తాడేపల్లి: రాష్ట్రంలో జూన్ 15 నుంచి సెప్టెంబర్ వరకు జరిగే ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్ల పాత్ర కీలకమని, పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు నిరంతరం పర్యవేక్షణ చేయాలని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియపై వైయస్ఆర్‌సీపీ నియమించిన పార్లమెంటరీ పరిశీలకులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ.. జూన్ 15 నుంచి జులై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి, జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారని తెలిపారు. అనంతరం అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన పూర్తి చేసి సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల అవుతుందని వివరించారు. సెప్టెంబర్ వరకు కొనసాగే ఈ ప్రక్రియ అత్యంత కీలకమని, పార్టీ తరఫున నియమించిన కమిటీలు పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. ప్రతి దశలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారని, బీఎల్‌వోలు – బీఎల్ఏల మధ్య సమన్వయం సమర్థవంతంగా ఉండాలని తెలిపారు. బీఎల్ఏలకు ముందుగానే శిక్షణ, ఓరియెంటేషన్ ఇవ్వాలని సూచించారు. వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. డ్రాఫ్ట్ స్థాయిలోనే జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు వచ్చేలోగానే బీఎల్ఏలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, ఓటర్లకు అవసరమైన ఆధార పత్రాలపై ముందుగానే అవగాహన కల్పించాలని సూచించారు. ఒకసారి ఓటు తొలగిస్తే తిరిగి చేర్చడం కష్టమవుతుందని, ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారం తప్పనిసరిగా సమర్పించాలన్నారు. సెప్టెంబర్ వరకు జరిగే ఈ ప్రక్రియలో పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. సమర్థంగా పనిచేసే బీఎల్ఏలకు భవిష్యత్తులో పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని తెలిపారు. జూన్ 15న ఎస్‌ఐఆర్ ప్రారంభానికి ముందుగా మరోసారి సమావేశం నిర్వహించి కార్యాచరణపై సమగ్ర చర్చ చేపడతామని సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెల్లడించారు.