అంత ఫ్రస్టేషన్‌ ఎందుకు  బాబూ? 

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ సూటి ప్ర‌శ్న‌
 

తాడేపల్లి:  చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారంటూ  వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్‌ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అంటూ వైఎస్‌ జగన్‌ నిలదీశారు.  ఈ మేరకు మామిళ్లపల్లె ఘటనలపై కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరును వైఎస్‌ జగన్‌ ’ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించారు.  
‘గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో కాపు సామాజికవర్గానికి చెందిన రైతుల పరామర్శకు వెళ్తున్న మా పార్టీ నేతలు జోగి రమేష్‌, జూపూడి ప్రభాకర్‌, వరికూటి అశోక్‌బాబు, పీట నాగ మోహన్‌ కృష్ణ, అంబటి మురళి తదితర నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దాడి అత్యంత హేయం. 

జరుగుతున్న అన్యాయాన్ని బయటి ప్రపంచానికి చూపిస్తూ, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మా నాయకులపై పైశాచికంగా వ్యవహరించి, అరెస్టులు చేసిన విధానం అత్యంత దారుణంగా ఉంది. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఎలా ఖూనీ చేస్తున్నాడో కళ్లకు కట్టినట్టు తెలుస్తోంది. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళితే చంద్రబాబుకు ఎందుకు బీపీ వస్తోంది? అంత ఫ్రస్టేషన్‌ ఎందుకు చూపిస్తున్నారు? 

మొక్కజొన్న కనీస ధర రూ.2,400 అయితే ఈ ఏడాది రూ.1,400- రూ.1,600లు కూడా రాలేదు. తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో గ్రామంలో కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు తమ మొక్కజొన్న పంటను, తమకు సంబంధించిన రైతు గోడౌన్‌లో నిల్వచేసుకుంటే, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులతో దాడులు చేయించడమే కాకుండా, ఆ రైతులపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసులు ఎందుకు పెట్టించారు? కనీస మద్దతు ధర రూ.2,400కు కొనుగోలు చేయకపోయినా, దీన్ని ఎవ్వరూ ప్రశ్నించకూడదా?, రైతులకు సంఘీభావంగా మామిళ్లపల్లె ఎవరు వెళ్తున్నా వారిపై పోలీసులతో దాడులు చేయించి, అరెస్టులు చేస్తారా?

మరోవైపు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతారా? తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొ. నాగేశ్వర్‌ గారిపై మీరు దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? ఆయన అన్ని పార్టీలమీదా విమర్శలు, అన్ని వార్తాంశాలమీద విశ్లేషణలు చేస్తారు కదా? ఆయన నిజం మాట్లాడితే కేసులా? ప్రశ్నిస్తే అరెస్టులా? విమర్శిస్తే వేధింపులా? రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌ చేశారు చంద్రబాబూ.

మీరు దాడులు చేసి, ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారు? అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి… ప్రజలు ఎల్లకాలం సహించరు. ప్రజల కోసం నిలబడటం మా బాధ్యత. మీ అక్రమాలు, మీ అణచివేతలు, మీ కక్షసాధింపులపై మా పోరాటం ఆగదు. ప్రజల పక్షాన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గళం విప్పుతూ ఉంటుంది, ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటుంది’ అని స్సష్టం చేశారు.

Back to Top