తాడేపల్లి : రైతాంగ సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురామ్, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. రైతు విభాగం పార్టీకి మూలస్తంభం రైతు విభాగం పార్టీకి అత్యంత కీలకమని, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. రైతాంగ సమస్యలపై నిరంతరం చర్చలు జరిపి, అవసరమైతే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి ముందుకు వెళ్లాలని అన్నారు. రాష్ట్రంలో మొక్కజొన్నతో పాటు అన్ని పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం సమయంలో రైతులకు బలమైన అండ లభించిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రైతుల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టులు పూర్తి చేయడంపై ఒత్తిడి తేవాలి : ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పోలవరం నుంచి రాయలసీమ వరకు అనేక ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదని, వాటిని పూర్తి చేయించేందుకు పోరాడాల్సిన అవసరం ఉందని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం పార్టీ లక్ష్యమని తెలిపారు. రైతాంగం సంక్షోభంలో ఉంది: రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. శనగ, మొక్కజొన్న, పొగాకు, వరి వంటి పంటలకు సరైన ధరలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డెల్టా ప్రాంతాల్లో కాలువల నిర్వహణ, ధాన్యం సేకరణలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. జగన్ రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉన్నారని, రైతాంగ సమస్యలపై ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వం మెడలు వంచించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.