అమరావతి అంటే 'ఆర్గనైజ్డ్ కరప్షన్'.

- ఏడాదిలో బాబు ప్యాలెస్ పూర్తి - ఏళ్లయినా రాజధాని అసంపూర్తి 
: చంద్రబాబు తీరుపై తీవ్రంగా మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) 

తాడేపల్లి లోని వైయస్ఆర్ సీపీ  కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కృష్ణా జిల్లా అధ్యక్షుడు,  మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని).

- అమరావతి పేరుతో ఏపీ భవిష్యత్తును తాకట్టు పెట్టొద్దు
- బాబు బినామీలకు 'ప్రైమ్ ప్లాట్లు'..
- సామాన్య రైతులకు ప్లాట్లు రాక పాట్లు 
- ఏడాదిలో బాబు ప్యాలెస్ పూర్తి -
- ఏళ్లయినా రాజధాని అసంపూర్తి.
- అమరావతిలో అద్దాల పేరుతో రూ. 2500 కోట్ల భారీ దోపిడీ.
: తేల్చి చెప్పిన మాజీ మంత్రి పేర్ని నాని

- అమరావతి అభివృద్ధి కంటే దోపిడీకే వేదికైంది. 
- రెండో దశ ల్యాండ్ పూలింగ్‌కు వైయస్సార్సీపీ వ్యతిరేకం
- రైతుల తరపున పోరాటం చేస్తాం
: ప్రభుత్వాన్ని హెచ్చరించిన మాజీ మంత్రి పేర్ని నాని.

తాడేపల్లి: అమరావతి పేరుతో ఆంధ్రరాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ, ప్రజల భవిష్యత్తును కూటమి ప్రభుత్వం తాకట్టు పెడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో సామాన్య రైతులకు ఒక నీతి, బాబు బినామీలకు మరో నీతి అమలు చేస్తూ 'వ్యవస్థీకృత వివక్ష'కు తెరలేపారని ఆయన మండిపడ్డారు. కోర్ కేపిటల్ పరిధిలో లక్షన్నర చదరపు అడుగుల వైశాల్యంతో చంద్రబాబు తన ప్యాలెస్‌ను ఏడాదిలోనే పూర్తి చేసుకుంటున్నారని, కానీ రాజధాని నిర్మాణాలను మాత్రం అద్దాల పేరుతో దోపిడీ చేస్తూ గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు. అభివృద్ధికి ఆకర్షణీయమైన 'మావిగన్' ప్రతిపాదనను పక్కనపెట్టి, కేవలం క్విడ్ ప్రో కో కోసమే అమరావతి తంతు నడుపుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...

- అమరావతి కన్నా 'మావిగన్' మిన్న:

రూ.7500 లకే గజం చంద్రబాబు కొంటూ... ప్రభుత్వం దగ్గర  5 వేల ఎకరాలున్నాయి. అవి అమ్మి అమరావతి కోసం చేసిన అప్పు తీరుస్తామని చెబుతున్నాడు. గజం రూ.7500 చొప్పున అమ్మితే రూ.20వేల కోట్లు కూడా రావడం లేదు. కానీ అమరావతి పేరు మీద ఇప్పటికే రూ.50వేల కోట్లు అప్పు చేశారు. మరోవైపు 8 నుంచి 10 శాతం వరకు వడ్డీకి అప్పు తెస్తున్నారు. ఇవి ఎప్పటికి చెల్లిస్తారు? ఇంతవరకు తొలివిడత భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఎందుకు ఇవ్వడం లేదు? మీరు మాత్రం కోర్ కేపిటల్ లో 5.17 ఎకరాల్లో ఇళ్లు కట్టుకుంటారా చంద్రబాబూ?
రాజధాని నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో చంద్రబాబుకే అంతుచిక్కని విషయంగా మారింది. ఐదు కోట్ల మందిని నాశనం చేసే బదులు.. మచిలీపట్నం పోర్టును కలుపుతూ విజయవాడ, గుంటూరు ప్రాంతాలను 'మావిగన్' (MAVIGAN) పేరుతో సెల్ఫ్ గ్రోత్ ఇంజన్‌గా అభివృద్ధి చేయాలని వైయస్.జగన్  చెప్పిన ప్రతిపాదనపై ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదు. 

- సీఆర్‌డీఏ - సామాన్యులకు ఒక నీతి, బాబుకు ఒక నీతి:

సీఆర్‌డీఏ నిబంధనలు సామాన్య రైతులకు సంకెళ్లుగా మారాయి. రైతులు తమ ప్లాట్లను వారసులకు పంచుకోవడానికి కూడా వీల్లేకుండా నిబంధనలు రాసిన చంద్రబాబు, తన బినామీలకు మాత్రం అన్ని రూల్స్ పక్కనపెట్టి మేలు చేస్తున్న అమరావతి పేరుతో ఏ స్ధాయిలో చంద్రాబాబు దోచుకుంటున్నారో చెప్పడానికి ఆయన ఇళ్లు కడుతున్న ప్లాట్ ఒక్కటి చాలు. ఆయన ఈ- 6 రోడ్డులో ఇళ్లు కడుతున్నారు. కొత్త సచివాలయం ఎదురుగా, హైకోర్టుకు ముందు, అసెంబ్లీకి పక్కన కొంతమంది రైతులు 30 ఎకరాలు ఒకేచోట ఇచ్చారు. దానికి బదులుగా 5 ఎకరాల పైగా ఒకటే ప్లాట్ 2024లో ఆ రైతులకు ఇచ్చారు. అప్పటివరకు ఈ రైతులకు ఎందుకు ప్లాట్ ఇవ్వలేదు. 2024లో చంద్రబాబు రెండోసారి సీఎం అయిన తర్వాత మాత్రమే ఎందుకు ఇచ్చారు? 2024లో ఆ రైతులకు ప్లాట్లు కేటాయిస్తారు, 2025లో ఆ ప్లాటు చంద్రబాబు నాయుడు కొనుక్కుంటారు. అంటే చంద్రబాబు నాయుడు మనుషులను మాట్లాడుకున్న తర్వాతే ఆ ప్లాటు కొనుక్కుంటారు. ఆ పక్కనే మంత్రి నారాయణ తీసుకున్నాడు. వైయస్.జగన్ ఎకరంలో ఇళ్లు కట్టుకుంటే తాడేపల్లి ప్యాలెస్ అని పచ్చచొక్కా వేసుకున్న ప్రతి ఒక్కడూ మాట్లాడుతాడు. 4840 గజాల్లో ఇళ్లు, ఆఫీసు చుట్టూ మొక్కలతో కట్టుకుంటే దాన్ని ప్యాలెస్ అంటే... ఏకంగా ఐదు ఎకరాల్లో ఇళ్లు కట్టుకుంటున్న చంద్రబాబును ఏమనాలి?  కోర్ కేపిటల్ ప్రాంతంలో (E-6 రోడ్డు) 5.17 ఎకరాల్లో చంద్రబాబు తన ఇల్లు, ఆఫీసు కట్టుకుంటున్నారు. లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో ఈ 'ప్యాలెస్' నిర్మాణం సాగుతోంది. ఇందులో క్విడ్ ప్రో కో దాగి ఉంది. నక్కపల్లిలో రూ. 600 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ పొందిన అట్లూరు శ్రీనివాసే చంద్రబాబు ఇల్లు కడుతున్నారు. ఇది క్విడ్ ప్రో కో కాదా? ఏడాదిలోనే బాబు ఇంటి సివిల్ పనులు పూర్తయ్యాయి కానీ, రాజధాని భవనాలు మాత్రం అతీగతీ లేవు. 

- బినామీలకు 'ప్రైమ్ ప్లాట్లు' - రైతులకు అన్యాయం:

అమరావతిలో భూములిచ్చిన సామాన్య రైతులకు వెస్ట్ బైపాస్ పక్కన ప్లాట్లు ఇస్తే, చంద్రబాబు అనుచరులకు మాత్రం సచివాలయానికి, హైకోర్టుకు సమీపంలో భూములు కేటాయించారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబం నీరుకొండలో ఇచ్చిన 5.39 ఎకరాలకు బదులుగా అద్భుతమైన ప్రైమ్ లోకేషన్లలో ప్లాట్లు ఇచ్చారు. బెజవాడ రమేష్ అనే వ్యక్తికి నాలుగు రోడ్ల జంక్షన్ లో కమర్షియల్ ప్లాట్, ఇంటి స్థలం బిట్స్ పిలానీని ఆనుకుని 13500 గజాలు, మరో చోట 4500 గజాలు కొత్త సచివాలయం దగ్గర, సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఆనుకుని మరో 5900 గజాలు వస్తుంది. సచివాలయం పక్కన మరో 4800 గజాలు కేటాయించారు. తుళ్లూరు మండలానికి చెందిన టీడీపీ సుబ్బారావు 9.59 ఎకరాలు భూమి ఇస్తే...ఎన్ -10 రోడ్డులో 24,500 గజాలు, పక్కనే మరో 11820 గజాలు, చంద్రబాబు ఇళ్లు కనిపించేలా మరో 2520 గజాలు, హైకోర్టు దగ్గరలో మరో 8800 గజాలు కేటాయించారు. కేవలం చంద్రబాబుకి, ఆయన బినామీలకు, అనుచరులకు తప్ప మరెవ్వరికీ ప్లాట్లు లేవు. రైతులకు మాత్రం ప్లాట్లు ఇవ్వడం లేదు. అడిగితే సమాధానం చెప్పేవారు లేరు. మీరు సమాధానం చెప్పమని పంపించిన కేంద్రమంత్రి అడిగితే రైతులను గెటవుట్ అంటున్నాడు. అమరావతి రైతుల కర్మ అలా ఏడ్చింది.  మరోవైపు చంద్రబాబు తన ఇంటి పక్కన రైతులు ఎవరూ ఉండకూడదని 3800 గజాల నివాస స్థలాన్ని రాత్రికి రాత్రే 'గ్రీన్ బెల్ట్'గా మార్చేశారు. 

- అప్పుల కుప్పగా అమరావతి:

రాజధాని పేరుతో ఇప్పటికే రూ. 50 వేల కోట్లు అప్పు చేశారని,8 నుంచి 10 శాతం వడ్డీకి నిధులు తెస్తున్నారు. కేవలం అద్దాల కోసమే రూ. 2,500 కోట్లు ఖర్చు చేయడం ఏ రకమైన అభివృద్ధి అవుతుంది. అమరావతిని రాష్ట్రానికి ఒక గుదిబండగా తయారు చేస్తున్నారు. 

- రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు వ్యతిరేకం:

అమరావతిలో రెండో దశ భూసేకరణను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. భూములివ్వని రైతుల భూములను 'నిషేధిత జాబితా'లో చేర్చడం దారుణం. రైతులు భయపడాల్సిన పనిలేదు. వైయస్ జగన్ గారు మళ్లీ అధికారంలోకి రాగానే ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారు. 

- కేంద్ర మంత్రి తీరుపై ఆగ్రహం:

ప్రజల సమస్యలు వినాల్సిన కేంద్ర మంత్రి పెమ్మసాని.. రైతులను 'గెటవుట్' అని అవమానించడం సిగ్గుచేటు. వందల కోట్లు ఖర్చు పెట్టి మంత్రి పదవి తెచ్చుకున్నంత మాత్రాన రైతులను అవమానించే హక్కు ఎవరికీ లేదని గుర్తుపెట్టుకోవాలి. 

ఈ నేపథ్యంలో బాబు బినామీలకు మేలు చేసే ఒక 'రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్'గా మారిన అమరావతి.. రాష్ట్రానికి ఆస్తుల కంటే అప్పులనే మిగులుస్తుందని పేర్ని నాని హెచ్చరించారు. తన సొంత ప్యాలెస్‌ను లక్షన్నర అడుగుల్లో ఏడాదిలోపే పూర్తి చేసుకున్న చంద్రబాబు.. ప్రజల రాజధానిని మాత్రం అద్దాల పేరుతో దోపిడీ చేస్తూ గాలికి వదిలేశారని విమర్శించారు. రైతుల కళ్లల్లో నీరు రాష్ట్రానికి అరిష్టమని, రెండో దశ ల్యాండ్ పూలింగ్ పేరుతో వారిని వేధిస్తే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వినాశకరమైన అమరావతి తంతు ఆపి, స్వయం సమృద్ధినిచ్చే 'మావిగన్' వంటి ఆచరణాత్మక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Back to Top