మంగళగిరిలో వైయ‌స్ఆర్‌సీపీ భారీ నిరసన

రాష్ట్రవ్యాప్తంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఆప్కో చైర్మన్ చల్లపల్లి మోహన్‌రావు, నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మదన్‌మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ సెంటర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ.. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని ఆరోపించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ధరలు తగ్గించకపోగా మరింత పెంచారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ధరలు పెంచినా, రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న అదనపు పన్నులతో ప్రజలపై మరింత భారం పడుతోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం కేవలం వాహనదారులపైనే కాకుండా రవాణా రంగం, పరిశ్రమలు, వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడుతోందని తెలిపారు. ముఖ్యంగా రైతులకు రవాణా ఖర్చులు పెరిగి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.

ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి పేద, మధ్యతరగతి, బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను ప్రతి విషయంలో మోసం చేస్తోందని ఆరోపించారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవనం కష్టంగా మారిందన్నారు. విద్యుత్ ఛార్జీలు, నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని విమర్శించారు. ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలను సాకుగా చూపి లీటర్‌కు మూడు రూపాయలు పెంచడం సామాన్య ప్రజలపై భారమని అన్నారు. అధికారంలోకి రాకముందు చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరూ ధరలు పెంచబోమని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ హామీలను పూర్తిగా మరిచిపోయారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు కాలేదని, వృద్ధాప్య పింఛన్లలో లక్షల సంఖ్యలో కోతలు పెట్టారని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top