రాజమహేంద్రవరంలో వైయ‌స్ఆర్‌సీపీ వినూత్న నిరసన

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి: మార్గాని భరత్ రామ్

 రాజమహేంద్రవరం: రాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్ వద్ద వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీ, వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ పాల్గొన్న ఈ నిరసనలో ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్పొరేటర్, రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర రావు సారథ్యంలో గోదావరి రైల్వే స్టేషన్ నుంచి సబ్ కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా తరలివెళ్లిన పార్టీ శ్రేణులు అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు దారుణంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే, పక్క రాష్ట్రం తమిళనాడుతో పోలిస్తే కూడా ఆంధ్రప్రదేశ్‌లో లీటరుకు రూ.5 నుంచి రూ.6 వరకు అధికంగా ధరలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోవడం ఆయన అసమర్థతకు నిదర్శనమన్నారు.

ప్రజలకు ఇంధనం పొదుపు చేయాలని చెప్పే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాత్రం ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. చంద్రబాబు పాలన అంటే మోసాలు, అబద్ధాలేనని, ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. పెంచిన ఇంధన ధరలు తగ్గించే వరకు వైయ‌స్ఆర్‌సీపీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిళారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ “బాదుడే బాదుడు” తప్ప ప్రజలకు ఉపశమనం ఉండదన్నారు. పెరిగిన ధరలతో సామాన్యుడి జీవితం కుదేలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

వాసంశెట్టి గంగాధర రావు మాట్లాడుతూ.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో పడుతుందని, దాని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడుతోందన్నారు. ఇప్పటికే ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరింత భారం మోపడం అన్యాయమన్నారు.

ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ, జిల్లా మహిళాధ్యక్షురాలు మార్తి లక్ష్మి, నాయకులు మార్గాని సురేష్, మజ్జి అప్పారావు, సప్పా ఆదినారాయణ, కాటం రజనీకాంత్, రొక్కం త్రినాథ్, హసీనా, షేక్ నిజామ్, బూడిద శరత్‌కుమార్, అమీర్ పాషా తదితరులు పాల్గొన్నారు. అనంతరం సబ్ కలెక్టరేట్ అధికారులకు వినతి పత్రం అందజేశారు.
 

Back to Top