వైయస్ఆర్ జిల్లా : కడపలో అల్మాస్‌పేటలో జరిగిన ఘటన దురదృష్టకరమని, ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కడప పార్లమెంట్ సభ్యుడు వైయస్ అవినాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన కడపలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్‌ను ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి కలిసి ఇటీవల జరిగిన ఘటనపై చర్చించారు. ఆయనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాషా, జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి, సీఈసీ సభ్యులు కే. సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా కడప నగరంలో మత సామరస్య వాతావరణం కొనసాగుతోందని, ఇకపై కూడా అదే పరిస్థితి కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ నెల 9న జరిగిన ఘటనలో కొంతమంది సంబంధంలేని వారిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. నాలుగు రోడ్ల కూడలి కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడ గుమికూడారని, అందులో అమాయకులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. పోలీసులు విచారణ జరిపి సంబంధం లేని వారిని విడుదల చేయాలని ఎస్పీని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. తమ వినతిని జిల్లా ఎస్పీ సానుకూలంగా స్వీకరించారని, తప్పు చేసిన వారిపైనే చర్యలు ఉంటాయని, మిగతా వారిపై ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఎస్పీ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో ఇతర శక్తుల ప్రమేయంపై మాట్లాడటం సరికాదని, ఇది సున్నితమైన అంశం కావడంతో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వైయస్ఆర్‌సీపీ నేతలు సూచించారు.