అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

 పి. గన్నవరం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు డిమాండ్‌

అమలాపురం : డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం తోత్తరమూడి గ్రామ శివారులో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని  పి. గన్నవరం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ కోఆర్డినేటర్ శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించిన రైతు పరామర్శ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షులు శ్రీ జిన్నూరి రామారావు (బాబి) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా కె. పెదలంక గ్రామానికి చెందిన మొక్కజొన్న, వరి రైతుల పంటలు కోత దశలో తడిసి ముద్ద కావడంతో తీవ్ర నష్టాలు చవిచూశారని నాయకులు పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి తడిసిన ధాన్యం, మొక్కజొన్నను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు సకాలంలో పరిహారం, రుణ సదుపాయాలు అందించడమే కాకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న అరటి తోటలను కూడా పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మేడిశెట్టి శ్రీనివాసు బాబు, యన్నాబత్తుల ఆనంద్, రైతులు గుత్తల బాబురావు, రేవు దుర్గ ప్రసాద్, కొండపల్లి కొండ, కొండపల్లి సత్తిబాబు, పురంశెట్టి సత్యనారాయణ, బొక్క సత్యనారాయణ, సలాది చంటి తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Back to Top