ధాలు చెబుతూ త‌న అస‌మ‌ర్థ‌త‌ను వైయ‌స్ జ‌గ‌న్ గారిపై నెట్టే కుట్ర‌లు చేస్తున్నాడ‌ని, విద్యుత్ చార్జీల పెంపున‌కు ఆయ‌న్ను కార‌ణం చేయడానికి వ్యూహ ర‌చ‌న చేస్తున్నాడ‌ని వివ‌రించారు. అందుకోస‌మే అన‌కాప‌ల్లి స‌భ‌లో కార‌ణం లేక‌పోయినా విద్యుత్ అంశం తీసుకొచ్చి ప‌దే ప‌దే వైయ‌స్ జ‌గ‌న్ గారి హ‌యాంలో జ‌రిగిన ఒప్పందాలను చంద్ర‌బాబు విమ‌ర్శించాడ‌ని చెప్పారు. యూనిట్ రూ. 2.49 ల‌కు కొంటే ఆదా చేసిన‌ట్టా, చంద్ర‌బాబులా రూ. 4.69ల‌కు కొనుగోలు చేస్తే ప్ర‌జల సొమ్మును ఆదా చేసిన‌ట్టా అని ప్ర‌శ్నించారు. 2014-19 మ‌ధ్య విద్యుత్ ఒప్పందాల పేరుతో చంద్ర‌బాబు భారీగా క‌మీష‌న్లు దండుకున్నాడ‌ని, వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌చ్చాక వాటిని స‌మీక్షించి అడ్డ‌గోలు ఒప్పందాల‌ను ర‌ద్దు చేసిన‌ట్టు చెప్పారు. చంద్ర‌బాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా ప్ర‌జ‌ల‌పై విద్యుత్ భారం త‌ప్ప‌ద‌ని, చంద్ర‌బాబు హ‌యాంలో బ‌షీర్‌బాగ్‌లో రైతులపై జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌ను రాష్ట్ర ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ మ‌ర్చిపోర‌ని టీజేఆర్ సుధాక‌ర్ బాబు వెల్ల‌డించారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే... 

- ఆరోప‌ణ‌లు కాదు.. ఆధారాలు చూపించు

అన‌కాప‌ల్లిలో రెన్యూ ఎన‌ర్జీ సంస్థ మూడో ప్రాజెక్టు భూమి పూజ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సీఎం చంద్ర‌బాబు త‌న స‌హ‌జ శైలిలో మ‌రోసారి అబ‌ద్ధాలతో రెచ్చిపోయాడు. సందర్భం లేక‌పోయినా వైయ‌స్ జ‌గ‌న్ పేరును ప‌దే ప‌దే జ‌పించి ఆయ‌న మీద త‌న‌కున్న అక్క‌సును బ‌య‌ట‌పెట్టుకున్నాడు. 2019-24 మ‌ధ్య విద్యుత్ రంగం పూర్తిగా కుప్ప‌కూలిపోయింద‌ని ఆధారాలు లేకుండా అబద్ధాలను వల్లె వేశాడు. 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచామ‌ని రూ. 1.12 ల‌క్ష‌ల కోట్ల భారం ప్ర‌జ‌ల‌పై మోపిన‌ట్టు నోటికొచ్చిన‌ట్టు చెప్పుకుంటూ పోయాడు. అధికారంలోకి వ‌స్తే విద్యుత్ చార్జీలు పెంచ‌డం జ‌ర‌గ‌ద‌ని ఎన్నిక‌ల హామీగా చెప్పిన చంద్ర‌బాబు, 2024లో ముఖ్య‌మంత్రి త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు రెండేళ్ల‌లో ఏకంగా రూ.20 వేల కోట్ల భారం మోపాడు. 2024 జూన్‌లో అధికారంలోకి రాగా నాలుగు నెల‌లు తిర‌గ‌కుండానే అక్టోబ‌ర్ 25న రూ. 6072.86 కోట్ల భారం మోపాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ నెల‌రోజులు తిర‌గ‌కుండానే నవంబ‌ర్ 29న మ‌రో రూ.9412.50 కోట్ల భారం మోపాడు. 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.1863.64 కోట్లు భారం మోపాడు. నాలుగోసారి మ‌రో రూ. 2787 కోట్ల భారం మోపాడు. ఇది నిజ‌మా కాదా చెప్పాలి. 
వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో ప్ర‌జ‌ల‌పై విద్యుత్ భారం మోపిన‌ట్టు చెబుతున్న చంద్ర‌బాబు, మేం చెప్పిన‌ట్టు జీవోలు, తేదీల‌తో స‌హా వివ‌రించగ‌ల‌రా అని స‌వాల్ విసురుతున్నా. 

- పీపీఏ ల‌తో దోచుకున్న‌ది కాకుండా..

పీపీఏలు ర‌ద్దు చేసి నష్టం చేశామ‌ని చంద్ర‌బాబు మ‌రో ఆరోప‌ణ చేశాడు. యూనిట్ విద్యుత్ ధ‌ర రూ. 2.49 లు ఉండ‌గా చంద్ర‌బాబు రూ. 4.60కి ఒప్పందం చేసుకుంటే త‌ప్పు కాదా?  2014-19 మ‌ధ్య కాలంలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు యాక్సిస్ నుంచి యూనిట్ ధ‌ర‌ను రూ. 4.60ల‌కు కొనుగోలు చేసిన మాట వాస్త‌వ‌మా కాదా?   అదే వైయ‌స్ జ‌గ‌న్ గారు సీఎం అయ్యాక యూనిట్ విద్యుత్‌ను సెకీ నుంచి కేవ‌లం రూ. 2.49ల‌కు కొన్నాడు. అయినా మాయ‌మాట‌ల‌తో ఎల్లో మీడియా అండ‌గా తిమ్మినిబ‌మ్మిని చేసి వైయ‌స్ జ‌గ‌న్ గారి మీద నింద‌లు మోపుతూ కుట్ర‌లు చేస్తున్నాడు. వైయ‌స్ జ‌గ‌న్ హయాంలో పీపీఏలు ర‌ద్దు చేసి సంస్క‌ర‌ణ‌లు తెచ్చి రూ. 5448.03 కోట్ల ప్ర‌యోజ‌నం చేకూర్చ‌డం జ‌రిగింది. వైయ‌స్ జ‌గ‌న్ వ‌ల్ల ప్ర‌జ‌ల‌పై విద్యుత్ భారం త‌గ్గితే దాన్ని ప్ర‌జ‌లకు జ‌రిగిన న‌ష్టంగా ప్ర‌చారం చేస్తున్నారు. 2024లో ఏపీఈఆర్సీ  రాష్ట్ర విద్యుత్ నియంత్ర‌ణ సంస్థ చంద్ర‌బాబు విధానాల‌ని తూర్పారా బ‌ట్టింది. ఫ్యూయ‌ల్ అండ్‌ ప‌వ‌ర్ ప‌ర్చేజ్ కాస్ట్ అడ్జెస్ట్‌మెంట్ పేరిట 2024-25 ఆర్థిక సంవత్స‌రంలో ప్ర‌తి యూనిట్ విద్యుత్ వినియోగానికి 40పైస‌లు అద‌నంగా వ‌సూలు చేసింది. ఆమేరకు ప్ర‌జ‌ల నుంచి మొత్తం రూ. 2,787 కోట్లు కూట‌మి ప్ర‌భుత్వం దండుకుంది. వెంట‌నే ఆ డ‌బ్బును తిరిగి ప్ర‌జ‌ల‌కు చెల్లించాల‌ని ఏపీఈఆర్సీ ఆదేశాలిస్తే త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ట్రూడౌన్ పేరుతో వెన‌క్కివ్వాల్సి వ‌చ్చింది. అయితే దోచుకున్న సొమ్మును వెన‌క్కి ఇచ్చేస్తూ కూడా ధ‌ర‌లు త‌గ్గిస్తున్న‌ట్టు చంద్ర‌బాబు క‌ల‌రింగ్ ఇస్తున్నాడు. రెండేళ్ల‌లో ఏకంగా విద్యుత్ చార్జీల పేరిట రూ. 20,136 కోట్ల భారం ప్ర‌జ‌ల‌పై మోపాడు. 

- చంద్ర‌బాబు హ‌యాంలో ఎప్పుడూ విద్యుత్ సంక్షోభ‌మే

ఈ నెల ఏప్రిల్ 2026 నుంచి మ‌రో రూ. 15,651 కోట్ల విద్యుత్ భారం మోపడానికి చంద్ర‌బాబు రంగం సిద్దం చేశాడు. ఏపీఈఆర్సీ నుంచి అనుమ‌తి రాక‌పోవ‌డంతోనే ఎదురు చూస్తున్నాడు. విద్యుత్ ఛార్జీలు పెంచ‌బోతున్న చంద్ర‌బాబు, దానికి వైయ‌స్ జ‌గ‌న్ విధానాలే కార‌ణ‌మ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డానికి త‌ప్పుడు ప్ర‌చారంతో ప్ర‌జ‌ల‌ను మాయ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. వైయ‌స్ జ‌గ‌న్ త‌ప్పుల‌ను తాను స‌రిచేస్తున్న‌ట్టు మీడియాను అడ్డం పెట్టుకుని క‌ల‌రింగ్ ఇస్తున్నాడు. వాస్త‌వానికి గ‌తంలో చంద్ర‌బాబు పాల‌న‌లో తలెత్తిన విద్యుత్ సంక్షోభం గురించి ప్ర‌స్తావిస్తే బ‌షీర్‌బాగ్‌లో పోలీసుల తూటాల‌కు బ‌లైన రైతుల గురించి మాట్లాడాల్సి వ‌స్తుంది. ఉచిత క‌రెంట్ ఇస్తే క‌రెంట్ తీగ‌ల మీద బ‌ట్ట‌లు ఆరేసుకోవాలని చంద్ర‌బాబు చెప్పిన మాట‌లు గుర్తొస్తాయి. ఉచిత విద్యుత్ ను అమ‌లు చేసి చూపించిన వైయ‌స్సార్ పాల‌న గుర్తోచ్చి చంద్ర‌బాబు అస‌మ‌ర్థ‌త బ‌య‌ట‌ప‌డుతుంది. 

వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో 38 ర‌కాల సంక్షేమ ప‌థ‌కాలు అందించి డీబీటీ ద్వారా ఏకంగా రూ. 2.73 ల‌క్ష‌ల కోట్లు ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ చేయ‌డం జ‌రిగింది. 143 మోస‌పూరిత హామీల‌తో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు క‌నీసం సూప‌ర్ సిక్స్ హామీల్లో నిరుద్యోగ భృతి, ఆడ‌బిడ్డ నిధి ప‌థ‌కాల‌ను క‌నీసం ప్రారంభించనే లేదు. వైయ‌స్ జ‌గ‌న్ గారి మీద బుర‌ద జ‌ల్లి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తూ తెర‌వెనుక దోపిడీ రాజ్యాన్ని నడిపిస్తున్నాడ‌ని టీజేఆర్ సుధాక‌ర్ బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Back to Top