ఇప్పటికే పూర్తయిన పనులకు తిరిగి టెండర్లా?

ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై పెనమలూరు ఇంచార్జ్ దేవభక్తి చక్రవర్తి ఆగ్ర‌హం
 

కృష్ణా జిల్లా: పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ‌ ఇంచార్జ్ దేవభక్తి చక్రవర్తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాడిగడప మున్సిపాలిటీలో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. శుక్ర‌వారం మీడియాతో మాట్లాడుతూ చక్రవర్తి పలు కీలక ఆరోపణలు చేశారు. ఇప్పటికే పూర్తయిన పనులకు తిరిగి టెండర్లు పిలుస్తున్నారని, గతంలో రెండు టెండర్ల పేరుతో రూ.72 లక్షలు దోచుకున్నారని ఆరోపించారు. తాజాగా పూర్తయిన మరో మూడు పనులకు కూడా టెండర్లు పిలిచి సుమారు రూ.1.30 కోట్లు ప్రజాధనం కాజేస్తున్నారని అన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సిద్ధమా అని సవాల్ విసిరారు. గ్రామస్తుల సమక్షంలో, మీడియా ముందే అన్ని విషయాలు తేటతెల్లం చేస్తామని స్పష్టం చేశారు. ఈ దోపిడీకి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఇటీవల వచ్చిన మొంథా తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పటికీ వారికి నష్టపరిహారం అందలేదని విమర్శించారు. వెంటనే రైతులకు పరిహారం చెల్లించడంతో పాటు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న, పసుపు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. లేనిపక్షంలో రైతుల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన చోరీ ఘటనపై ఇప్పటివరకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ విషయంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 

Back to Top