తాడేపల్లి : అమరావతి రాజధాని పేరుతో వ్యవస్థీకృత అవినీతి, వివక్ష కొనసాగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబు కలలు కనే అమరావతి ఎప్పటికి పూర్తి అవుతుందో ఎవరికీ అంతుపట్టటం లేదని, ఐదు లక్షల మందిని సర్వనాశనం చేసే బదులు మావిగన్ రాజధానే బెటర్ అని అభిప్రాయపడ్డారు. రాజధాని నిర్మాణం పేరుతో సామాన్య రైతులను మోసం చేస్తూ, చంద్రబాబు సన్నిహితులకు మాత్రమే లాభాలు చేకూరుస్తున్నారని విమర్శించారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు కలలు కనే అమరావతి రాజధాని ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. ఐదు లక్షల మందిని సర్వనాశనం చేసే రాజధాని కంటే “మావిగన్ రాజధాని” మేలు చేస్తుందని పేర్కొన్నారు. దీనిపై వైయస్ జగన్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా, తన మంత్రులతో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో అవినీతి మాత్రమే కాకుండా వ్యవస్థీకృత వివక్ష కూడా జరుగుతోందన్నారు. సీఆర్‌డీఏ చట్టంలోని నిబంధనలు సామాన్య ప్రజలు, రైతులకు మాత్రమే వర్తిస్తున్నాయని, చంద్రబాబు మరియు ఆయన అనుచరులకు మాత్రం వర్తించడం లేదని ఆరోపించారు. చంద్రబాబు E6 రోడ్డులో ఐదు ఎకరాల్లో భారీ భవనం నిర్మిస్తున్నారని, ఆ స్థలం ఇచ్చిన కంచర్ల కుటుంబానికి అక్కడే ప్లాట్లు కేటాయించడంపై ప్రశ్నలు లేవనెత్తారు. 2024లో ప్లాటు కేటాయించి, 2025లో చంద్రబాబు కొనుగోలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు మధ్యలో చంద్రబాబుకు ఎలా స్థలం లభించిందని, సాధారణ రైతులకు అలాంటి ప్రదేశాల్లో ఎందుకు ప్లాట్లు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటి పక్కన ఎవరూ ఉండకూడదన్నట్లు గ్రీన్ బెల్ట్‌గా ప్రకటించారని ఆరోపించారు. మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ ప్లాట్లు ఇవ్వలేదని, కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు, బెజవాడ రమేష్ వంటి వారికి కీలక ప్రాంతాల్లో ప్లాట్లు కేటాయించారని విమర్శించారు. చంద్రబాబు అనుచరుల్లోని కొందరికే రాజధానిలో న్యాయం జరుగుతోందని అన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని రైతులను “గెట్ అవుట్” అంటూ అవమానపరుస్తున్నారని, ఆయన ఎదుట సెల్‌ఫోన్‌లో మాట్లాడటానికీ వీల్లేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఈ వ్యవహారాలతో రాజధాని రైతులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని పేర్కొన్నారు. జూన్‌లో వర్షాలు పడితే అమరావతిలో మళ్లీ నీరు నిలిచి పనులు ఆగిపోతాయని, రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెండో విడతలో భూములు ఇవ్వని రైతుల భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారని ఆరోపించారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు వైయస్ఆర్‌సీపీ పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేసిన పేర్ని నాని, ఒకవేళ ప్రభుత్వం భూములు తీసుకుంటే భవిష్యత్తులో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక తిరిగి రైతులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. లక్షన్నర చదరపు అడుగులతో చంద్రబాబు ఇల్లు వేగంగా పూర్తవుతుండగా, అమరావతి నిర్మాణం మాత్రం ఎక్కడిదక్కడే ఉందన్నారు. అమరావతిలో అద్దాలకు రూ.2,500 కోట్ల ఖర్చు పెట్టడం దోపిడీకి నిదర్శనమని విమర్శించారు. రైతుల కన్నీళ్లు పెట్టించిన ఏ రాజ్యం కూడా బాగుపడలేదని పేర్కొన్న పేర్ని నాని, రాజధానిలో నిర్మించే ప్రతి ప్రభుత్వ భవనం సీఆర్‌డీఏకు అద్దె చెల్లించాల్సిన పరిస్థితి అత్యంత దురదృష్టకరమని అన్నారు.