తాడేపల్లి : వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన రైతు విభాగ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం, రైతు సంక్షేమం) ఎంవీఎస్ నాగిరెడ్డి జూమ్ కాల్ ద్వారా హాజరై కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రారంభంలో కొద్దిమంది నిపుణులతో మొదలైన రైతు విభాగం తక్కువ సమయంలోనే విస్తరించి, ఇప్పుడు పెద్ద సంఖ్యలో సభ్యులతో బలంగా మారిందని పేర్కొన్నారు. మొదటి నుంచి రైతులకు సహాయకారిగా ఈ విభాగం పనిచేస్తోందని గుర్తుచేశారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, ఆ కాలంలో రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా కొనసాగిందని అన్నారు. కానీ ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. గత 22 నెలల్లో రైతులు దాదాపు రూ.25 వేల కోట్ల నష్టం చవిచూశారని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి రైతులకు సరైన సహాయం అందడం లేదని, ఈ పరిస్థితుల్లో వైయస్ఆర్‌సీపీ రైతు విభాగం మరింత చురుకుగా పనిచేసి రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రైతు సమస్యలపై గట్టిగా స్వరం వినిపిస్తూ ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. అలాగే గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం రైతులకు చేసిన మేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రస్తుత ప్రభుత్వ వ్యవసాయ విధానాలను ఎండగట్టాలని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రైతు పక్షపాత దృక్పథంతో పనిచేస్తూ రైతాంగానికి న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.