కూటమి అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర  

మంత్రులపై మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఫైర్‌

పార్వతీపురం మన్యం జిల్లా: కూటమి ప్రభుత్వ అవినీతి అక్ర‌మాల‌పై ప్ర‌శ్నిస్తే వాటికి స‌మాధానం చెప్పుకోలేక డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కు తెర తీస్తున్నార‌ని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప‌శ్రీ‌వాణి మండిప‌డ్డారు. మంత్రులు సంధ్యారాణి, సవిత వైయ‌స్ జ‌గ‌న్‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌ను తీవ్రంగా ఖండించారు. మంత్రులు స‌భ్య‌త‌, సంస్కారం మ‌ర‌చి మాట్లాడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. శుక్ర‌వారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలకు తెర తీస్తోందని విమ‌ర్శించారు. అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీ, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడం వంటి అంశాలపై ప్రశ్నిస్తే, వాటికి సమాధానం చెప్పకుండా వైయ‌స్ జ‌గ‌న్‌పై వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డుతున్నార‌ని ఫైర్ అయ్యారు. మంత్రులు మీడియా ముందు గట్టిగా మాట్లాడితే అబద్ధాలు నిజాలు కావు.. నిజాలు అబద్ధాలు కావు” అని వ్యాఖ్యానించారు. వైయ‌స్ జగన్‌పై చేస్తున్న ఆరోపణలన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కోసమేనని అన్నారు. తాము హామీలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత వ్యాఖ్యలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు.

వివేకానంద రెడ్డి హత్య కేసులో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు, సీబీఐ పేర్కొన్నాయని తెలిపారు. మంత్రి సవిత..మీ జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్లలో కుంభకోణాలు, హనీ ట్రాప్ ఘటనలు జరగలేదా? అని ప్రశ్నించారు. పదవులు కాపాడుకోవడానికే మంత్రులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.  మీరు మా పార్టీపై విమర్శలు చేస్తే మేమూ అదే స్థాయిలో స్పందించగలమ‌ని స్పష్టం చేశారు.

మంత్రి సంధ్యారాణి నియోజకవర్గంలో గిరిజన ఉద్యోగులను తొలగించడం, కేజీబీవీ సిబ్బందిని చిన్న కారణాలతో ఉద్యోగాల నుంచి తీసివేయడం రాజకీయ కక్షసాధింపే అని ఆరోపించారు. కురుపాం నియోజకవర్గంలో క్రమశిక్షణా చర్యల్లో ద్వంద్వ వైఖరి పాటిస్తున్నారని విమర్శించారు.  ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో శిక్షణ పేరుతో రూ.10 కోట్ల అవినీతి జరిగిందని, “ఐ విల్ లెర్నింగ్ సొల్యూషన్స్” కంపెనీ తరగతులు నిర్వహించకపోయినా నిధులు వినియోగించారని ఆరోపించారు. గిరిజన విద్యార్థుల మరణాలపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.  ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశాలు కూడా నిర్వహించలేని పరిస్థితి ఉందని, ప్రజా సమస్యలను పట్టించుకోని కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని పుష్ప‌శ్రీ‌వాణి హెచ్చరించారు. 

Back to Top