తాడేపల్లి: గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు తన అనుచరులతో కలిసి వైయస్ఆర్‌సీపీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుని వైయస్ఆర్‌సీపీలో చేరారు. వందలాది మంది అభిమానులతో కలిసి వచ్చిన మోపిదేవి శ్రీనివాసరావును శ్రీ వైయస్ జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్ మాట్లాడుతూ, మోపిదేవి శ్రీనివాసరావు ఒక పార్టీ సభ్యుడిగా కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా పార్టీలోకి వచ్చారని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఆయన తన రాజకీయ భవిష్యత్తును ఉంచారని, ఆయనకు అన్ని విధాలా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రేపల్లె నియోజకవర్గంలో యువ నాయకుడు పీటా నాగమోహనకృష్ణ పార్టీ కోసం చురుకుగా పనిచేస్తున్నారని, ఆయనకు అందరి సహకారం అవసరమని అన్నారు. మోపిదేవి శ్రీనివాసరావు కూడా నాగమోహనకృష్ణను తన సొంత తమ్ముడిలా భావించి, ఆయన గెలుపు బాధ్యత తీసుకున్నారని తెలిపారు. మోపిదేవి చేస్తున్న సేవలను ఎప్పటికీ మర్చిపోమని, వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనను చట్టసభలోకి తీసుకొస్తామని వెల్లడించారు. పార్టీ విజయం కోసం కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తకు, అభిమానులకు, ముఖ్యంగా సభకు విచ్చేసిన ప్రతి అక్కచెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి శ్రీ వైయస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, రేపల్లె నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ పీటా నాగమోహనకృష్ణ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, అలాగే పలువురు పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.