ఏలూరు: వేసవికాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించే మంచినీటి చలివేంద్రాన్ని తొలగించడంపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాశ్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ చలివేంద్రాన్ని 45వ డివిజన్ ఆదివారపు పేటలో స్థానిక నాయకుడు పసుపులేటి దినేష్ ఏర్పాటు చేశారు. అయితే, ఈ చలివేంద్రాన్ని కక్షపూరితంగా తెల్లవారుజామున తొలగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చర్యను ఖండిస్తూ వైయస్ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు గుడిడేసి శ్రీనివాసు ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వేసవిలో ప్రజలకు తాగునీరు, మజ్జిగ, శీతలపానీయాలు అందించే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సామాజిక బాధ్యత అని, అలాంటి సేవా కార్యక్రమాలను అడ్డుకోవడం దారుణమని విమర్శించారు. స్థానిక ప్రజలు కూడా ఈ ఘటనను ఖండిస్తూ, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.