కాకినాడ: చంద్రబాబు అసమర్థత, ప్రభుత్వ అవినీతిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేక జగనన్న కనెక్ట్స్ సోషల్ మీడియా ఖాతాలను సస్పెండ్ చేయించే కుట్రలకు చంద్రబాబు తెరలేపాడని వైయస్ఆర్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇన్నాళ్లూ సోషల్ మీడియా సైనికులను అక్రమ కేసులతో వేధించిన ప్రభుత్వం, ఇప్పుడు ఏకంగా అకౌంట్లు సస్పెండ్ చేయించాలని పోలీసుల ద్వారా మెటా, ఎక్స్‌కి నోటీసులు పంపుతోందని మండిపడ్డారు. మంత్రివర్గ నిర్ణయాలను యథావిధిగా పోస్టు చేస్తే ఆ పోస్టులను వాటిని డిలీట్ చేయాలని నోటీసులు ఇవ్వడం అంటే ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టే కదా అని ప్రశ్నించారు. వారే తప్పులు చేస్తూ, విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ పోతూ వాటిని ప్రశ్నించిన వారి గొంతునొక్కాలని చూడటం అవివేకం అన్నారు. విమర్శలకు సమాధానం చెప్పుకోలేక అభద్రతా భావంతో భయపడి పారిపోవడమే అవుతుందని చెప్పారు. రెండేళ్ల కూటమి పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని, ఏ రంగం చూసినా అధోగతిపాలైందని ఆరోపించారు. చంద్రబాబు పాలన చూస్తే రాబోయే ఎన్నికల కోసం ఓటేసిన ప్రజల కన్నా ఈవీఎంలను, కేంద్రంలోని బీజేపీనే ఎక్కువగా నమ్ముకున్నట్టుగా అర్థమైపోతోందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... - వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియాని చూసి వణుకు చంద్రబాబు మాయమాటలు నమ్మి, ఆయన మారిపోయాడేమో అనుకుని ఓటేసిన ప్రజలు రెండేళ్లుగా కూటమి ప్రభుత్వ మోసాలను చూసి విసిగిపోయారు. రెండేళ్ల పాలన చూస్తే ప్రజలకిచ్చిన ఏ హమీ నెరవేర్చకపోయినా పబ్లిసిటీతో కేంద్రం వద్ద పరపతి పెంచుకోవాలని చూడటం, స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాట తప్ప ఏమీ కనిపించడం లేదు. కూటమి నాయకుల స్వార్థాన్ని ప్రజలు అర్థం చేసుకున్నప్పుడల్లా ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్ చేసి పబ్బం గడిపేసుకుంటున్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు.. ఇలా ప్రతి వర్గానికీ ప్రభుత్వంపై నమ్మకం పోయింది. ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని ప్రశ్నిస్తే అణగదొక్కడం ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులను ప్రభుత్వమే కాలరాస్తుంది. అభిప్రాయాలను వెల్లడించడం కూడా తీవ్రమైన నేరంగా పరిగణించి కేసులు పెడుతున్న తప్పుడు సాంప్రదాయాలను రెండేళ్లుగా కొనసాగిస్తున్నారు. ఎల్లో మీడియా వికృత పోకడలను తూర్పారబడుతున్న సోషల్ మీడియా ప్రభావాన్ని కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. అందుకే సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలని తపిస్తున్నారు. ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని, వైయస్ఆర్ సీపీ నాయకులను కూటమి నాయకులు, కార్యకర్తలు ఏమైనా అనొచ్చు. వాటికి దీటుగా బదులిస్తే మాత్రం మా సోషల్ మీడియా వారియర్స్‌ను కేసులతో వేధిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వ హననం చేయడమే లక్ష్యంగా అభద్రతా భావంతో పనిచేస్తున్నారు. - సోషల్ మీడియా ఖాతాలను సస్పెండ్ చేయించే కుట్ర విమర్శలకు సమాధానం చెప్పుకోలేక ఇన్నాళ్లూ సోషల్ మీడియా సైనికులను కేసులతో వేధించిన ప్రభుత్వం కొత్తగా వారి సోషల్ మీడియా ఖాతాలను సస్పెండ్ చేయించే పనిలో నిమగ్నమైంది. పోలీసులు అధికార పార్టీకి పూర్తిగా సరెండర్ అయిపోయి వారి చేతుల్లో ఆయుధాలుగా మారిపోయారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టిన పోస్టులు తొలగించాలని నేరుగా పోలీసులే ఆదేశాలు జారీ చేయడం సిగ్గుచేటు. ఖాతాలను సస్పెండ్ చేయిస్తామని బెదిరిస్తున్నారు. జవాబుదారీగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం లీగల్ ప్రొసీజర్స్ అన్నింటినీ బైపాస్ చేశారు. ఇప్పటికే వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా వారియర్స్ మీద వేలాది కేసులు పెట్టి వేధిస్తున్నారు. పార్టీ మీడియా విభాగం చూస్తున్న పూడి శ్రీహరి గారిని అక్రమ కేసులతో నిర్బంధించాలని చూశారు. వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధులు ప్రెస్‌మీట్ పెట్టినా కేసులు పెడుతున్నారు. పార్టీ మద్ధతుదారులు అనేవారు లేకుండా చేయాలనే ఆశయంతో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా జగనన్న కనెక్ట్స్ అనే సోషల్ మీడియా ఫ్లాట్‌పాంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ ఒక అబద్ధాన్ని సృష్టించారు. నార్త్ ఇండియాలో పోస్టులు పెట్టిన కొన్ని ఐడీలతో ఒక జాబితాను రూపొందించి దానికి బాధ్యులుగా వైయస్ఆర్ సీపీ నాయకులను చూపించి జగనన్న కనెక్ట్స్ అనే అకౌంట్‌కి బాధ్యత అంటగట్టి నోటీసులు ఇప్పించారు. ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? ఈ అకౌంట్‌కి రీచ్ ఎక్కువగా ఉందన్న కారణంతో దాన్ని ఎలాగైనా క్లోజ్ చేయించాలన్న కుట్ర జరుగుతోంది. - టీడీపీ అధికారిక ఖాతాల్లో అబద్ధాలు, బూతులు టీడీపీ నాయకులు తమ అధికారిక సోషల్ మీడియా ఐడీల నుంచి అసభ్య పదజాలంతో తప్పుడు సమాచారంతో వైయస్ఆర్ సీపీ ని హేళన చేస్తూ పోస్టులు పెడితే తప్పు లేదు. కానీ ప్రభుత్వ ఆగడాలను వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించడం తప్పైపోయింది. పోలీసులు అధికార పార్టీ అకౌంట్ల విషయంలో ఒకలా, వైయస్ఆర్ సీపీ అకౌంట్ల విషయంలో ఇంకోలా వ్యవహరిస్తున్నారు. అమరావతి రాజధాని ముసుగులో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తూ వైయస్ఆర్ సీపీ అధికారిక ఖాతాలో పోస్ట్ పెడితే ఆ కంటెంట్‌ను తీయించమని ఎక్స్‌కి పోలీసులు నోటీసులు పంపుతారు. కూటమి ప్రభుత్వం వచ్చాక శ్రీకాళహస్తి ఆలయంలో జరుగుతున్న దోపిడీని ప్రశ్నిస్తూ ఒక ఎన్నారై మహిళ వీడియో మాట్లాడి తన సొంత అకౌంట్‌లో పోస్ట్ పెట్టింది. దాన్ని జగనన్న కనెక్ట్స్ నుంచి షేర్ చేయడంతో తట్టుకోలేక వైయస్సార్సీపీ కార్యకర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు. కర్నూలు బస్ ప్రమాదం గురించి మాట్లాడినందుకు వైయస్ఆర్ సీపీ నాయకులు అవుతు శ్రీధర్, కారుమూరి వెంకటరెడ్డి మీద కేసులు పెట్టారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి గురించి తెనాలికి చెందిన వ్యక్తి మాట్లాడితే ఆయన మీద మదనపల్లెలో కేసు పెట్టారు. అమరావతిలో భవనాలకు అద్దాలు బిగించడానికి రూ. 2540 కోట్లు ఖర్చు చేయనున్నట్టు మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం ఈనాడులోనే వచ్చింది. ఇదే విషయాన్ని పోస్టు పెట్టినందుకు కూడా ఎక్స్‌కి పోలీసులు నోటీసులు పంపారు. బిగించే అద్ధాలు, చేయని అబద్ధాలపై మాట్లాడితే వారికి నచ్చడం లేదు. - కేంద్ర పథకాల నిధులు వాడుకోలేని అసమర్థత కెకె లైన్ లేకుండా విశాఖ రైల్వేజోన్ ప్రకటిస్తే కూటమి ప్రభుత్వం సిగ్గులేకుండా స్వాగతించింది. కేంద్ర పథకాల నిధులు వాడుకోలేకపోవడం వల్ల ఈ ఒక్క ఏడాది రూ. 5321 కోట్లు మురిగిపోయాయని ఆంధ్రజ్యోతి కూడా రాసింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సాధించుకోవడం చేతకాక ప్రతి మంగళవారం అప్పుల కోసం ఆర్బీఐ ముందర నిలబడాల్సిన అవసరం ఏమొచ్చింది? అధిక వడ్డీలకు అప్పులు తేవాల్సిన అవసరం ఏముంది? కేంద్రం ఇచ్చిన గ్రాంటులను వాడుకోలేకపోవడం కూటమి ప్రభుత్వ అసమర్థత కాదా? కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఏ రంగం చూసినా అధోగతిపాలైనట్టే కనిపిస్తోంది. వ్యవసాయాన్ని గాలికొదిలేసి రైతులను నిండా ముంచేశారు. ప్రజాసమస్యలు కూటమి నాయకుల కళ్లకు అసలు కనిపించడం లేదు. రెండేళ్లయినా ఇప్పటికీ ప్రతిపక్ష నాయకుడిని బాధ్యుడిని చేయాలన్న ప్రయత్నమే తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే ఈవీఎంలను, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్నే నమ్ముకున్నట్టు అర్థమవుతోంది. ప్రభుత్వ అసమర్థత మీద వైయస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలే కాదు.. ఎంతోమంది మేధావులు, రిటైర్డ్ అధికారులు, ఉద్యమకారులు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కాలని చూడటం కన్నా అవివేకం ఇంకోటి ఉండదు. ఇప్పటికైనా నిరంకుశ విధానాలను మానుకుని ప్రజా పాలన సాగించాలి. అమరావతిని రియల్ ఎస్టేట్ వెంచర్‌ని ప్రమోట్ చేసినట్టు చంద్రబాబు ప్రమోట్ చేసుకోవడం విడ్డూరంగా ఉంది. అమరావతి అనేది చంద్రబాబు కలల రాజధానే కానీ, ప్రజా రాజధాని కాదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు.