చంద్రబాబు పాల‌న‌లో పెట్రోల్ ధరల మంట..!

 జి.మాడుగులలో నిరసన చేపట్టిన పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు 

అల్లూరి జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పాడేరు ఎమ్మెల్యే, అల్లూరి జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వర రాజు గారి ఆధ్వర్యంలో జి.మాడుగుల మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మత్స్యరాస విశ్వేశ్వర రాజు గారు.. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. 
పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెంచి రైతులు, వాహనదారులు, సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాజా పెంపుతో లీటర్ పెట్రోల్ ధర రూ.113.62, డీజిల్ ధర రూ.101.24కి చేరిందని, దేశంలోనే అత్యధిక ఇంధన ధరలు ఏపీలో ఉండటం కూటమి ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. 

గత వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను రద్దు చేయడమే కాకుండా ఇప్పుడు “దంచుడే దంచుడు” విధానంతో ప్రజలపై భారాలు మోపుతున్నారని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై ఇప్పుడు చంద్రబాబు, నారా లోకేష్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని, ప్రజలంతా ఈ మోసాలను గమనించి రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నుర్మని మత్యకొండం నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి కుడా సురేష్ కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుబ్బడి శేఖర్, మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకట గంగరాజు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సిర్మ పండన్న, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వివిధ విభాగాల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 

Back to Top