వైయస్ఆర్ కడప: తాను ఒక్క సెంటు భూమి కబ్జా చేసినట్టు నిరూపించినా రాజకీయాల నుంచి వైదొలగడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తాను తప్పు చేస్తే తన పేరు రాయాలి కానీ వైయస్ జగన్ పేరుతో తప్పుడు కథనాలు రాస్తే సహించేది లేదని ఎల్లో మీడియాకు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సవాల్ విసిరారు. వైయస్ఆర్ కడప జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్ద దస్తగిరి హత్యను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, ఎల్లో మీడియా తప్పుడు కథనాలపై కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తయ్యబ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ పేరుతో ఉన్న భూమిని లక్ష్మీ పద్మావతి కన్‌స్ట్రక్షన్స్ పేరుతో లీగల్‌గానే కొనుగోలు చేశామని, ఆ భూముల్లో ఒక్క సెంటు స్థలం కూడా నిషేధిత భూమి లేదని చెప్పారు. గతంలో ఇదే భూమిని 1989లో టీడీపీ నాయకుడు సుధీర్ కొనుగోలు చేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఈ వివరాలన్నీ సొసైటీ మీటింగ్ మినిట్స్ లోనే ఉన్నాయని, కావాలంటే పరిశీలించుకోవచ్చని చెప్పారు. రెండేళ్లలో ఏం చేశామో చెప్పుకోలేక తప్పుడు ప్రచారంతో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఇకనైనా మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి హితవు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... వైయస్ జగన్ పేరు తలచకుండా రోజు గడవవు తాము మోసే పార్టీలు బాగుండాలని మిగతా అన్ని పార్టీల మీద బురదజల్లుతూ ఎల్లో మీడియా న్యూస్ రాయకుండా వ్యూస్ రాస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. కట్టుకథలతో వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ పేపర్లను ప్రజలు పట్టించుకోవడమే మానేశారు. ఈ పేపర్ల పరిస్థితి రానురాను టాయలెట్ పేపర్ల మాదిరిగా తయారైంది. వైయస్ జగన్ గారి పేరు తలచుకోకుండా ఎల్లో మీడియాకి రోజు గడవడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇప్పటికీ వైయస్ఆర్‌సీపీ మీద పడి ఏడవడం తప్ప, ఈ రెండేళ్ల చంద్రబాబు పాలనలో ఏం చేశారో ప్రజలకు చెప్పడం లేదు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే పెద్ద దస్తగిరి హత్యను అడ్డం పెట్టుకుని వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద అసత్య ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నాయకులు వందల ఎకరాల డీ పట్టాలు ఆక్రమించుకున్నారు. రోజూ వేల టన్నుల మట్టి, ఇసుకని అక్రమంగా తరలించి జేబులు నింపుకుంటున్నారు. కానీ ఇవేవీ ఎల్లో మీడియా కళ్లకు కనిపించడం లేదా? ఈ దోపిడీ మీద చర్చ జరగకుండా ఉండేందుకే మా పార్టీ మీద నిత్యం బురదజల్లుతున్నారు. ఆ భూమి మొత్తం పట్టా భూమి తయ్యబ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ పేరుతో ఉన్న భూమి పూర్తిగా పట్టా భూమి. అందులో ఒక్క సెంట్ స్థలం కూడా నిషేధిత జాబితాలో లేదు. నిబంధనల ప్రకారమే డబ్బులు చెల్లించి లక్ష్మీ పద్మావతి కన్‌స్ట్రక్షన్స్ పేరుతో ఆ స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ లక్ష్మీ పద్మావతి కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలో మా కుటుంబ సభ్యులతోపాటు పెద్ద దస్తగిరి మరో నలుగురు భాగస్వాములుగా ఉన్నారు. 25 ఏళ్లుగా అదే కమిటీ కొనసాగుతోంది. ఈ కమిటీ మీటింగ్ మినిట్స్‌లో ఆ భూములకు సంబంధించి అన్ని వివరాలు ఉన్నాయి. ఇందులో దాచడానికి ఏమీ లేదు. మాకన్నా ముందు గతంలో 1989లో టీడీపీ లీడర్ సుధీర్ ఈ భూములను కొనుగోలు చేశాడు. లీగల్‌గా మార్కెట్ ధరకే ఆ భూములను కొనుగోలు చేయడం జరిగింది. నా మీద భూ కబ్జా ఆరోపణలు చేస్తూ వార్తలు రాస్తున్న పేపర్లు, మీడియా ఛానెళ్లు నేను ఒక్క సెంటు భూమి కబ్జా చేశానని నిరూపించినా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవడానికి సిద్ధం. నా మీద తప్పుడు కథనాలు రాసిన పత్రికలు, ఛానెళ్ల మీద పరువు నష్టం దావా వేస్తా. సివిల్, క్రిమినల్ సెక్షన్ల కింద కేసులు పెడతా. నేను తప్పు చేసి ఉంటే నా పేరు రాయాలి. మధ్యలో వైయస్ జగన్ గారి పేరు ఎందుకు రాస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో వందలాది ఎకరాల రైతుల భూములు కబ్జా చేశారు. వాటి గురించి సమాధానం చెప్పే దమ్ముందా? అని రవీంద్రనాథ్ రెడ్డి సవాల్ విసిరారు.