వైయ‌స్ జగన్‌ కలిసిన వేమూరు సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్‌ బాబు

రాధాకృష్ణ చెత్తపలుకులను సమర్ధించిన నక్కా ఆనందబాబును ప్రశ్నిస్తూ పోస్టు పెట్టాడని తనీష్ పై పోలీసుల వేధింపులు

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్‌బాబు కుటుంబ సభ్యులతో కలిసి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని  భేటీ అయ్యారు. సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసు నేపథ్యంలో తనపై జరిగిన పోలీసుల దౌర్జన్యాన్ని ఆయన వైయస్‌ జగన్‌కు వివరించారు.

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ‌ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వేమూరు టీడీపీ ఎమ్మెల్యే న‌క్కా ఆనంద‌బాబు సమర్థించడం ఎంతవరకు సమంజసం అంటూ తనీష్‌బాబు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కార్యాలయానికి చెందిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

చినపులివర్రు గ్రామంలో తెల్లవారుజామున మఫ్టీలో వచ్చిన కొల్లూరు ఎస్‌ఐ ఏడుకొండలు, మరికొందరు పోలీసులు గోడ దూకి ఇంట్లోకి చొరబడి తనను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని తనీష్‌బాబు ఆరోపించారు. “ఎవరు మీరు? నా భర్తను ఎందుకు తీసుకెళ్తున్నారు?” అని ప్రశ్నించిన తన భార్య అనూషపై, అడ్డుకున్న స్థానికులపై కూడా పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించారని వివరించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే చినపులివర్రుకు చేరుకుని పోలీసుల తీరును నిలదీసినట్లు వేమూరు వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ వరికూటి అశోక్‌బాబు తెలిపారు. సోషల్ మీడియా కేసుల్లో నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడటం ఏమిటని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా స్పందించిన వైయస్‌ జగన్‌, పోలీసుల ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఇళ్లలోకి చొరబడి వ్యక్తులను తీసుకెళ్లడం చట్టవిరుద్ధమని అన్నారు. తనీష్‌బాబుకు అవసరమైన న్యాయ సహాయాన్ని వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్ అందిస్తుందని, ఆయన కుటుంబానికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో తనీష్‌బాబు భార్య అనూషతో పాటు వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ పెరికల పద్మారావు, చిలుమూరు రామ్మోహన్‌రావు, సొంటి కామేశ్వరరావు, వసుమల్ల రోహిత్‌, అంబటి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top