తాడేపల్లి: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన రైతులు వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి తమపై జరిగిన దాడి ఘటనను వివరించారు. మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తాము పంటను గోడౌన్‌లో నిల్వ చేసుకున్నామని, అయితే టీడీపీ గూండాలు రాడ్లతో గోడౌన్ తాళాలు పగులగొట్టి దాడికి పాల్పడ్డారని రైతులు తెలిపారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తమపై దౌర్జన్యానికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రోద్బలంతో సుమారు 500 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గూండాలు మామిళ్లపల్లిలో విధ్వంసానికి పాల్పడ్డారని రైతులు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను వైయస్ జగన్‌కు చూపించారు. గోడౌన్ యజమాని సోదా సముద్రయ్య, పొన్నూరు వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ అంబటి మురళీకృష్ణ కూడా ఈ సందర్భంగా ఘటన వివరాలను మాజీ సీఎంకు వివరించారు. మొక్కజొన్న రైతుల గోడౌన్‌పై దాడి దుర్మార్గం: వైయస్ జగన్ గిట్టుబాటు ధరలేక పంట నిల్వ చేసుకున్న రైతుల గోడౌన్‌పై దాడి చేయడం దుర్మార్గపు చర్య. పైగా బాధిత రైతులపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేయడం సమంజసం కాదు. ఈ విషయంలో అవసరమైన న్యాయ సహాయాన్ని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ అందిస్తుంది, బాధిత రైతు కుటుంబాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది` అని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. - వైయస్ జగన్‌ను కలిసిన అనంతరం వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బాధిత రైతులు, అంబటి మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ప్రోదల్భంతో కేసులు : అంబటి మురళీకృష్ణ ఇవాళ మావిళ్లపల్లి రైతులతో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ వైయస్ జగన్ గారిని కలిశాం. మొన్న మొదటి విడతగా టీడీపీ నాయకులు రైతు సోదా సముద్రయ్య రేకుల షెడ్డును పగులగొట్టడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రోద్బలంతో 14 మంది రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. వీరంతా కూడా నాకు బంధువులే. అందరూ కాపు సామాజికవర్గానికి చెందినవారు. టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక వైయస్ జగన్ గారిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. రైతులపై టీడీపీ నేతలు దాడి చేయడమే కాకుండా ఆటో నడిపే తాగుబోతు వ్యక్తితో ఫిర్యాదు చేయించి కాపు కులానికి చెందిన 14 మందిపై కేసు నమోదు చేయించారు. ఇందులో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ విషయాలన్నీ బాధితులు వైయస్ జగన్‌కు వివరించారు. ఈ కేసుపై న్యాయపోరాటం చేయాలని పార్టీ లీగల్ టీమ్‌ను ఆదేశించారు. అలాగే గ్రామాన్ని సందర్శించాలని పార్టీ సీనియర్ నాయకులకు వైయస్ జగన్ గారు సూచించారు. ఇది వైయస్ఆర్‌సీపీ కార్యక్రమం కాదు.. ఇది రైతుల కార్యక్రమం. కాపు జాతిపై జరుగుతున్న అన్యాయాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా చూసి కూడా ఊరుకున్నారు. ఈ కేసును వైయస్ఆర్‌సీపీ భుజస్కందాలపై వేసుకొని పోరాటం చేయాలని వైయస్ జగన్ గారు ఆదేశించారు. సీల్ వేసిన గోడౌన్‌లోని సరుకు రైతులకు తిరిగి ఇచ్చే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాడుతుంది. బాధిత రైతులకు వైయస్ జగన్ గారు మనోధైర్యం ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం” అని పొన్నూరు వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. నా భర్త హార్ట్ పేషేంట్ : అంబటి లక్ష్మీ మొక్కజొన్న ధాన్యానికి సరైన ధరలు లేక ఒక రేకుల షెడ్డులో దాచుకున్నాం. కానీ ఆ ధాన్యం అంబటి మురళీకృష్ణది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ ధాన్యం సోదా సముద్రయ్యది. వర్షంలో తడవకుండా ఉండేందుకు షెడ్డులో నిల్వ చేశాం. మాకు గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకుందామని దాచుకున్నాం. నా భర్త హార్ట్ పేషెంట్. మంచి ధర వస్తే ధాన్యం అమ్ముకుని ఆసుపత్రిలో చికిత్స చేయించుకుందామనుకున్నాం. కానీ మమ్మల్ని ఆడవాళ్లమని కూడా చూడకుండా నెట్టేసి, కొట్టి దారుణంగా వ్యవహరించారు. మా ధాన్యాన్ని లోపల వేసి సీజ్ చేశారు. ఇప్పుడు అది పాడై పురుగులు పడుతోంది. మా ధాన్యం మాకు ఇవ్వకపోతే మేం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంబటి మురళీకృష్ణకు దీనితో ఏం సంబంధం? ఆ ధాన్యం అంతా రైతులదే. ఎమ్మెల్యే నరేంద్ర ధాన్యం నిల్వ చేసుకోలేదా? మేం పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునే హక్కు కూడా లేదా? వారం రోజులుగా మేము అన్నం కూడా తినలేకపోతున్నాం. మా బాధ చెప్పుకోవడానికి ఇవాళ వైయస్ జగన్ గారి వద్దకు వచ్చాం. మాపై పెద్ద పెద్ద కేసులు పెట్టారు. అయితే జగన్ గారు మాకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మురళీకృష్ణ బంధువులమని మాపై కక్షసాధింపు చర్యలు: అంబటి పార్వతి మేం కాపులం. మేం పండించిన పంటను ఒక చిన్న షెడ్డులో దాచుకున్నాం. కానీ ఆ షెడ్డును అంబటి మురళీకృష్ణది అంటూ రాజకీయాలు చేస్తున్నారు. ఆయనకు బంధువులమనే కారణంతో మాపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. మమ్మల్ని రౌడీలతో కొట్టించారు. అరాచకం చేసి చివరకు మాపైనే కేసులు పెట్టించారు. రైతులమై మా పంటను కాపాడుకోవాలనుకుంటే నేరస్తుల్లా వ్యవహరించడం చాలా బాధాకరం. ఇవాళ వైయస్ జగన్ గారిని కలిసి ఈ విషయాలన్నీ వివరించాం. ఆయన మా సమస్యలు విని మాకు భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. రైతులకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం అన్యాయం: అంబటి వెంకటేశ్వరరావు మేం పండించిన పంటలను దాచి పెట్టుకుంటే మాపైనే దాడి చేసి 14 మంది కాపులపై అక్రమ కేసులు పెట్టారు. ఈ జొన్నలు మావేనని చెప్పినా మమ్మల్ని పక్కకు నెట్టేశారు. అక్కడ ఒక్క ఎస్సీ వ్యక్తి కూడా లేరు. అలాంటిది మాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం అన్యాయం. అక్కడే ఎస్‌ఐ కూడా ఉన్నారు. ఆయనను అడిగితే నిజం తెలుస్తుంది. మేం ఎవరినీ తిట్టలేదు. మా ధాన్యం మాకు ఇవ్వాలని తహశీల్దార్‌ను వేడుకుంటూ అడ్డుపడ్డామే కానీ ఎవరిపైనా దురుసుగా ప్రవర్తించలేదు. అంబటి మురళీకృష్ణ మా ఊరిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. పవన్ కళ్యాణ్‌ను చూసి పొన్నూరు నియోజకవర్గంలోని కాపులంతా ఓట్లు వేశారు. మావిళ్లపల్లికి చెందిన మురళీకృష్ణకు మేం మద్దతుగా ఉన్నామనే కారణంతో మాపై దౌర్జన్యం చేస్తున్నారు. రాజకీయాలు ఉంటే నాయకులు చూసుకోవాలి కానీ, సముద్రయ్యకు చెందిన షెడ్డుపై ఇలా దాడులు చేయడం చాలా దారుణం. రైతులు పండించిన పంటను కాపాడుకోవడమే మా తప్పా?