అనంతపురం : రాష్ట్రంలో ప్రజలు భయాందోళనల మధ్య జీవిస్తున్నారని, బతకడం కంటే చావే శరణ్యం అనిపించే పరిస్థితులు నెలకొన్నాయని వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలోని వైయస్ఆర్‌సీపీ , బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విభాగాల నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్టికల్ 21 పూర్తిగా నిర్వీర్యమైందని, ప్రజలకు జీవించే హక్కు కూడా లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. రెడ్‌బుక్ రాజ్యాంగంగా మారిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు భద్రతతో పాటు సంక్షేమం అందిందని పేర్కొన్న శైలజానాథ్, ప్రస్తుతం వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, బీసీలు, మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ అనంతపురంలో డ్రోన్ కెమెరాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించడం కూడా ఆందోళనకరమని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గాలపై దాడులు పెరిగాయని, రాష్ట్రంలోనే కాక అనంతపురం జిల్లాలో కూడా అనేక ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. హైకోర్టులో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితులపై చర్యలు లేకపోవడం, మరోవైపు బాధితులపైనే కేసులు నమోదు చేయడం ప్రభుత్వ వైఖరికి నిదర్శనమన్నారు. జూన్ 5న అనంతపురం జిల్లా భారి బజారులో జరిగిన ఘటనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు జరిగినప్పటికీ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని విమర్శించారు. అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉన్నప్పటికీ కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం చూపారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులు, సామాజిక వర్గాలపై జరుగుతున్న వేధింపులపై ప్రభుత్వం స్పందించాలని, రాజ్యాంగ విలువలను కాపాడాలని డాక్టర్ సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైయస్ఆర్‌సీపీ జిల్లా నాయకులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.