భూములు కోల్పోయిన పేదల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం 

 తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త భూమ‌న అభిన‌య్‌రెడ్డి

తిరుపతి :  భూములు కోల్పోయిన పేద‌ల ప‌క్షాన వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేస్తుంద‌ని తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త భూమ‌న అభిన‌య్‌రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో తిరుపతి వైయ‌స్ఆర్‌సీపీ ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. గంగమ్మ ఆలయాన్ని రూ.13 కోట్ల వ్యయంతో రాతి నిర్మాణంగా అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

తిరుపతిలో గత ఏడాది కాలంగా రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయని ఆరోపించారు. కోట్లాది రూపాయల విలువైన భూములను కాజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. దౌర్జన్యంగా ఇళ్లు కూల్చివేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు.  ఫోటోలు, వీడియోలు తీసే వారిని రౌడీ గుంపులు బెదిరిస్తున్నప్పటికీ పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదన్నారు. తిరుపతిలో టీడీపీ నాయకులు చెప్పిన వారికే రక్షణ కల్పిస్తున్నారనే పరిస్థితి నెలకొందని విమర్శించారు. భూములు కోల్పోయిన పేదల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలుస్తుందని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని భూమన అభినయ్ రెడ్డి స్పష్టం చేశారు.
 

Back to Top