విజయనగరం: రాజాం నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజాం టౌన్ పరిధిలోని పొనుగుటివలస త్రోవలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని వైయస్ఆర్‌సీపీ రాజాం నియోజకవర్గ సమన్వయకర్త తలె రాజేష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి, ప్రస్తుత శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువ నాయకుడు బొత్స సందీప్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, రాజాం నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ నూతన కార్యాలయం ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. “ఈ కార్యాలయం కేవలం ఒక భవనం మాత్రమే కాదు.. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే సేవా కేంద్రం” అని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నిర్వహించిన రాజాం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పరిశీలకులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.