తాడేపల్లి: రాష్ట్రంలో మొక్కజొన్న రైతులకు రూ.2400 గిట్టుబాటు ధర కల్పించాలని వైయస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక తమ నేతలపై, రైతులపై టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారని, పోలీసులు వారికి వంతపాడుతున్నారని పార్టీ పొన్నూరు, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, వరికూటి అశోక్ బాబు, పీట నాగ మోహన్ కృష్ణ మండిపడ్డారు. మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేక, ప్రశ్నిస్తున్న తమను దాడులతో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో చెలరేగిపోతున్న పోలీసులపై తక్షణ చర్యలు కోరుతూ ఢిల్లీలో జాతీయ మావనహక్కుల కమిషన్, మహిళా కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయబోతున్నట్లు అంబటి మురళీకృష్ణ, వరికూటి అశోక్ బాబు, పీట నాగ మోహన్ కృష్ణ వెల్లడించారు. ప్రెస్ మీట్ లో వైయస్ఆర్‌సీపీ సమనయకర్తలు ఇంకేమన్నారంటే... - మొక్కజొన్న గిట్టుబాటు ధర అడిగితే దాడులా ? : అంబటి మురళీకృష్ణ, పొన్నూరు సమన్వయకర్త గత నెల 25న గుంటూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాలుగేళ్ల పాటు మొక్కజొన్నకు ఇచ్చిన గిట్టుబాటు ధర రూ.2400 ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ధర్నా నిర్వహించాం. ఆ క్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఐదో తేదీన మామళ్లపల్లి గ్రామంలో.. మా ఇంటి పక్కన ఉన్న ఓ గోడౌన్ ను తమ దుండగులు, నాయకులతో కలిసి పగులగొట్టి, ఆ గోడౌన్ నాదని, ఆ మెక్కజొన్నలు నావే అని చూపించేందుకు వైయస్ఆర్‌సీపీ జెండాలు తీసుకొచ్చి అక్కడ వేశారు. అదే రోజు సాయంత్రం వ్యవసాయ అధికారులు ఆ సరుకు తనిఖీ చేసి, ఆ గోడౌన్ సూదా త్రివేణిది అని, ఐదు వేల రూపాయుల పెనాల్టీ కట్టాలని నోటీసు ఇచ్చారు. దీనికి అడ్వకేట్ ద్వారా సమాధానం ఇచ్చాం. ఆ తర్వాత 10వ తేదీన స్దానిక ఎమ్మార్వో ఆ గ్రామంలో శాంతిభద్రతల సమస్య ఉందని ఈ గోడౌన్ సీల్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు ఘటనలు పొన్నూరు టీడీపీ నాయకులు, గూండాలు ఆ గోడౌన్ పగులగొట్టేటప్పుడు స్థానిక మొక్కజొన్న రైతులు అవి తమవేనని, అంబటి మురళీ కృష్ణవి కాదని చెప్తే పోలీసులు వాళ్లను లాగిపాడేశారు. పలువురు సన్న, చిన్న కారు రైతులు కూడా అడ్డుపడ్డా పోలీసులు బలవంతంగా ఈ గోడౌన్ కు సీల్ వేశారు. 14వ తేదీన గతంలో నోటీసు ఇచ్చిన సూదా త్రివేణికి మరో నోటీసు ఇచ్చారు. మీది కమర్షియల్ గోడౌన్ కాదు కాబట్టి ఐదు వేలు పెనాల్టీ కట్టాల్సిన అవసరం లేదని ఇందులో చెప్పారు. మళ్లీ 20వ తేదీన స్టాక్ స్టేట్ మెంట్ లెక్కలు కూడా సరిపోయాయని తేలింది. శాంతిభద్రతల సమస్యా లేదు, లెక్కలు కూడా సరిపోయాయి. అప్పటి నుంచీ వైఎస్సార్సీపీ నాయకులు పోరాటం చేస్తూ ఉన్నారు. ఒకటి రెండు రోజులు వైఎస్సార్సీపీ నేతలు, తటస్థంగా ఉండే వాళ్లు పరిశీలనకు వచ్చినప్పుడు అనుమతించారు. ఆ తర్వాత మాత్రం మా పార్టీ నేతలు జోగి రమేశ్, వరికూటి అశోక్ బాబు, జూపూడి ప్రభాకర్ రావు వచ్చినప్పుడు మాత్రం పోలీసులు దారుణంగా వ్యవహరించారు. మహిళలని కూడా చూడకుండా అనుచితంగా వ్యవహరించారు. - ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మితిమీరిన ఆగడాలు ప్రజా స్వామ్య దేశంలో మొక్కజొన్నల గిట్టుబాటు ధర అడిగితే ప్రభుత్వం ఇలా అణచివేస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కొన్ని వేల గోడౌన్లలో మొక్కజొన్నలు నిల్వ ఉన్నాయి. వైఎస్సార్సీపీ ఉద్యమం చేస్తుంది కాబట్టి గిట్టుబాటు ధరలు రూ.2400కు పెరుగుతాయని రైతులు ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం రూ.1400కు ఇస్తుంది, దానికి బదులు రూ.2400 ఇస్తే రైతులు వాటిని అమ్ముకుంటారు కదా అంటే ప్రభుత్వం స్పందించలేదు. ఈ రైతుల్ని పరామర్శించే పరిస్దితి మామిళ్లపల్లి గ్రామంలో లేదు. కిరాతక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ గోడౌన్ పగులగొట్టిన వారంతా టీడీపీ క్రియాశీలక నాయకులే, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులే. ఈ 31 మందిని అరెస్టు చేస్తే పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ సున్నా. ధూళిపాళ్ల నరేంద్ర పార్టీ నడుపుతున్న ప్రభుత్వమే ఆయన అనుచరుల మీదే కేసులు పట్టిందంటే అక్కడ ఎంత దౌర్జన్యకాండ చేస్తున్నారో అర్థమవుతోంది. ఆ తర్వాత మళ్లీ 14 మంది మొక్కజొన్న రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఇటికంపాడు నుంచి ఈ దౌర్జన్యకాండలో పాల్గొన్న ఆటో డ్రైవర్ ను రైతులు కులం పేరుతో తిట్టారంట. వీరంతా చిన్న, సన్నకారు, కౌలు రైతులు. అలాంటి వారి మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. వారిని పరామర్శించేందుకు వచ్చే వారిపై దౌర్జన్యకాండ చేస్తున్నారు. మహిళల్ని కింద పడేసి, తాకరాని చోట్ల తాకుతూ, దాడికి దిగుతున్నారు. వీళ్లపై దాదాపు హత్యాయత్నం చేశారు. - మామిళ్ల పల్లిలో అరాచక పరిస్ధితులు మొక్కజొన్నకు మీరు గిట్టుబాటు ధర ఇవ్వలేని పరిస్ధితుల్లో అరాచక పరిస్ధితులు సృష్టిస్తున్నారు. రైతులు, కాపు సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్న మామిళ్ల పల్లి గ్రామంలో ఎలాంటి కేసులు లేవు. అలాంటిది ఇప్పుడు గ్రామంలోకే వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. సూదా త్రివేణి గోడౌన్ పగులగొట్టారో అక్కడి నుంచి ధూళిపాళ్ల నరేంద్ర రాజకీయ జీవితం ముగింపుకు రోజులు మొదలయ్యాయి. వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రూ.2400 మద్దతు ధర మీరు ఎందుకివ్వడం లేదని ప్రశ్నిస్తున్నాను, అలాగే ఇప్పటికైనా మొక్కజొన్న కోనుగోలు కేంద్రాలు తెరిచి రూ.2400కు మొక్కజొన్న కొనుగోలు చేస్తారా లేదా ?, కాపు జాతి నలిగిపోతోంది, సన్న, చిన్నకారు కూలీలుగా ఉన్న వారు నలిగిపోతుంటే పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండటం ధర్మం కాదు, ఇప్పటికైనా బయటికి వచ్చి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరిపించాలి. మీ ధూళిపాళ్ల నరేంద్రకు బుద్దిచెప్పి రూ.2600కు కొనుగోలు చేసేలా చేయాలి. కాపు మహిళల్ని అలా తోసేసి దుర్భాషలు ఆటడం ధర్మం కాదని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి. రేపల్లె పార్టీ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు వెళ్తే.. ఆయన్ను కిరాతకంగా పోలీసులు చేతులు, కాళ్లు పట్టుకుని ఓ బట్టను తీసుకెళ్లి పారేసినట్లు పోలీసు స్టేషన్ లో పారేశారు. నేను వెళ్లి ఆవేశకావేశాలు తగ్గించి, కేసు పెట్టరన్న భరోసా కల్పించి తీసుకొచ్చాను. తెల్లారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. - పోలీసుల అకృత్యాలకు ఢిల్లీ స్దాయిలో పోరాటం వైఎస్సార్సీ పొన్నూరు సమన్వయకర్తగా పవన్ కళ్యాణ్ ను సామాన్య ప్రజానీకం తరఫున వేడుకుంటున్నా. దయచేసి రూ.2400కే మొక్కజొన్న కొనుగోలు చేయించండి, అక్రమంగా సీజ్ చేసిన గోడౌన్ ఉన్న గ్రామంలో శాంతి భద్రతల సమస్య లేదు కాబట్టి దాన్ని తెరిపించాలి. ఐదుగురు చిన్న,సన్నకారు రైతులకు వారి మొక్కజొన్నలు తిరిగి ఇచ్చేయండి, వారిపై అట్రాసిటీ కేసులు తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్దానికంగా పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య, ఎస్సై శ్రీహరి, అర్బన్ సీఐ నాయక్, చేబ్రోలు ఎస్సై నాయక్, తెనాలి సీఐ నాయక్ పై వచ్చే రెండు, మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్లి మా ఎంపీల సమక్షంలో జాతీయ మానవహక్కుల కమిషన్, మహిళా కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ లో కేసులు నమోదు చేస్తాం. వీరిపై విచారణ జరిపి ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయాలని కోరబోతున్నాం. నిర్ణీత సమయంలో న్యాయం లభించకపోతే ఆ వీడియోలు చూసి చలించిన భావి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వీరందరినీ డిస్మిస్ చేస్తామని హామీ ఇస్తున్నాం. మొక్కజొన్న రైతులు, మహిళలు ధైర్యంగా ఉండాలని కోరుతున్నాం. - రైతుల్ని ఇబ్బందిపెట్టేందుకేనా చంద్రబాబు అనుభవం? : పీట నాగమోహన్ కృష్ణ, రేపల్లె సమన్వయకర్త మామిళ్ల పల్లిలో మొక్కజొన్న రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. మొక్కజొన్న రైతులకు పక్క రాష్ట్రంలో గిట్టుబాటు ధర ఇస్తున్నప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతోంది ? ఎందుకు ఇంత మంది రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు ? ఇంత అనుభవజ్ఞుడిని అని చెప్పుకుంటున్న చంద్రబాబు దాన్ని రైతుల్ని ఇబ్బందిపెట్టడంలో చూపిస్తున్నారు. మొక్కజొన్న రైతులే కాదు ఆక్వా రైతుల్ని కూడా డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి ఇబ్బంది పెడుతున్నారు. మామిళ్లపల్లిలో 14 మంది రైతులపై కేసులు పెట్టారు. నేను సంఘీభావం తెలపడానికి వెళ్లే ఎలా ఈడ్చుకెళ్లారో అందరూ చూశారు. మీ ప్రభుత్వంలో ఉన్న కులాలనే పట్టించుకుని, ఇతర కులాల్ని ఇబ్బందులు పెడతారా ? మొక్కజొన్న రైతుల్ని ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ తరఫున పోరాటాలు తప్పవు. రాష్ట్రంలో ఏ హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారో గుర్తుపెట్టుకోండి. బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన నాతో పాటు మాజీ మంత్రి జోగి రమేశ్ మీద కూడా ఇలాగే దాడులు చేస్తున్నారు. బీసీ కులాల మీద మీకున్న గౌరవం ఇదేనా ? - ఎస్సీ, బీసీ, కాపు నేతలపై పోలీసుల దౌర్జన్యాలు : వరికూటి అశోక్ బాబు, వేమూరు సమన్వయకర్త మొక్కజొన్న రైతుల కోసం అంబటి మురళీకృష్ణ చేసిన ఉద్యమం ఎక్కడ సక్సెస్ అవుతుందో అన్న భయంతో కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. కానీ ఆయన పట్టుదల ముందు ప్రభుత్వ ఎత్తులు పారడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం పోరాటాలు చేస్తున్నాం. కానీ చంద్రబాబు పాలనలో చట్టం అమలు కావడం లేదు. ఇదే మామిళ్ల పల్లిలో సెక్షన్ 144, సెక్షన్ 30 ఎందుకు పెట్టారో డీజీపీ సమాధానం చెప్పాలి. కానీ మీ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఇద్దరు, ముగ్గురు గుమికూడకపోయినా, సభలు, సమావేశాలు పెట్టకపోయినా మురళీ గారి ఇంటికి వెళ్తుంటే ఎలా అరెస్టు చేస్తారు ? చట్టం తెలిసిన పోలీసు అధికారులు దాన్ని తప్పి ప్రవర్తించవద్దు. అంబటి మురళీ గారి ఇంట్లో ఉన్న జూపూడి ప్రభాకర్ గారిని లాక్కుని వెళ్లడం 144 సెక్షన్ కిందకు వస్తుందా చెప్పాలి. రేపల్లె సమన్వయకర్త పీట మోహన్ గారిని కూడా అంబటి మురళి ఇంటికి వెళ్తుంటే ఇదే విధంగా లాక్కెళ్లారు. దారుణంగా కొట్టారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్తను, బీసీ నాయకుడు అయిన పీట మోహన్ పై పొన్నూరు సీఐ కృష్ణయ్య మెడమీద గుద్దారు. ఆయన పోలీసు యూనిఫాం వేసుకున్నారా లేక పచ్చచొక్కా వేసుకున్నారా ? వీళ్లంతా పోలీసు వ్యవస్థను దిగజారుస్తున్నారు. పోలీసు స్టేషన్ కు వెళ్తే ఎందుకొచ్చారని పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య ప్రశ్నిస్తున్నారు. మా ఇంటికి రావాలంటే పోలీసులకు చట్ట పరిధి కావాలి కానీ మేం పోలీసు స్టేషన్ కు వెళ్లడానికి ఏ అనుమతీ అవసరం లేదు. సీఐ కృష్ణయ్య బూతులు మాట్లాడుతున్నాడు, సంస్కారవంతులం కాబట్టి బూతులు మాట్లాడొద్దు అన్నాం. నీ అంతు తేలుస్తానని బెదిరిస్తున్నాడు. వరికూటి అశోక్ బాబు దళితుడు కాబట్టి ఎలా లాక్కెళ్లినా పర్వాలేదని అనుకుంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న రాష్ట్రంలో ఎస్సీలు, కాపుల పరిస్ధితి ఇంత దారుణంగా ఉంది. పోలీసులు అదనపు ఆదాయాల కోసం పేద వర్గాల్ని లెక్కలేకుండా చూస్తున్నారు. ఓ మాజీ మంత్రి, బీసీ నాయకుడు జోగి రమేశ్ ను కాళ్లతో తంతారా ? మేం క్రిమినల్స్ కాదు, మారణాయుధాలతో తిరగడం లేదు, కేవలం ప్రశ్నిస్తున్నాం. దాన్ని తట్టుకోలేకపోతున్నారు.