అనంతపురం: నగరంలో ప్రత్యేక అధికారుల పాలనలో నగర ప్రజల సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు.తన కార్యాలయంలో ఆయన వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్, మాజీ కార్పొరేటర్లు సైఫుల్లా బేగ్,ఇషాక్ ,వైసీపీ నాయకులు చింతకుంట మధు కిషోర్ లతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం నగర పాలక సంస్థలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న నేపథ్యంలో నగర ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.నగరంలోని తాగునీటి సమస్యతోపాటు పారిశుద్ధ్యం సమస్య అధికంగా ఉందన్నారు.నగర పాలక సంస్థ,ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఉన్నప్పటికీ కనీసం ఒక్కసారి కూడా మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి నగర సమస్యలపై కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని ఆయన ఆరోపించారు. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజలకు జవాబుదారీతనం లేకుండా పోయిందని, తద్వారా నగరంలో సమస్యలు పెరిగిపోయాయన్నారు.నగరంలో వేసవి కాలంలో తాగునీటి సమస్యపై ఎలాంటి ప్రణాళిక కనిపించడం లేదన్నారు. నగర శివారు ప్రాంతాల్లో ఇప్పటికీ పైప్‌లైన్లు వేయాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. 940 హెచ్‌పీ మోటార్‌కు రూ.1.90 కోట్ల వ్యయానికి ఆమోదం తెలిపామని చెబుతున్నప్పటికీ ప్రజలకు సరైన నీటి సరఫరా అందడం లేదని విమర్శించారు. పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందన్నారు . గత వైఎస్సార్‌సీపీ పాలనలో క్లాప్ ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించేవని, నగరంలోని 50 డివిజన్లలో ఉదయం 11 గంటలకల్లా పరిశుభ్రంగా కనిపించేవన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్లాప్ ఆటోలను తొలగించి వాటి స్థానంలో ట్రాక్టర్లను ఏర్పాటు చేశారన్నారు. చిన్న చిన్న వీధుల్లోకి ట్రాక్టర్లు వెళ్లే అవకాశం లేకపోవడంతో పాటు అవసరమైన సంఖ్యలో ట్రాక్టర్లు కూడా లేకపోవడం వల్ల చెత్త పూర్తిగా నగరం బయటకు వెళ్లడం లేదన్నారు. డీజిల్‌కు డబ్బులు లేవనే కారణంతో చెత్త వాహనాలను కూడా తిప్పడం ఆపేశారని ఆరోపించారు. దీంతో నగరంలో చెత్త మరింత పేరుకుపోయి కాలువలు పూడిపోయాయని, మురికి నీరు రహదారులపైకి పొంగిపొర్లుతోందని విమర్శించారు.నగర పాలక సంస్థలో కీలక విభాగాలు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో 15 మంది అధికారులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్క అధికారి మాత్రమే పనిచేస్తున్నారు. ఎంహెచ్ఓ పోస్టు చాలా కాలంగా ఖాళీగా ఉందని, అదనంగా వంద మంది వర్కర్లను నియమించాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. వీధి కుక్కల సమస్య కూడా తీవ్రంగా పెరిగిపోయిందన్నారు.ఇటీవల నగర పాలక సంస్థలో జరిగిన ఏసీబీ దాడులను ప్రస్తావిస్తూ కూటమి పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు.నిరుపేదలకు ఇళ్లు మూడు నెలల్లో సిద్ధమవుతాయని ఎమ్మెల్యే పదేపదే చెబుతున్నారని, అదే మాట ఎన్నిసార్లు చెబుతారని ప్రశ్నించారు.డంపింగ్ యార్డ్ తరలింపు అంశం ఏమైందో కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్నారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు ఇటీవల తనపై కూడా అక్రమ కేసు పెట్టె ప్రయత్నం చేస్తున్నారన్నారు.కేసులకు బయపడమని ప్రజల సమస్యలపై స్పందించకపోతే వైసీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని, నగర ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. .