జగన్‌గారిని తిట్టడమేనా మంత్రుల పని?

అందుకేనా ఆ మహిళా మంత్రులకు పదవి?

సూటిగా ప్రశ్నించిన మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి

 పార్వతీపురంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ సభ్యురాలు, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి.

మావిగన్‌ నుంచి డైవర్షన్‌ కోసం నిందలు, విమర్శలు

అదే పనిగా మళ్లీ మళ్లీ అవే అబద్ధాలు. దుష్ప్రచారం

వైయ‌స్ఆర్‌సీపీ గొడ్డలి పార్టీ అయితే మీది కత్తుల పార్టీనా?

జగన్‌గారిపై ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోం

మహిళా మంత్రులకు పాముల పుష్పశ్రీవాణి హెచ్చరిక

పార్వతీపురం: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారిని తిట్టడానికే మంత్రి పదవులు ఇచ్చారా అంటూ మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మహిళా మంత్రులు సంధ్యారాణి, సవితలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత రెండు రోజులుగా ఇద్దరు మహిళా మంత్రులు జగన్‌పై అవాకులు, చవాకులు పేలుతూ పిచ్చి విమర్శలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకే పరిమితం కావడం దురదృష్టకరమని పార్వతీపురంలో మీడియాతో మాట్లాడిన పుష్పశ్రీవాణి ఆక్షేపించారు. 
ప్రెస్‌మీట్‌లో పుష్పశ్రీవాణి ఇంకా ఏమన్నారంటే..:
     
ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వ్యక్తిత్వ హననమా?:
    రాజధానిగా మావిగన్‌ను జగన్‌గారు సూచిస్తే, దాన్ని తప్పు బట్టలేక, ఆయనకు సమాధానం చెప్పలేక, డైవర్షన్‌ కోసం గత నాలుగైదు రోజుల నుంచి వరసగా మంత్రులు మీడియాతో మాట్లాడుతూ, పిచ్చి విమర్శలు చేస్తున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో జరుగుతున్న దోపిడీపై జగన్‌గారు ప్రశ్నిస్తే, సమాధానం చెప్పకుండా ఆయన వ్యక్తిత్వ హననం కోసం ప్రయత్నిస్తున్నారు. మంత్రులు మీడియా ముందు గట్టిగా మాట్లాడితే నిజాలు అబద్ధాలు కావు.. అబద్ధాలు నిజాలు కావు.

జగన్ గారిని నిందిచడమే మీ పనా?:
    అమ్మా మంత్రి సంధ్యారాణి గారు ‘మావిగన్‌’ అంటే ఏమిటో ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైంది. మీ పార్టీ వాళ్లకే అర్థం కాలేదేమో. ఎందుకంటే మంచి విషయాలు మీకు ఎక్కవు. మీ దృష్టి ఎప్పుడూ దోపిడీపైనే ఉంటుంది, ప్రజల సంక్షేమంపై కాదు. ఏ వేదిక అయినా, ఏ సందర్భం అయినాం జగన్‌గారిని నిందించడం మీ పని అయిపోయింది. పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేశారు. మీరు మంత్రి అన్న విషయం కూడా మర్చిపోయి, ఒక పార్టీ కార్యకర్తలా దిగజారిపోయి వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. మీ చరిత్ర ఏమిటి? మీ కుటుంబం, మీ పీఏ వ్యవహారం ఏమిటి? ఒక మహిళను వేధించిన ఘటనలో చర్యలు తీసుకోకుండా, ఫిర్యాదు చేసిన మహిళపైనే కేసులు పెట్టించి వేధించడం మీ పాలనలో జరిగింది. మీరు ఒక మహిళ అన్న విషయం కూడా మర్చిపోయారు.

తల్లి, చెల్లి, గొడ్డలి ఆరోపణలు కొత్తవి కావు:
    ప్రతిపక్షం ప్రశ్నిస్తే.. మొదట ఎల్లోమీడియాలో కథనాలు వేస్తారు. తర్వాత పోలీసులు విచారణ పేరుతో వస్తారు. వెంటనే అదే స్క్రిప్ట్‌ పట్టుకుని మంత్రులు మీడియా ముందు చదవడం మొదలుపెడతారు. ఇదంతా ప్రజలను తప్పు దారి పట్టించేందుకు చేసే డైవర్షన్‌ పాలిటిక్స్‌.  తల్లి, చెల్లి, గొడ్డలి ఆరోపణలు కొత్తవి కావు. జగన్‌గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇవే ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు, తరువాత కూడా అదే మాటలు. పాత ఆరోపణలకు కొత్త డ్రెస్‌ వేసి ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. మీరు ఎన్ని అవాకులు, చవాకులు పేలినాం ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినాం ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారా?. 

చంద్రబాబు తన చెల్లెళ్లకు ఎంత ఆస్తి ఇచ్చారు?:
    జగన్‌గారు తన చెల్లికి ఇచ్చినంత ఆస్తి ఈ రాష్ట్రంలో ఏ సోదరుడు ఇచ్చాడో ఒక కేస్‌ స్టడీ చూపగలరా? మీ వద్ద ఏదైనా ఆధారం ఉంటే చెప్పండి. చంద్రబాబు గారికి కూడా చెల్లెళ్లు ఉన్నారు కదా? వాళ్లకు ఎంత ఆస్తి ఇచ్చారు? హెరిటేజ్‌లో ఎంత వాటా ఇచ్చారు? చెప్పగలరా? మేము సభ్యత, సంస్కారం పక్కన పెడితేం మీకన్నా ఎక్కువగా మాట్లాడగలం. మాకు కూడా పెద్ద నోర్లు ఉన్నాయి. కానీ మేము ఆ స్థాయికి దిగజారము. 

 గొడ్డలి పార్టీ అంటూ మాట్లాడుతున్నారు:
     వివేకానందరెడ్డిని జగనే చంపించారు, గొడ్డలితో నరికించారు, మీ పార్టీ గొడ్డలి పార్టీ అంటూ మాట్లాడుతున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్‌గారికి ఎలాంటి సంబంధం లేదని దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం, సీబీఐ స్పష్టం చేశాయి. అత్యున్నత న్యాయస్థానం చెప్పినా కూడా మీరు పట్టించుకోవడం లేదు. వివేకా హత్య జరిగినది మీ ప్రభుత్వంలో కాదా? మా ప్రభుత్వంలో దర్యాప్తు ముందుకు వెళ్లింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా జగన్‌కు సంబంధం లేదని చెబుతున్నా, మీరు మాత్రం అదే పాత అబద్ధపు స్క్రిప్ట్‌ను పట్టుకొని ప్రజల ముందుకు వస్తున్నారు. వివేకా హత్య కేసులో నిందితుడు దస్తగిరి లాయర్‌ సిద్ధార్థ లూద్రా. లూద్రా అంటే గుర్తుకు వచ్చేది ఎవరు? చంద్రబాబు గారే కదా? ఇదే దస్తగిరిని మీ ఎల్లోమీడియా కూర్చోబెట్టి డిబెట్లు పెట్టింది నిజం కాదా? 

మీకు నిజాలతో పని లేదా?:
    కడపలో పెద్ద దస్తగిరి హత్య జరిగితే దాన్ని కూడా వైయస్‌ జగన్‌ గారికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా మంత్రులు సవిత, సంధ్యారాణిలు వైయస్‌ఆర్‌సీపీ నాయకులే ఈ హత్య చేశారు అని ఆరోపిస్తున్నారు. జగన్‌గారు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నిస్తున్నారు. మీది హత్యలు చేసే పార్టీ అని మాట్లాడుతున్నారు. కానీ ఇదే పెద్ద దస్తగిరి భార్య మీడియా ముందుకు వచ్చి మా ఆయన హత్యకు వైయస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పలేదా? మీరు చేసిన ఆరోపణలకు ఆమె మాటలే సమాధానం కాదా? మీకు నిజాలతో పనిలేదా? వాస్తవాలను పక్కన పెట్టి బురద జల్లడమే మీరు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఏదైనా చెప్పడానికి సిద్ధపడుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఆక్షేపించారు.

Back to Top