ప్రజల సమస్యలను గాలికి వదిలి మంత్రులు విదేశీ పర్యటనలు

శాస‌న మండ‌లి విప‌క్ష నేత‌ బొత్స సత్యనారాయణ ఆగ్రహం 

మావిగన్ పేరు చెప్తే ఉలిక్కిపడుతున్నారు..

గోవాడ బకాయిలు చెల్లించకపోతే ప్రత్యక్ష పోరాటం తప్పదని బొత్స హెచ్చరిక 

విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా మంత్రులు విదేశీ పర్యటనల్లో నిమగ్నమవుతున్నారని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. ప్రజల జీవన సమస్యలు రోజురోజుకీ తీవ్రమవుతున్నప్పటికీ, ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల బకాయిలు ఇప్పటికీ చెల్లింపులు జరగకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోందని తెలిపారు. బకాయిలు వెంటనే చెల్లించకపోతే ప్రత్యక్ష పోరాటం తప్పదని స్పష్టం చేశారు. మావిగన్ పేరు చెప్తే కూటమి నేతలు ఉలిక్కిపడుతున్నారు అంటూ వ్యాఖ్యానించిన ఆయన, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన చోట ఇతర విషయాలతో దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. శుక్ర‌వారం ఆయ‌న విశాఖ‌లో మీడియాతో మాట్లాడారు. 

ఎన్నికలకు ముందు గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కాపాడుతామని కూటమి నేతలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకు రైతులకు బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. ప్రస్తుతం సుమారు రూ.36 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఫ్యాక్టరీని ఆదుకున్నామని, రైతులకు సహాయం అందించామని పేర్కొన్నారు. ఇప్పుడు బకాయిల చెల్లింపులపై స్పష్టమైన గడువు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని హెచ్చరించారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి మంత్రులు విదేశీ పర్యటనల్లో బిజీగా ఉన్నారని, విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నారో కూడా తెలియడం లేదని విమర్శించారు. అనకాపల్లిలో వైఎస్ జగన్ తీసుకువచ్చిన ప్రాజెక్టుకు ఇప్పుడు శంకుస్థాపన చేసి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఆ పరిశ్రమ సీఈఓ, ఎండీని అడిగితే అసలు ఎవరి హయంలో ఆ ప్రాజెక్టు వచ్చిందో చెబుతారని వ్యాఖ్యానించారు. పత్రికల సహకారంతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, “నేను చెప్పిన మాటల్లో ఏది అసత్యమో ఇన్‌ఛార్జ్ మంత్రి చెప్పాలి. నేను చెప్పింది అబద్ధమైతే తలదించుకుంటాను” అని సవాల్ విసిరారు.

ఉపాధి హామీ పథకంలో పనులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గీతం సంస్థలో బోర్డులు తొలగించి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు దోచుకునేందుకు అధికారాన్ని ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, వైయ‌స్ఆర్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తే ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు తెచ్చిందని, సుమారు రూ.3.70 లక్షల కోట్ల అప్పులు తీసుకుని వాటిని ఎలా వినియోగించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందులో కనీసం కొంత భాగాన్ని మెడికల్ కాలేజీల అభివృద్ధికి ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు. ప్ర‌జా సమస్యలపై నిరసనగా చేసే అమరణ దీక్షలకు జైలు శిక్షలు విధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. “దీక్షలు చేయకపోతే దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదా?” అని ప్రశ్నించారు. 

Back to Top