కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని పరామర్శించిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు

కక్షసాధింపు రాజకీయాలు కొనసాగుతున్నాయని మండిపడ్డ కాకాణి గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు: నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న ఎన్‌డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవ‌య్య గురువారం కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆరోగ్య పరిస్థితి, జైలు పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాష్ట్రంలో టీడీపీ పాలనలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు రాజకీయాలు కొనసాగుతున్నాయని విమర్శించారు.

రాజకీయ ప్రతీకార ధోరణితోనే అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించిన ఆయన, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ వేధింపుల పాలన కొనసాగుతోందన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలకు ప్రజలే తగిన సమయంలో సమాధానం చెబుతారని పేర్కొన్నారు.

Back to Top