కూటమి ‘మరో మోసం’.. 

సింగనమలలో పెట్రో ధరల పెంపుపై వైయ‌స్ఆర్‌సీపీ భారీ నిరసన
 

 

వైయ‌స్ఆర్ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సింగనమల మండల కేంద్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వైయ‌స్ఆర్‌సీపీ నేతలు భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ గారి సూచనలతో చేపట్టిన ఈ నిరసన ర్యాలీ వైయస్సార్ విగ్రహం వద్ద ప్రారంభమై తహశీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్న నిరసన తెలిపారు. “పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి”, “ప్రజలపై బాదుడు ఆపాలి” అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. నాయకులు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీలు ఇచ్చిన చంద్రబాబు, నారా లోకేష్ ఇప్పుడు ఆ మాటలను పూర్తిగా మరిచిపోయారని విమర్శించారు. “బాదుడే బాదుడు” అంటూ గత ప్రభుత్వాన్ని విమర్శించినవారే ఇప్పుడు ప్రజల నడ్డి విరిచే విధంగా పెట్రో ధరలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని, దీనికి కారణం అధిక వ్యాట్, అదనపు పన్నులేనని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఆ పన్నులు తగ్గిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి, ఇప్పుడు వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ఆరోపించారు. ఇంధన ధరల పెరుగుదలతో రైతులు, ఆటో డ్రైవర్లు, కార్మికులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు రద్దు చేసి, మరోవైపు పెట్రో ధరల మంటతో ప్రజలపై అదనపు భారాలు మోపుతున్నారని విమర్శించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్న నాయకులు, పెట్రోల్ మరియు డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ఎల్‌.ఎం. మోహన్ రెడ్డి, నాయకులు శ్రీరామ రెడ్డి, వంశీ గోకుల రెడ్డి, కొర్రపాడు గువ్వల శ్రీకాంత్ రెడ్డి, వీరాంజనేయులు, నూరు మహమ్మద్, పార్టీ మండల అధ్యక్షులు ఎల్లారెడ్డి, చెన్నంపల్లి గువ్వల శ్రీకాంత్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, నరసింహారెడ్డి, ఆంజనేయులు, పార్వతి, శ్రీనివాసరెడ్డి, భాస్కర్ రెడ్డి, బండి శీన, ఎన్వీ రమణ, శివమ్మ, రామకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top