తాడేపల్లి: డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలు, కల్తీ నెయ్యి ముసుగులో హెరిటేజ్ దోపిడీని ప్రశ్నించినందుకు, ప్రభుత్వ ఉద్యోగులకు చేసిన ద్రోహాన్ని ఎండగడుతూ మండలిలో, ప్రెస్‌మీట్‌లలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసినందుకే వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన విద్యా సంస్థలపై దాడులు చేస్తున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా ఆయన సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక పేరున్న విద్యా సంస్థలపై దాడి చేసిన ఆయన గొంతు నొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. 16వేల మందికి పైగా విద్యార్థులు, 500 మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్‌తో దాదాపు రెండు దశాబ్దాలుగా నడుస్తున్న సంస్థపై దాడులు చేసి రాజకీయ కక్షసాధింపులకు దిగడం హేయమన్నారు. ఆయన వైయస్ఆర్‌సీపీపీ ఎమ్మెల్సీగా ఉండటమే ఆయన చేసినా తప్పా అని ప్రశ్నించారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆయన వ్యాపారాలపై దాడులు చేస్తారా.? ఇదే సాంప్రదాయాన్ని రాబోయే వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో కొనసాగిస్తే చూడాలని అనుకుంటున్నారా అని నిలదీశారు. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని, రేపు సోమవారం వైయస్ఆర్‌సీపీ నాయకులు నెల్లూరు వెళ్లి ఆయన్ను కలిసి భరోసా ఇస్తారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంట.... - కూటమి ప్రభుత్వానికి కంటిలో నలుసుగా మారాడని.. పోలీసులను అడ్డం పెట్టుకుని ఇన్నాళ్లూ కూటమి నాయకులు కక్షపూరిత రాజకీయాలు చేస్తే, అదే పోలీసులు ఇప్పుడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతున్నారు. వ్యక్తిగత స్వార్థ రాజకీయాల కోసం వ్యవస్థలను నిర్వీర్యం చేసి వాడుకుంటే సమాజం ఎలా తయారవుతుందో చెప్పడానికి కృష్ణలంక సీఐ నాగరాజు కారణంగా జరిగిన సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్య దుర్ఘటనలే సాక్ష్యం. ప్రభుత్వ వైఫల్యాలు, అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తుంటే కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నొక్కడానికి తెగబడుతున్నారు. అందులో భాగంగానే నెల్లూరులోని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థలపై తనిఖీల పేరుతో దాడులకు పూనుకున్నారు. డీఎస్సీ-2025 నిర్వహణలో జరిగిన అక్రమాలు, అవకతవకులు, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపణలు చేసి ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కి లబ్ధి చేకూర్చుకున్నారని ఆధారాలతో సహా నిరూపిస్తూ వైయస్ఆర్‌సీపీతరఫున తన గొంతు బలంగా వినిపించడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కూటమి ప్రభుత్వానికి కంటిలో నలుసుగా మారాడని ఆయనపై కక్ష పెంచుకుంది. - మండలిలో, ప్రెస్‌మీట్‌లో ప్రభుత్వాన్ని నిలదీసినందుకే... మండలిలోనూ, బయటా ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి సరైన స్పందన ఉండటం లేదు. దీంతో ప్రశ్నించే గొంతు నొక్కడమే ధ్యేయంగా నిన్న శనివారం సాయంత్రం 5 గంటల నుంచి అర్థరాత్రి వరకు తనిఖీల పేరుతో ఆయన నడిపించే 6 విద్యాసంస్ధలపై ప్రభుత్వ అధికారులు దాడులు చేశారు. నెల్లూరు జిల్లాలో దాదాపు 70కిపైగా విద్యాసంస్ధలుంటే వాటిని పట్టించుకోకుండా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీలపై దాడులు చేసి విద్యార్థులను ఆందోళనకు గురిచేశారు. ఆయన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆర్ధికంగా, మానసికంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్ల నుంచే ఆయనకి చెందిన విద్యాసంస్థలు నడిపే బిల్డింగులకు నోటీసులిచ్చారు. 2002 నుంచి ఏ సమస్యా లేనిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వారికి తప్పుగా కనిపించడం రాజకీయ దురుద్దేశంతో చేసిన పనేనని ఎవరైనా చెబుతారు. వైయస్ఆర్‌సీపీ శాసనమండలి సభ్యుడిగా ఉండటమే ఆయన చేసిన తప్పా? గతంలో ఎన్నడూ లేనిది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే రాష్ట్రంలో ఇలాంటి ప్రతీకార రాజకీయాలకు పూనుకుంటున్నారు. ఆయన విద్యాసంస్థల్లో దాదాపు 16వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. 500 మందికిపైగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తూ అంతపేరున్నవిద్యాసంస్థలపై దాడులు చేయడం హేయం. రాజకీయ కక్ష సాధింపుల కోసం విద్యాసంస్థలను టార్గెట్ చేసుకోవడం దుర్మార్గం. - ఇదే సాంప్రదాయాలను వైయస్ఆర్‌సీపీపీ కొనసాగిస్తే? పేరున్న విద్యాసంస్థల మీద దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి వేధించడం ద్వారా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గొంతు మూయించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కాబట్టే నెల్లూరులో ఉన్న శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల మీద దాడులు జరగలేదు. 70కిపైగా విద్యా సంస్థలుంటే ఏ ఒక్క దానికీ అధికారులు వెళ్లలేదు. ఇలాంటి కొత్త సాంప్రదాయాలకు శ్రీకారం చుట్టి ఏం సందేశం పంపించాలని అనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే ఇదే సాంప్రదాయాలను కొనసాగించాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నదా అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే డీఎస్సీ నిర్వహణలో జరిగిన తప్పులు, అవకతవకలపై వైయస్ఆర్‌సీపీ ఎన్నో అనుమానాలు లేవనెత్తింది. మెరిట్ అభ్యర్థులకు జరిగిన నష్టాన్ని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచడం జరిగింది. చేతనైతే వాటికి సమాధానం చెప్పాలి. నష్టపోయిన వారికి న్యాయం చేయాలి. అంతేకానీ ఇలాంటి తాటాకు చప్పుళ్లకు వైయస్ఆర్‌సీపీ భయపడదు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి భయపడే ప్రసక్తే ఉండదు. బాధితుల పక్షాన వైయస్ఆర్‌సీపీ పోరాటం చేస్తూనే ఉంటుంది. - సవాల్ చేసి కనుమరుగైతే ఎలా లోకేష్? డీఎస్సీలో ఏ తప్పూ జరగలేదని భావిస్తే సీబీఐ విచారణకు ఆదేశించవచ్చు కదా. డీఎస్సీ పై చర్చకు సిద్ధమని సవాల్ చేసిన లోకేష్ ఏమైపోయాడు. ఆయన సవాల్‌ని మేం స్వీకరించి బహిరంగ చర్చకు సిద్ధమేనని గంటలోనే సమాధానం చెబితే ఆయన నుంచి సమాధానం రాలేదు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విద్యాసంస్థలపై జరిగిన దాడిని ఆయనపై జరిగిన దాడిగా వైయస్ఆర్‌సీపీ భావించడం లేదు. ఇది ప్రశ్నించే గొంతులపై భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై జరిగిన దాడిగా, విద్యారంగంపైన జరిగిన దాడిగా భావిస్తున్నాం. చంద్రశేఖర్ రెడ్డికి వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుంది. రేపు సోమవారం వైయస్ఆర్‌సీపీ నాయకులు నెల్లూరు వెళ్లి ఆయన్ను పరిశీలిస్తారు. కూటమి రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైయస్ఆర్‌సీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు వచ్చిన స్పందన చూశాకైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ప్రజాసమస్యలపై దృష్టిపెడితే మంచిది. అలాకాకుండా మూర్ఖంగా ముందుకెళితే తగిన మూల్యం చెల్లించుకొక తప్పదని లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరించారు.