తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ను ఆక్వా సాగులో అగ్రగామిగా నిలబెట్టిన రైతాంగం, నేడు కూటమి ప్రభుత్వ అసమర్థత మరియు 'కమీషన్ల' కక్కుర్తి పాలన వల్ల తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని వైయస్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ ఎం.వి.యస్. నాగిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆక్వా ఫీడ్ ధరల పెంపు వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. ఆక్వా ఫీడ్ కంపెనీలతో కుమ్మక్కై, అప్సడా (APSADA) చట్టాన్ని పక్కనబెట్టి, ఏకపక్షంగా మేత ధరలను పెంచడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ఒకవైపు రొయ్యల ధరలు పడిపోయి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే, ప్రభుత్వం మాత్రం ఫీడ్ కంపెనీల దోపిడీకి వత్తాసు పలుకుతూ, కేంద్రం ప్రకటించిన అరకొర మద్దతు ధరలతో రైతులను మభ్యపెడుతోందని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... అప్సడా (APSADA)ను తుంగలో తొక్కిన సర్కారు: భారతదేశ ఆక్వా ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, కూటమి ప్రభుత్వం తన అసమర్థ పాలనతో తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. వైయస్. జగన్ హయాంలో ఆక్వా రైతుల కోసం ఏర్పాటు చేసిన 'ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ' (APSADA)ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రొయ్యల మేత ధరల పెంపుపై ఆప్సడా సమావేశంలో చర్చించకుండా, ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడం ప్రభుత్వానికి తెలిసే జరిగింది. వనామీ రొయ్య ఫీడ్ కేజీకి రూ. 8, టైగర్ రొయ్య ఫీడ్ కేజీకి రూ. 10 పెంచి రైతులపై మేత కంపెనీలు కోలుకోలేని భారాన్ని మోపాయి. మభ్యపెట్టే నిర్ణయాలు - ఫీడ్ కంపెనీల ధిక్కారం: ఫీడ్ ధరల పెంపుపై రైతుల నుండి నిరసన రావడంతో, ప్రభుత్వం జూమ్ మీటింగ్ పెట్టి పెంచిన ధరలను రద్దు చేస్తున్నామని ప్రకటించి చేతులు దులుపుకుంది. అయితే, అదే ఫీడ్ కంపెనీలు ధరల తగ్గింపును వ్యతిరేకిస్తూ ప్రభుత్వంకే లేఖ రాయడం, ప్రభుత్వం మౌనం వహించడం చూస్తుంటే.. ప్రభుత్వ పెద్దల అండదండలు లేనిదే ఇది సాధ్యం కాదు. రొయ్యల సాగులో కీలకమైన విద్యుత్, మేత ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం కిలోకు రూ. 25 వరకు పెరిగి రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు. ఆక్వా రైతుల ఇబ్బందులపై ప్రభుత్వం నామమాత్రపు జూమ్ మీటింగ్‌లతో చేతులు దులుపుకోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ప్రభుత్వం మేత ధరల పెంపును రద్దు చేసినా, కంపెనీలు దాన్ని ధిక్కరించడం వెనుక ప్రభుత్వ పెద్దల లాలూచీ ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. మే 15న జరగనున్న ఆప్సడా (APSADA) సమావేశంలో శాశ్వత ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవాలి. మరోవైపు మొక్కజొన్న రైతులకు కేంద్రం నుంచి న్యాయం జరగలేదు. మొక్కజొన్నకు అమలు చేయని 'పీడీపీఎస్' పథకం గురించి లేఖలు రాస్తూ కాలయాపన చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు రూ. 3 వేల కోట్ల నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. పొగాకు, ఆక్వా సహా ఏ రంగం చూసినా కూటమి ప్రభుత్వ హయాంలో రైతులకు నష్టాలే ఎదురవుతున్నాయి. వ్యవసాయ రంగం రోజురోజుకూ మరింత సంక్షోభంలోకి జారుకుంటోంది. కేంద్ర ఎంఎస్పీ (MSP) నిర్ణయాలు - రైతులపై మొండిచేయి: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలు (MSP) రైతులను ఆదుకునేలా లేవు. ఏపీలో పంటలకు కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీల్లో మొండిచేయి ఎదురైంది. వరి కి కేవలం 3% (క్వింటాకు రూ. 72) మాత్రమే పెంచారు. మొక్కజొన్న కు ఏడాదికి కేవలం 0.4% (రూ. 10 మాత్రమే) పెంచడం దారుణమని, ఇది ఉత్పత్తి వ్యయానికి ఏమాత్రం సరిపోదు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం 'కాస్ట్ ప్లస్ 50%' లాభం ఇవ్వాల్సి ఉండగా, కేంద్రం మొండిచేయి చూపించింది. డబుల్ ఇంజన్ సర్కార్ - డబుల్ మోసం: కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ (కూటమి) అధికారంలో ఉన్నా, రైతులకు ఏమాత్రం మేలు జరగడం లేదని నాగిరెడ్డి విమర్శించారు. మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించే యంత్రాంగం లేకపోవడం వల్లే, ఏపీలో రూ. 2,400 ఉండాల్సిన ధర రూ. 1,400 - 1,600కే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఖరీఫ్ లో పండే 13 పంటలకు కనీస మద్ధతు ధరలు నిర్ణయిస్తూ వాటిని విడుదల చేసింది. బ్యాంకులో ఎస్ బీ అకౌంట్ లో డబ్బులు వేసినా కనీసం ఐదున్నర శాతం వడ్డీ ఇస్తారు. కానీ నిన్న కేంద్రం పెంచిన ధరల్లో ఏపీకి మొండిచేయి చూపించింది. అంటే ఈ ధరలు రైతులను దృష్టిలో పెట్టుకుని పెంచిన ధరలు మాత్రం కావు. వీటిపై కేంద్రం కచ్చితంగా పునహ్ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ధరలకు కొనుగోలు చేసే యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలా లేకపోవడం వల్లే ఏపీలో శెనగధర రూ.5870 అయితే... రూ.4800కే అమ్ముకున్నారు. మొక్కజొన్న మద్ధతు ధర రూ.2400 అయితే రూ.1400 నుంచి రూ.1600కే అమ్ముకున్నారు. జొన్న, సజ్జలు, పత్తి, ధాన్యం, వేరుశెనగ పంటలకు అదే పరిస్థితి ఉంది. దీనిపై సరైన దృష్టి పెట్టి ధరలు ప్రకటించడంతో పాటు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం కాంప్రహెన్సివ్ కాస్ట్ ప్లస్ 50 శాతం ఇవ్వాలని రికమెండ్ చేసింది. ఇక్కడేమో వాస్తవ ఖర్చుల మీద 50 శాతం ఇచ్చామని ఘనంగా చెబుతున్నారు. దీనిమీద కేంద్రం పునహ్ పరిశీలన చేయాలి. అన్నింటికంటే కీలమైన అంశం కొనుగోలు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకపోతే రైతులకు ఎలాంటి మద్ధతు ధర ప్రకటించినా ఉపయోగం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈ డబుల్ ఇంజన్ సర్కారులో రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎందుకు మేలు చేయడం లేదు. మే 15న జరగబోయే ఆప్సడా సమావేశంలో ఫీడ్ ధరలను శాశ్వతంగా తగ్గించే నిర్ణయం తీసుకోవాలి. ఫీడ్ కంపెనీల సిండికేట్ అరాచకాలను అడ్డుకోవాలి. కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీ ధరలను పునఃసమీక్షించి, స్వామినాథన్ కమిటీ నివేదికను అమలు చేయాలి. కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసే యంత్రాంగాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలి. ఆక్వా రంగాన్ని జీఎస్డీపీ వృద్ధికి నిదర్శనంగా చెప్పుకునే ప్రభుత్వ పెద్దలు, అదే రంగం కష్టాల్లో ఉన్నప్పుడు కనీస స్పందన లేకుండా ఫీడ్ కంపెనీల దోపిడీకి వత్తాసు పలకడం అత్యంత దారుణమని నాగిరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వమే ఒకవైపు ధరల తగ్గింపు అని డ్రామాలు ఆడుతూ, మరోవైపు కంపెనీల చేత అదే ధరలను కొనసాగింపజేయడం వెనుక ఉన్న లాలూచీకి రైతులు నిలువెత్తు సాక్ష్యమని, కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీ (MSP) ధరలు కేవలం కాగితాలకే పరిమితం చేస్తూ, కొనుగోలు యంత్రాంగం ఏర్పాటు చేయకుండా రైతులను దళారుల చేతికి వదిలేయడం ఈ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనమని తేల్చి చెప్పారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు ప్రభుత్వం మొసలి కన్నీరు కార్చడం మానేసి, తక్షణమే పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను రద్దు చేయాలని లేనిపక్షంలో ఆక్వా రంగాన్ని నిర్వీర్యం చేసిన పాపానికి రైతాంగం త్వరలోనే ఈ కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతుందని ఎం.వి.యస్. నాగిరెడ్డి హెచ్చరించారు.